
ఎంఎల్ఏ కాలేజీలో గ్రేట్ రాబరీ
ఇన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నా కోటి రూపాయల దొంగతనం జరిగిందంటే అందరు ఆశ్చర్యపోతున్నారు.
కాంగ్రెస్ ఎంఎల్ఏ కసిరెడ్డి నారాయణరెడ్డి కాలేజీలో శుక్రవారం తెల్లవారుజామున గ్రేట్ రాబరీ జరిగింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గానికి కసిరెడ్డి నారాయణరెడ్డి ఎంఎల్ఏ. ఈ ఎంఎల్ఏకి అబ్దుల్లాపూర్ మేట్ లో బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. కాలేజీలోని లాకర్లను దొంగలు పగులగొట్టి మరీ డబ్బును దోచుకున్నారు. లాకర్లలో మొత్తం కోటిరూపాయలు ఉన్నాయి. ఈఎంఎల్ఏకి మొత్తం మూడుఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. అన్నీ కాలేజీలనుండి వచ్చిన డబ్బులు అబ్దుల్లాపూర్ మెట్ లోని కాలేజీకి చేరుకున్నాయి. మొత్తం డబ్బు కోటిరూపాయలను లాకర్లలో భద్రంచేశారు.
అదనపు భద్రత కోసం సిబ్బందితో పాటు కాలేజీలో మొత్తంలో 200 సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. భద్రతా సిబ్బందితో పాటు వందలాది సీసీ కెమెరాలుండగా దొంగతనం ఎలాగ జరిగిందన్నదే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కాలేజీలోకి ప్రవేశించిన తర్వాత ఎక్కడా ఆనవాళ్ళు దొరక్కుండా దొంగలు సీసీ కెమెరా యూనిట్ ను కూడా ఎత్తుకెళ్ళిపోయారు. దొంగతనం ఇంటిదొంగల పనే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కాలేజీలో సేఫ్ లాకర్లు ఎక్కడుంటాయనే విషయం కొందరికి మాత్రమే తెలిసుంటాయి. సేఫ్ లాకర్లు ఉన్న గదిలో గట్టి భద్రతను ఎంఎల్ఏ ఏర్పాటుచేశారు. ఇన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నా కోటి రూపాయల దొంగతనం జరిగిందంటే అందరు ఆశ్చర్యపోతున్నారు.
ఇంటిదొంగల సహకారం ఉందికాబట్టే సేఫ్ లాకర్లు ఎక్కడున్నాయనే విషయం దొంగలకు తెలిసింది. అలాగే సీసీ కెమెరాల డీవీఆర్ ని కూడా దొంగలు ఎత్తుకెళ్ళారంటేనే ఇంటిదొంగల సహకారం ఉందనే అనుమానాలు బలపడిపోతున్నాయి. సీసీ కెమెరాల డీవీఆర్ ఎక్కడుంటుందనే విషయం దొంగలకు ఎలా తెలుసు ? అన్నదే ఇక్కడ పాయింట్. పోలీసులు క్లూస్ టీమ్ కాలేజీకి వచ్చి ఎంతవెతికినా ఆధారాలు పెద్దగా దొరకలేదని సమాచారం. దొంగతనం గురించి ఎంఎల్ఏ పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా ఆలస్యంచేయకుండా రంగంలోకి దిగేశారు. కాలేజీ చుట్టుపక్కలున్న సీసీ కెమెరాల్లో ఏదైనా ఆధారాలు దొరుకుతాయేమో అని చూస్తున్నారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులను చూసుంటే సమాచారం ఇవ్వాల్సిందిగా పోలీసులు స్ధానికులను అడిగారు.