కాంగ్రెస్ లోకి గూడెం... ఆయనతో పాటు మరో కీలక నేత కూడా
x

కాంగ్రెస్ లోకి గూడెం... ఆయనతో పాటు మరో కీలక నేత కూడా

బీఆర్ఎస్ వరుసగా తమ ఎమ్మెల్యేలను కోల్పోతోంది. నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు.


బీఆర్ఎస్ వరుసగా తమ ఎమ్మెల్యేలను కోల్పోతోంది. నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. సోమవారం రాత్రి పఠాన్ చెరు బీఆరెస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతోపాటు జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కూడా కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు నేతలకి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితోపాటు ఆయా నియోజకవర్గాలలో కార్పొరేటర్లు, అనుచరులు కూడా హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నీలం మధు, శశికళా యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

వీడిన సస్పెన్స్...

గత కొంతకాలంగా గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మారతారనే వార్తలు బలంగా వినిపించాయి. అయితే ఆయన ఏ పార్టీలోకి వెళతారనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. కొద్దిరోజుల క్రితం ఆయన ఢిల్లీ వెళ్లి రెండుమూడు రోజులు అక్కడే ఉన్నారు. బీజేపీ లో చేరేందుకు కమలం పెద్దలతో చర్చలు జరిపారని ప్రచారం జరిగింది. మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆయన్ని పార్టీలో చేర్చుకునేందుకు సుముఖంగా లేకపోవడంతో హైకమాండ్ వైపు నుంచి ఎంట్రీకి మార్గం సుగమం చేసుకునేందుకు హస్తినబాట పట్టరానే టాక్ కూడా వినిపించింది. అయితే శనివారం రాత్రి ఆయన సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడంతో కాంగ్రెస్ లో చేరేందుకు ఫిక్స్ అయిపోయారని భావించారంతా. ఈ నేపథ్యంలో నేడు ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుని ఉత్కంఠకి తెరదించారు.

ఆస్తులపై ఈడీ రైడ్స్...

అక్రమ మైనింగ్ కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేసింది. అక్రమ మైనింగ్ ఆరోపణలపై తెలంగాణ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా సుమారు రూ. 300 కోట్ల అక్రమ సంపాదనకు పాల్పడ్డారనే అభియోగంపై రైడ్స్ జరిగాయి. ఆఫీసులు, ఇళ్లతో సహా హైదరాబాద్, చుట్టుపక్కల 10 ప్రదేశాలలో వీరికి చెందిన ఆస్తులపై ED సోదాలు నిర్వహించింది.

ఈ సోదాల్లో లెక్కల్లో చూపని రూ.19 లక్షల నగదు, బినామీల పేర్లపై పెద్ద సంఖ్యలో ఆస్తి పత్రాలు, నగదు లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు ఉన్న మొబైల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ లాకర్ కీలు కూడా రికవరీ చేసి లాకర్‌ లలో ఉన్న 1.2 కేజీల బంగారు బిస్కెట్లను సీజ్ చేశారు. మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు అక్రమ గ్రానైట్ మైనింగ్ ద్వారా సుమారు రూ. 300 కోట్లు కూడబెట్టారని, ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ. 39.08 కోట్ల రాయల్టీని ఎగవేశారని ఆరోపించారు.

Read More
Next Story