పదవిపై గౌరవంతో కొడుకుని పంపించేశారా?
x

పదవిపై గౌరవంతో కొడుకుని పంపించేశారా?

లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.


లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో, ఏఐసిసి రాష్ట్ర ఇంచార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి దయనీయంగా మారింది. రాజకీయ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని కీలక నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలోనే అమిత్ రెడ్డి కూడా పార్టీని వీడినట్లు స్పష్టం అవుతోంది.

వారం క్రిందట గుత్తా సుఖేందర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ కష్టాల్లో ఉందన్నారు. ఆయన కుమారుడు అమిత్ రాజకీయ భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. సరిగ్గా వారం తిరగకముందే అమిత్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే గుత్తా సుఖేందర్ మాత్రం తాను పార్టీ మారే విషయంపై క్లారిటీతో ఉన్నట్టు గతంలోనే చెప్పేశారు. తనకి పార్టీ మారే ఆలోచన లేదని, రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్నానని, ఏ పార్టీతో తనకి సంబంధం లేదని గుత్తా సుఖేందర్ తేల్చి చెప్పేశారు.

ఇక బీఆర్ఎస్ నాయకత్వం పార్టీ నిర్మాణంపై ద్రుష్టి పెట్టకపోవడం వల్లే ఇప్పుడు పరిస్థితి దిగజారిందని గుత్తా సుఖేందర్ అన్నారు. పార్టీలో అంతర్గత సమస్యలున్నాయని కేసీఆర్ కి చెప్పినా పట్టించుకోలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికలకి ఆరు నెలల ముందు నుంచే కేసీఆర్ అపాయింట్మెంట్ ఎవరికీ దొరకలేదని వెల్లడించారు. పార్టీలో నేతలకి అహంకారం నెత్తికెక్కిందని, బీఆర్ఎస్ బలంగా ఉన్న జిల్లాల్లోనూ ఓడిపోవడానికి కారణం మంత్రులేనన్నారు. ఎమ్మెల్యేల సెంట్రిక్ గా రాజకీయాలు నడపడం కూడా పార్టీకి నష్టం కలిగించిందన్నారు. ఇప్పటికైనా మేలుకోకపోతే బీఆర్ఎస్ భవిష్యత్తులో మరింత నష్టపోతుందన్నారు.

పార్టీలో పరిస్థితులపై బహిరంగంగానే గుత్తా సుఖేందర్ ఇలా మాట్లాడటం బీఆర్ఎస్ శ్రేణులని కలవరపాటుకు గురి చేసింది. ఆయన తన కుమారుడితో కలిసి పార్టీ మారతారని అంతా భావించారు. కానీ, గుత్తా అమిత్ మాత్రమే కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం శాసనమండలి చైర్మన్ గా ఉన్న గుత్తా సుఖేందర్.. తన పదవీకాలం ముగిశాక పార్టీ మారతారా అనేది వేచి చూడాలి.



Read More
Next Story