గుత్తా చెలగాటం, నల్లొండ  బీఆర్ఎస్ కు ప్రాణసంకటం
x

గుత్తా చెలగాటం, నల్లొండ బీఆర్ఎస్ కు ప్రాణసంకటం

నల్లగొండ లోక్‌సభ సెగ్మెంట్లో కాంగ్రెస్, BRS, BJP ల మధ్య హోరాహోరీ పోరు ఉండేలా కన్పిస్తోంది. అయితే, గుత్తా తిరుగుబాటుతో ఒక్కసారిగా నల్లగొండ రాజకీయాలు మారిపోయాయి.


నల్లగొండ ప్రతినిధి :

నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార పర్వం ముమ్మరంగా సాగుతోంది. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు ఉండేలా కన్పిస్తోంది. అయితే గత ఎంపీ ఎన్నికల సమయంలో రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఒక్కసారిగా తారుమారయ్యింది. ఇన్నాళ్లూ గాంభీర్యం ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు ఒక్కసారిగా బయటపడ్డాయి. నల్లగొండ రాజకీయాల్లో క్రీయాశీలక పాత్ర పోషించే గుత్తా సుఖేందర్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకత్వం.. అటు జిల్లా నాయకత్వంపై గుర్రుగా ఉన్నారనే చెప్పాలి.

ఈ క్రమంలోనే ఇటీవల బీఆర్ఎస్ తీరుపై గుత్తా సుఖేందర్ రెడ్డి బహిరంగంగానే ఫైర్ అయ్యారు. అప్పటివరకు చాప కింద నీరులా ఉన్న అసంతృప్తి కాస్త బట్టబయలయ్యింది. గుత్తా తిరుగుబాటుతో ఒక్కసారిగా నల్లగొండ జిల్లా రాజకీయాలు మారిపోయాయి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల రామకృష్ణారెడ్డి పరిస్థితి మరింతగా దిగజారిపోయింది. ఈ ఘటన బీఆర్ఎస్‌ను క్షేత్రస్థాయిలో కుదిపేసిందనే చెప్పాలి. గుత్తా తిరుగుబాటు వల్ల నల్లగొండ లోక్‌సభ ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా తయారయ్యాయి. బీఆర్ఎస్ స్వయంకృతాపరాధం వల్లే బీజేపీ రెండో స్థానానికి ఎగబాకిందని ప్రచారం లేకపోలేదు.

నిజానికి నల్లగొండ బీఆర్ఎస్‌లో ఎప్పట్నుంచో వర్గపోరు నడుస్తోంది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తన తనయుడు గుత్తా అమిత్ రెడ్డి కోసం టికెట్ ఆశించి భంగపడ్డారు. మరోవైపు గుత్తాకు మాజీమంత్రి జగదీష్ రెడ్డితో సఖ్యత లేదు. గత కొంతకాలంగా ఇరు వర్గాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. దీంతో జగదీష్ రెడ్డి వల్లే గుత్తా అమిత్ రెడ్డికి టికెట్ దక్కలేదనే కోపంలో గుత్తా వర్గం ఉంది. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల రామకృష్ణారెడ్డికి పూర్తిస్థాయిలో సహకరించేందుకు క్యాడర్ తటపటాయిస్తోంది. ఫలితంగా ఎంపీ ఎన్నికల్లో గుత్తా వర్గం ఆటోమెటిక్‌గా బీఆర్ఎస్ క్యాండిడేట్ కంచర్ల రామకృష్ణారెడ్డికి హ్యాండిస్తారనే విషయం స్పష్టమవుతోంది.

గుత్తా సుఖేందర్ రెడ్డి తిరుగుబాటు ఎఫెక్ట్ ఈసారి గులాబీ పార్టీపై బలంగానే పడనుంది. దీంతో బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోయే అవకాశాలు లేకపోలేదు. అయితే గుత్తా సుఖేందర్ రెడ్డిని సముదాయించే ప్రయత్నాలేవీ గులాబీ పార్టీని నుంచి కన్పించకపోవడంతో మరింతగా వివాదం రాజుకునే పరిస్థితి కన్పిస్తోంది. బీఆర్ఎస్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రతి నేత కీలకమే. కానీ బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్ నుంచి ఏలాంటి బుజ్జగింపు కాల్స్ రాకపోవడం గుత్తాను మరింతగా ఉడికిస్తోందని చెప్పాలి.

ఏడు అసెంబ్లీల్లో ఆరు హస్తం పార్టీవే..

మరోవైపు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఒకప్పటి వరకు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేది. దీనికితోడు కమ్యూనిస్టుల ప్రభావం ఉమ్మడి జిల్లాలో అధికంగానే ఉంటుంది. అయితే కమ్యూనిస్టు పార్టీలు క్షేత్రస్థాయిలో బలపడడం.. బీఆర్ఎస్ అధికారం కోల్పోయి చతికిల పడడంతో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం సాధించిందనే చెప్పాలి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. అందులో 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా, ఒక్క సూర్యాపేట నియోజకవర్గంలో మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గుంటకండ్ల జగదీష్ రెడ్డి విజయం సాధించారు.

