ఏలూరు జిల్లా కొవ్వలి గ్రామానికి చెందిన వెలమాటి చంద్రశేఖర (వీసీ) జనార్దనరావు విద్యాభ్యాసం అనంతరం హైదరాబాద్ నగరానికి వలస వచ్చి పాశమైలారం, బాలానగర్, పటాన్ చెరు ప్రాంతాల్లో వెల్జన్ గ్రూప్ కంపెనీలను ప్రారంభించి పారిశ్రామిక వేత్తగా ఎదిగారు. 1939 జూన్ 28 వతేదీన కొవ్వలి గ్రామంలో జన్మించిన జనార్దన్ రావు అంచెలంచెలుగా ఎదిగి బడా పారిశ్రామికవేత్త అయ్యారు. వేలాది మందికి తన పరిశ్రమల్లో ఉద్యోగాలిచ్చి ఉపాధి కల్పించిన జనార్దన్ రావు సమాజ సేవా కార్యక్రమాలకు తన సంపాదనలో కొంత భాగాన్ని కేటాయించి సేవాతత్పరుడిగా నిలిచారు. పారిశ్రామిక రంగంలో విజయాలు సాధించడంతోపాటు పలు సేవాకార్యక్రమాలు చేసి జనార్దనరావు మంచి మనిషిగా నిలిచారు.
మనవడి చేతిలో తాత దారుణ హత్యకు గురయ్యాడు...
డ్రగ్స్ కు ఎడిక్ట్ అయిన మనవడు కీర్తితేజకు ఆస్తి కోసం తాతయ్యతో గొడవ పడ్డాడు. తాతయ్య ఆస్తిపై ఆశతో డ్రగ్స్ కు బానిస అయిన కీర్తితేజ రక్తసంబంధాన్ని కూడా మర్చిపోయి తాతయ్యనే కత్తితో 73 సార్లు పొడిచి అత్యంత కర్కశంగా చంపిన ఘటన హైదరాబాద్ నగరంలో సంచలనం రేపింది. క్రైం థ్రిల్లర్ సినిమాను తలపించే దారుణ ఘటన హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలోని సోమాజీగూడలో జరిగింది.
73 కత్తిపోట్లు...
86 సంవత్సరాల తాత అయిన జనార్దన్ రావును మనవడైన కీర్తితేజ 73 సార్లు కత్తితో పొడిచి చంపాడని తమ ప్రాథమిక విచారణలో తేలిందని పంజాగుట్ట ఇన్ స్పెక్టర్ బండారి శోభన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు ప్రాంతానికి చెందిన జనార్దన్‌రావు కొన్నేళ్లుగా హైదారాబాద్ లో వెల్జన్ గ్రూప్ పేరిట పరిశ్రమలు నెలకొల్పి సోమాజిగూడలో నివాసం ఉంటున్నారు.
ఆస్తి తగాదాలే హత్యకు కారణం
పారిశ్రామిక వేత్త అయిన జనార్దన్ రావుకు ఇద్దరు కూతుళ్లు. ఆస్తి పంపకాలతోపాటు వెల్జన్ గ్రూప్ కంపెనీలో డైరెక్టర్ నియామకం విషయంలో మనవడు ఆగ్రహంతో తాతయ్యను హతమార్చాడని పోలీసులు చెప్పారు. ఇటీవల తన పెద్ద కుమార్తె కుమారుడైన శ్రీకృష్ణను వెల్జాన్ కంపెనీకి డైరెక్టరుగా నియమించారు. మరో కుమార్తె సరోజినీదేవి కుమారుడైన కిలారు కీర్తితేజ(29) పేరిట రూ.4 కోట్ల కంపెనీ షేర్లను బదిలీ చేశారు.ఈ క్రమంలో కొన్ని రోజులుగా ఆస్తుల కోసం గొడవలు జరుగుతున్నాయి. తనను కంపెనీ డైరెక్టరుగా నియమించలేదని కీర్తితేజ తాతయ్యతో గొడవపడ్డాడని పోలీసులు చెప్పారు.
