హైదరాబాద్ పాతాళ గంగమ్మ పారిపోతున్నాది...
x

హైదరాబాద్ పాతాళ గంగమ్మ పారిపోతున్నాది...

అడ్డుకోకుంటే అగచాట్లు తప్పవు అంటున్న నిపుణులు


గ్రేట‌ర్ హైదరాబాద్ ప‌రిధిలో భూ గర్భ జలాలు వేగంగా తగ్గుతున్నాయి. నీటి వినియోగం పెరగడం, మ‌రో ప‌క్క నిర్మాణ రంగం ఊపందుకోవడంతో భూగర్భ జలాలు రోజు రోజుకూ అడుగంటిపోతున్నాయి. గత ఏడాది చివరిలో 5.93 మీటర్ల లోతులో ఉన్నభూగర్భ జలాలు ప్రస్తుతం 6.92 లోతుకు చేరాయి. రానున్నకాలంలో మరింతగా భూగర్భ జలాలు పడిపోయే అవకాశముందని ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

గతంలో ఎన్నడూ రానంత రీతిలో "ఆరు మెట్రో నగరాలు ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వాటర్ క్రైసిస్‌‌ని ఎదుర్కోబోతున్నాయి. ఇక గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో అయితే మంచి నీటికి మనిషి అల్లాడాల్సిన పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. న‌గ‌ర ప్రజలు తాగడానికి గుక్కెడు నీళ్లు దొరక్క నానా ఇబ్బందులు పడే ప్రమాదం కనిపిస్తోంది," అని ‘నీతి ఆయోగ్’ తాజా రిపోర్ట్ వెల్లడించింది.

నీళ్లనేవి పూర్తిగా స్టేట్ సబ్జెక్ట్. దీంతో నీళ్లకు సంబంధించిన అన్ని అంశాలపైన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయాలు తీసుకోవాలంటారు నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమితాబ్ కాంత్.

2030 నాటికి దేశ జనాభాలో 40 శాతం మందికి గొంతు తడుపుకోవడానికి నీళ్లే దొరకని పరిస్థితి వస్తుందని ‘కాంపోజిట్ వాటర్ మేనేజ్ మెంట్ ఇండెక్స్ (సీడబ్ల్యుఎంఐ)’ రిపోర్ట్ వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌‌గఢ్, తమిళనాడు సహా ఇప్పటికే అనేక రాష్ట్రాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. భవిష్యత్తులో ఈ సమస్య మరింత తీవ్రం అవుతుందని 'వాటర్ కన్సర్వేషన్‌‌'కి సంబంధించిన సర్వే తెలిపింది.

ఇటీవల కాలంలో హైద‌రాబాద్ భూగర్భ జలాల నీటి మట్టం సుమారుగా మూడు మీట‌ర్ల లోతుకు పడిపోయింది. డిసెంబరులో భూగర్భజల మట్టం 0.99 మీటర్ల నుంచి 1.96 మీటర్ల వరకు తగ్గాయి. నవంబరు చివరిలో 5.93 మీటర్ల లోతులో ఉన్న భూగర్భజలాలు డిసెంబరు చివరకు 6.92 మీటర్ల లోతుకు చేరాయి. ఎస్సార్‌నగర్‌ పరిధిలోనే భూగర్భజలాలు అత్యంత లోతున ఉన్నాయి. కూకట్‌పల్లి ప్రాంతంలో నెలలో 5.38 మీటర్లు తగ్గగా, కుత్బుల్లాపూర్‌లో 2.73 మీ. కైతలాపూర్‌లో 2.38, అమీర్‌పేటలో 2.24, సైదాబాద్‌లో 1.85, ఖైరతాబాద్‌ చింతల్‌బస్తీ ప్రాంతంలో 1.22 మీటర్ల మేర తగ్గాయి. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, అమీర్‌పేట, సైదాబాద్, చాంద్రాయణగుట్ట, ఆసిఫ్‌నగర్, దుండిగల్, జీడిమెట్ల, మల్కాజిగిరి, రాజేంద్రనగర్‌ ప్రాంతాలు అతి వేగంగా భూగర్భ జలాలు తగ్గుతున్న జాబితాలో ఉన్నాయి.

ఈ వేసవిలో హైద‌ర‌బాద్‌లో తాగునీటి సమస్య తీవ్రం కానుంది. హైదరాబాద్ నగరంలో దాదాపు ఐదు లక్షల వరకు అపార్ట్‌మెంట్లున్నాయి. వాన నీటి సంరక్షణ కోసం ప్రతి అపార్ట్‌మెంట్‌లోనూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలన్న నిబంధన ఉంది. కొన్నేళ్ల నుంచి ఈ నిబంధన అమలు కావడం లేదు. ఇదిలా ఉంటే "దాదాపు ఎనభై శాతం అపార్ట్‌మెంట్లలో అసలు ఇంకుడుగుంతల ఆనవాళ్లే లేవు. 'ఇంకుడుగుంత‌లంటే చంద్ర‌బాబు గుంట‌లు కావు' రిటైర్డ్ ఇంజ‌నీర్ టి.హ‌నుమంత‌రావు సూచించిన‌ట్లు ఏర్పాటు చేసుకోవాలి," అని ఇరిగేష‌న్ ఎన‌లిస్ట్ నైనాల గోవ‌ర్ధ‌న్ ఫెడ‌ర‌ల్ తెలంగాణాతో తెలిపారు.