ఇక లోక్‌సభ ఎన్నికల విషయానికొస్తే.. నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గంలో నల్లగొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ, హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ చేతిలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నట్టు అయ్యింది. అయితే ఇదే సమయంలో గత అసెంబ్లీ ఎన్నికల వరకు బీఆర్ఎస్ బలంగానే ఉందని చెప్పాలి. కానీ గత లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ బీఆర్ఎస్ ఓడిపోగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎంపీగా గెలిచారు. మరీ ఇంతకీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి హస్తం పార్టీ హావా కొనసాగుతుందా..? సిట్టింగ్ స్థానాన్ని ఆ పార్టీ నిలబెట్టుకుంటుందా..? క్షేత్రస్థాయిలో ఏ పార్టీ బలాబలాలు ఏంటి..? అన్న చర్చ పెద్దఎత్తున కొనసాగుతోంది.

కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేనా..?

నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తూ వస్తోంది. తాజాగా నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కుందూరు రఘువీర్‌రెడ్డి బరిలోకి దిగారు. అయితే కుందూరు రఘువీర్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి కుందూరు జానారెడ్డి పెద్ద కొడుకు కావడం ఓ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇప్పటికే జానారెడ్డి చిన్న కొడుకు గత అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునసాగర్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. నల్లగొండ జిల్లా రాజకీయాల్లో వివాదరహితుడిగా, సౌమ్యుడిగా జానారెడ్డికి మంచి పేరు ఉంది. దీనికితోడు నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీల్లో జానారెడ్డికి మంచి పట్టు ఉండడంతో పాటు తనకంటూ సొంత వర్గమే ఉందని చెప్పాలి. ఇదే సమయంలో దశాబ్దాలుగా ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాలను రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలే ప్రధానంగా లీడ్ చేస్తూ వస్తున్నారు.

కోదాడ, హుజూర్‌నగర్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, నల్లగొండ నియోజకవర్గాల్లో ఇప్పటికే ఆ సామాజికవర్గానికి నేతలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న నేనావత్ బాలునాయక్ జానారెడ్డికి అనుచరుడిగానే ఉంటూ వచ్చారు. దీంతో ఈసారి సైతం నల్లగొండ ఎంపీ స్థానం కాంగ్రెస్ పార్టీలో ఖాతాలో పడేలా కన్పిస్తోంది. అయితే ఇదే సమయంలో కుందూరు రఘువీర్‌రెడ్డి జిల్లాలో కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉండడం.. నియోజకవర్గ ప్రజలకు పెద్దగా ఫోన్‌లోనూ అందుబాటులోకి రాడనే ప్రచారం ఉంది. మరోవైపు ఇప్పటికే ఆ ఇంటి నుంచి తన తమ్ముడు ఎమ్మెల్యేగా ఉండగా, మళ్లీ అన్న రఘువీర్‌రెడ్డి ఎంపీగా గెలిస్తే.. ఒకే ఇంట్లో రెండు పదవులా..? భవిష్యత్తులో జానారెడ్డిని రాజ్యసభకు నామినేట్ చేస్తారా..? ఇదే జరిగితే.. నల్లగొండ జిల్లా రాజకీయాలు జానా ఫ్యామిలీ చేతుల్లోకి వెళ్తాయనే ప్రచారం కొంతమేర సొంత పార్టీలోని వ్యతిరేకతను బయటపెడుతోంది.

ప్రత్యర్థులు గట్టి పోటీ ఇస్తేనే..

కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి కంటే.. ప్రత్యర్థులు బలమైన పోటీ ఇవ్వడమనేది ఇక్కడ ప్రధానంగా మారింది. బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన కంచర్ల రామకృష్ణారెడ్డి నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డికి సొంత సోదరుడు. రామకృష్ణారెడ్డి ఇప్పటివరకు ఏ ప్రత్యక్ష్య ఎన్నికల్లో పోటీ చేసింది లేదు. పైగా నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గానికి పెద్దగా పరిచయం లేదు. కేవలం నల్లగొండ, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే కాస్తో కూస్తో పేరు విన్పిస్తుంది. ఇక బీజేపీ నుంచి బరిలోకి దిగిన హుజూర్‌నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎంపీగా విజయం సాధించాలని ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. కానీ శానంపూడి సైదిరెడ్డి ఒకట్రెండు నియోజకవర్గాలకు మినహా పెద్దగా పరిచయం లేదు. దీనికితోడు నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గంలో కమలం పార్టీకి పెద్దగా క్యాడర్ లేదు. ఆఖరికి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ పెద్దగా ప్రభావం చూపే పరిస్థితి ఉండదు.

ఇదే సమయంలో ఒకప్పటి వరకు క్రీయాశీలక రాజకీయాల్లో కమ్యూనిస్టులు ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు. నేటికీ కమ్యూనిస్టుల ప్రభావం ఈ నియోజకవర్గంలో కన్పిస్తుంది. దీంతో నల్లగొండ ఎంపీగా బీజేపీకి విజయావకాశాలు తక్కువనే చెప్పాలి. కాకపోతే ఇప్పటివరకు మూడో స్థానానికి పరిమితమైన బీజేపీ ఈసారి ఎన్నికల్లో రెండో స్థానానికి ఎగబాకే అవకాశాలు కన్పిస్తుండడం గమనార్హం. ఇదంతా ఒక ఎత్తయితే.. నల్లగొండ ఓటర్లు ఎప్పుడూ విలక్షణ తీర్పును ఇస్తూనే వస్తున్నారు. ఈ క్రమంలో నల్లగొండ ఎంపీగా ఏ పార్టీని గెలిపించబోతున్నారనే అంశం బ్యాలెట్ యుద్ధంలో మరికొద్ది రోజుల్లోనే తేలనుంది.

Read More
Next Story