"పక్కా లోకల్".. నామినేషన్ వేసిన బండి సంజయ్
మోదీజీని ఆశీర్వదించండి.. తెలంగాణ సంక్షేమాన్ని మోదీ చూసుకుంటారు. 400 సీట్లలో విజయం సాధిస్తాం అని ధీమా వ్యక్తం చేశారు.అని గుజరాత్ సీఎం ధీమా వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల నామినేషన్ గడువు నేటితో ముగియనుంది. దీంతో నేడు ప్రధాన పార్టీ అభ్యర్ధులతోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. ముఖ్యనేతలంతా పార్టీశ్రేణులతో కలిసి భారీగా నామినేషన్ ర్యాలీలు నిర్వహిస్తూ బలప్రదర్శన చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా నేడు అట్టహాసంగా నామినేషన్ వేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయి పటేల్, కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బలపరిచారు.
బండి సంజయ్ నామినేషన్ వేయడానికి ముందు కరీంనగర్ మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన తల్లికి పాదాభివందనం చేసి ఇంటినుండి బయలుదేరారు. అభిమానులు, బీజేపీ కార్యకర్తలతో కలిసి భారీ కాన్వాయ్ తో కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లారు. గుజరాత్ సీఎం, కిషన్ రెడ్డి, బీజేపీ నాయకులతో కలిసి తన నామినేషన్ పాత్రలను రిటర్నింగ్ అధికారిణికి సమర్పించారు. అనంతరం ఎస్ఆర్ఆర్ కళాశాల నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
నేను పక్కా లోకల్ - బండి సంజయ్
నామినేషన్ ర్యాలీలో బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభ్యర్ధి లోకలా? నాన్ లోకలా? ఆ పార్టీ కార్యకర్తలైనా చెప్పగలరా? కాంగ్రెస్ అభ్యర్థి నాన్ లోకల్. నేను పక్కా లోకల్ అన్నారు. గడీల వారసులు కావాలా? గరీబోళ్ల బిడ్డ కావాలా? అని ఓటర్లను ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు కేసీఆర్ అనే నాణేనికి బొమ్మ, బొరుసులాంటి వాళ్లు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు వందల కోట్ల ఆస్తులున్నయ్. వందల కేసులున్న నాకు మీరే ఆస్తి. వాళ్లు గెలిస్తే వేల కోట్లు సంపాదిస్తరు... నన్ను గెలిపిస్తే మీ కోసం వేల కేసులు పెట్టినా భయపడను. భారీ మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించండి అని కరీంనగర్ ఓటర్లను బండి సంజయ్ అభ్యర్ధించారు.
తెలంగాణ సంక్షేమాన్ని మోదీ చూసుకుంటారు... గుజరాత్ సీఎం
నామినేషన్ ర్యాలీలో గుజరాత్ సీఎం భూపేంద్రభాయి పటేల్ మాట్లాడుతూ.. "లోక్ సభ ఎన్నికల్లో గుజరాత్ లోని సూరత్ లోక్ సభ స్థానాన్ని బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఇంకా 399 సీట్లలో మనం విజయాన్ని అందించాలి. మోదీజీని ఆశీర్వదించండి.. ఆయన మూడోసారి ప్రధానమంత్రి కానున్నారు. తెలంగాణ సంక్షేమాన్ని మోదీ చూసుకుంటారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో 400 సీట్లలో విజయం సాధిస్తాం" అని ధీమా వ్యక్తం చేశారు.
నరేంద్ర మోదీ పాలనలో ప్రపంచంలో భారతదేశ గౌరవాన్ని పెంచారు. భారత విద్యార్థులను తిరిగి సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపిన ఘనత నరేంద్ర మోదీది. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయండి. 400 సీట్లలో విజయాన్ని అందించండి. కరీంనగర్ లో బండి సంజయ్ ని గెలిపించాల్సిన బాధ్యత మీదే అంటూ కార్యకర్తలకు గుజరాత్ సీఎం భూపేంద్రభాయి పటేల్ పిలుపునిచ్చారు.