"పక్కా ప్లానింగ్‌‌తో ముందుకెళితే వాటర్ రిసోర్సెస్‌‌ని పెంచుకోవచ్చంటున్నారు నైనాలా. రోడ్ల నిర్మాణంలోనూ ఎకో సిస్టం పాటిస్తే అక్క‌డ నీళ్లు ఇంకుతాయి. కానీ ప‌డిన వ‌ర్ష‌మంతా వృధాగా డ్రైనేజ్‌లో కొట్టుకుపోతోంది," అని నైనాల గోవ‌ర్ధ‌న్ త‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

"భవిష్యత్​ తరాల కోసం మనం ఇప్పటి నుంచే నీటి ఆదాపై దృష్టి పెట్టాలి. మన పిల్లల కోసం, రేపటి తరాలకోసం వాటర్ సేవింగ్​ లక్ష్యంతో పనిచేయాలి", అని ప్ర‌ముఖ ప‌ర్యావ‌ర‌ణ వేత్త డాక్ట‌ర్ లుబ్నా స‌ర్వ‌త్ ఫెడ‌ర‌ల్ తెలంగాణాతో తెలిపారు. క్రమక్రమంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. న‌గ‌రాన్ని కాంక్రీట్ జంగిల్‌గా మార్చేశారు. అక్ర‌మ నిర్మాణాలు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి.

"త‌మిళ‌నాడు, గుజ‌రాత్ రాష్ట్రాల్లో స్పాంజ్ పార్క్‌లు ఏర్పాటు చేసి వ‌ర్ష‌పు నీటిని కాపాడుకుంటుంటే మ‌న అధికారులేమో సుంద‌రీక‌ర‌ణ పేరుతో చెరువుల్ని పూడ్చేస్తున్నార‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. హైడ్రా లాంటి సంస్థ‌లే చెరువుల్ని పూడ్చేస్తున్నాయి. బాంరుక్నుదౌలా చెరువుకు సంబంధించిన‌ 10 ఎక‌రాల్ని ప్ర‌జల డ‌బ్బు ఖ‌ర్చు పెట్టి పూడ్చేశారు. ఇలా వుంటే భూగ‌ర్భ‌జ‌లాలు ఎలా పెరుగుతాయ‌ని ఆమె అంటున్నారు. గ్రేట‌ర్ ప‌రిధిలో 3 మీట‌ర్ల లోతుకు జ‌లాలు ప‌డిపోయాయ‌ని, జ‌న‌వ‌రి నెల‌లోనే ఇలాంటి ప‌రిస్థితి వుంటే మే నెల‌లో మ‌రెలా ఉంటుందోన‌ని," లుబ్నా స‌ర్వ‌త్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

జల మండలి పరిధిలో 300 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న అన్ని నివాస, నివాసేతర ప్రదేశాల్లో విధిగా ఇంకుడుగుంత ఉండాలనే నిబంధన ఉన్నా, అమలు మాత్రం నామమాత్రంగానే ఉంటుంది. జలమండలి 25,578 ప్రాంగణాల్లో తనిఖీ చేయగా, కేవలం 12,446 చోట్ల మాత్రమే ఇంకుడు గుంతలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఇంకుడుగుంతలు లేని ఆవాసాలకు వాటర్ ట్యాంకర్ ఛార్జీలను వచ్చే సంవత్సరం నుంచి రెట్టింపు చేయాలని ఇప్పటికే జలమండలి నిర్ణయించింది.

ఈ జనవరి నుంచి మార్చి నెలాఖరులోపే చాలా ప్రాంతాల్లో 10 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు చేరే అవ‌కాశం వుంది. మే నాటికి మరింత పడిపోయే ప్రమాదం ఉందని భూగర్భజల శాఖ అంచనావేస్తోంది. నగరంలో సాధారణం కన్నా అధికంగా వర్షపాతం నమోదైనా.. కాంక్రీట్ కట్టడాలతో ఆ వరద భూమిలోకి ఇంకే పరిస్థితి లేకపోవడం, విచ్చలవిడిగా బోర్ల తవ్వకం, చెరువులు, కుంటలు అన్యక్రాంతం కావడమే కారణమని భూగర్భజల శాఖ చెబుతోంది.

Read More
Next Story