
పురుగులన్నం, నీళ్ళచారుపై విద్యార్ధుల ఫిర్యాదు
పదో తరగతి పరీక్షల షెడ్యూలు వచ్చిన నేపథ్యంలో విద్యార్థులకు అవసరమైన అదనపు సౌకర్యాలు కల్పించేందుకు సిద్దమైనట్లు తెలిపారు.
‘‘అన్నంలో పురుగులొస్తున్నాయి. నీళ్ల చారు పోస్తున్నారు.. మెనూ పాటించడం లేదు.. ప్రశ్నిస్తే కొడుతున్నారు.. శిథిల భవనంలో..సమస్యల మధ్య బిక్కు బిక్కు మంటూ ఉంటున్నాం’’ అంటూ గురుకుల పాఠశాలల విద్యార్థులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం కలకలం సృష్టించింది. కుత్బుల్లాపూర్, హైదరాబాద్, చార్మినార్ ప్రాంతాలకు సంబంధించిన విద్యార్థుల కోసం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేటలో మూడు బాలుర గురుకుల పాఠశాలలు ఏర్పాటుచేశారు. వాటిలో 1200 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆయా గురుకులాల్లోని 50 మంది విద్యార్థులు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న శామీర్‌పేట పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. వారి సమస్యలను ఇన్‌స్పెక్టర్ శ్రీనాథ్ ముందు ఏకరువు పెట్టారు. విద్యార్థుల సమస్యలను ఓపిగ్గా విన్న ఇన్‌స్పెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు సమాచారం ఇచ్చారు. విద్యార్థులను తిరిగి పాఠశాలకు తీసుకెళ్లారు.
గురుకులానికి చేరుకుని తనిఖీలు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిణి టి.ఝాన్సీరాణి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, రెవెన్యూ అధికారులు వెంటనే గురుకులానికి చేరుకునిఅక్కడి పరిస్థితులను సమీక్షించారు. విద్యార్థులతో వేర్వేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ‘భోజనంలో పురుగులు వస్తున్నాయి. తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం, మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయి’ అంటూ విద్యార్థులు గోడు వెళ్లబోసుకున్నారు. లిఖిత పూర్వకంగానూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఝాన్సీరాణి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ప్రస్తుతం గురుకులంలో ఉన్న బియ్యంలో పురుగులు కనిపించలేదని, విద్యార్థుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వారి ఇబ్బందులు పరిష్కరించేందుకు ఉపాధ్యాయులు, విద్యార్థులతో మెస్, ఫుడ్, శానిటేషన్ కమిటీలు వేశామని, ఆయా కమిటీలు ఎప్పటికప్పుడు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తాయన్నారు. పదో తరగతి పరీక్షల షెడ్యూలు వచ్చిన నేపథ్యంలో విద్యార్థులకు అవసరమైన అదనపు సౌకర్యాలు కల్పించేందుకు సిద్దమైనట్లు ఆమె తెలిపారు.