తాతయ్యతో కీర్తి తేజ వాగ్వాదం
గురువారం రాత్రి సరోజినీదేవి తన కుమారుడైన కీర్తితేజతో కలిసి తండ్రి జనార్దన్ రావు ఇంటికి వచ్చారు. ఆస్తి పంపకాల విషయంలో తాతయ్యతో కీర్తితేజ వాగ్వాదానికి దిగాడు.తండ్రికి టీ తెచ్చేందుకు సరోజినీదేవి వంట ఇంట్లోకి వెళ్లగా, ఇదే అదనుగా భావించిన కీర్తితేజ తన వెంట తెచ్చుకున్న కత్తితో తాత జనార్దన్ రావును 73 సార్లు పొడిచాడు.అరుపులు, కేకలు విన్న సరోజినీదేవి పరుగున వచ్చి కుమారుడిని వారించబోయారు.దీంతో తల్లి అయిన సరోజిని పైనా కీర్తితేజ దాడిచేసి కత్తితో నాలుగు చోట్ల పొడిచాడని పోలీసులు చెప్పారు. అక్కడే ఉన్న గార్డు వీరబాబు అడ్డుకునేందుకు యత్నించగా దగ్గరకు రావద్దని హెచ్చరించాడు.తీవ్రంగా గాయపడిన సరోజినీదేవి జూబ్లీహిల్స్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కీర్తితేజ రక్తనమూనాలు డ్రగ్ టెస్టుకు...
తాతయ్యను అత్యంత దారుణంగా హతమార్చిన కీర్తితేజ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు.కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు శనివారం నిందితుడిని పంజాగుట్టలోని భీమా జ్యువలరీ వద్ద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.అమెరికా నుంచి 2018వ సంవత్సరంలో హైదరాబాద్ వచ్చిన కీర్తితేజ మాదకద్రవ్యాలకు బానిసనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేశారు.దీంతో కీర్తి తేజ రక్తనమూనాలను సేకరించి డ్రగ్ టెస్టు కోసం నార్కొటిక్స్ ల్యాబరేటరీకి, ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించామని పంజాగుట్ట ఇన్ స్పెక్టర్ బండారి శోభన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
పారిశ్రామికవేత్త జనార్దనరావు హత్య వార్తతో అలముకున్న విషాదం
సమాజ సేవాతత్పరుడైన జనార్ధన్ రావు హత్య వార్తతో హైదరాబాద్ నగరంలోని వెల్జన్ గ్రూప్ ఉద్యోగులు, అతని స్వస్థలమైన ఏలూరు జిల్లాలోని కొవ్వలి గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేసిన గొప్ప మానవతావాది జనార్దనరావు సొంత మనవడి చేతిలోనే హత్యకు గురయ్యాడనే విషయం తెలుసుకున్న ప్రజలు కన్నీరుమున్నీరుగా రోదించారు.
సేవాతత్పరుడు...జనార్దన్ రావు దారుణ హత్యకు గురైన మృతుడు జనార్దన్ రావు పారిశ్రామికవేత్తగా ఎదిగి పలు సేవాకార్యక్రమాలు చేపట్టారు. గతంలో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి విడతలవారీగా రూ. 40 కోట్లు,తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.40 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు స్వచ్చంధ సంస్థలకు కూడా విరాళాలు అందజేశారు.
కన్నీరు పెడుతున్న కొవ్వలి గ్రామస్థులు
జనార్దన్ రావు తన స్వగ్రామమైన కొవ్వలిలో పలు సేవాకార్యక్రమాలు చేశారు. కొవ్వలి గ్రామంలో ఉన్నత పాఠశాల భవనాన్ని నిర్మించి వేలాదిమంది విద్యార్థులకు విద్యాదానం చేశారు. పశువుల ఆసుపత్రి భవనాన్ని అభివృద్ధి చేసి పశు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. జనార్దనస్వామి దేవాలయాన్ని నిర్మించారు. ఇటీవల మహా కుంభమేళాకు వెళ్లి వచ్చిన జనార్దన్ రావు కొవ్వలి గ్రామంలో రథసప్తమి ఉత్సవాల్లో పాల్గొన్నారు.
కొవ్వలి గ్రామస్థులతో సంబంధాలు
పారిశ్రామికవేత్తగా హైదరాబాద్ నగరంలో స్థిరపడినా జనార్దన్ రావు ఎల్లప్పుడూ తన స్వగ్రామ మైన కొవ్వలితో సంబంధాలు కొనసాగించారు. గ్రామస్థులతో తరచూ మాట్లాడేవారు. తన ఆస్తి పంపకాల తర్వాత కొవ్వలి గ్రామానికి వచ్చి ఇక్కడే శేషజీవితం గడుపుతానని జనార్దన్ రావు గ్రామస్థులకు చెప్పారు. కానీ ఈలోపే మనవడి చేతిలో దారుణ హత్యకు గురవడంతో జనార్దన్ రావు ఇక లేరనే విషయం తెలిసిన గ్రామస్థులు కన్నీరు మున్నీరయ్యారు.