మూసీపై బీఆర్ఎస్ తీరును తప్పుబట్టిన గుత్తా సుఖేందర్
x

మూసీపై బీఆర్ఎస్ తీరును తప్పుబట్టిన గుత్తా సుఖేందర్

తెలంగాణలో మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ పెద్ద వివాదంలా మారింది. ఈ అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.


తెలంగాణలో మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ పెద్ద వివాదంలా మారింది. ఈ అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మూసీ ఒడ్డున ఉంటున్న వారి కడుపును కొట్టాల్సిన అవసరం సీఎంకు ఏమొచ్చిందని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తుంటే.. తాము ఎవరినీ అనాథలను చేయమని.. ప్రతి ఒక్కరికీ పునరావాసం, ప్రత్యామ్నాయం చూపి తీరుతామని కాంగ్రెస్ చెప్తోంది. తాజాగా ఈ అంశంపై శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. మూసీపై కేటీఆర్ చేసిన ట్వీట్‌ను ఆయన తప్పుబట్టారు. మనం చేస్తే సుందరీకరణ.. అవలి వారు చేస్తే వేరేది? అన్న తరహాలో కేటీఆర్ తీరు ఉందని మండిపడ్డారు. మాజీ మంత్రి కేటీఆర్ తాను తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నారని విమర్శించారు. మూసీ విషయంలో బీఆర్ఎస్, బీజేపీ రెండూ కూడా స్వార్థ రాజకీయాలే చేస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చేపట్టిన మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్‌ను తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వాలు కేవలం మాటలకే పరిమితం అయ్యాయని, ఈ ప్రభుత్వం మాత్రం చేతలు చేసి చూపుతుందని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజల కోసం గత ప్రభుత్వం నందనవనంలో వెయ్యికి పైగా ఇళ్లు నిర్మించి ఇచ్చారని గుర్తు చేశారు. ఈ విషయంలో కేటీఆర్ వైఖరి విచిత్రంగా ఉందని,గతంలోనే మూసీ పరివాహక ప్రాంతంలో బహుళ అంతస్తున్న నిర్మాణాలకు అనుమతులు ఇచ్చరాని విమర్శించారు.

ఈ ప్రాజెక్ట్ కొత్తదేమీ కాదు

మూసీ ప్రక్షాళన అని రేవంత్ రెడ్డి ఏదో కొత్తగా చేస్తున్న పని కాదని ఆయన గుర్తు చేశారు. మూసీ ప్రక్షాళన ఎప్పటి నుంచో ఉందని, దానిని అమలు రేవంత్ హయాంలో వేగంగా జరుగుతుందని అన్నారు. దీనికి వ్యతిరేక ప్రచారం చేయడం తగదని హితవు పలికారు. ‘‘యాదాద్రి, నల్గొండ, సూర్యపేట జిల్లాల్లో రైతులు వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. మాజీ పట్టణాభివృద్ధి మంత్రి తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నారు. ఆయన తీరు విడ్డూరంగా ఉంది. ఆయన హయాంలో ఇష్టారాజ్యంగా అనుమతులు ఇచ్చారు. డ్రైనేజ్, నాలాల వ్యవస్థలను గాలికి వదిలేసింది వారి ప్రభుత్వమే. మనం చేస్తే సుందరీకరణ.. అవతలి వారు చేస్తే వేరేదా? మూసీ ప్రక్షాళనకు ప్రత్యేక బోర్డు, దానికో ఛైర్మన్‌ను పెట్టింది బీఆర్ఎస్ కాదా?’’ అని ప్రశ్నించారు.

ప్రతిపక్షాలు బాధ్యతగా ఉండాలి

‘‘ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు బాధ్యతా ఉండాలి. ఎక్కడ చూసిన స్వార్థ రాజకీయాలు చేయడం మంచి పద్దతి కాదు. వాజ్ పాయ్ హయాంలో నదుల ప్రక్షాళన చేపట్టిన విషయం ఈటలకు తెలియదా? ఉమ్మడి నల్గొండ ప్రజలు ప్రతిపక్షాల తీరును ఎండగట్టాలి. అవసరం అనుకుంటే మూసీ ప్రక్షాళన కోసం సరికొత్త ఉద్యమానికి దిగాలి. ప్రత్యామ్నాయం చూపకుండా మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయిస్తే ప్రశ్నించాలి. కానీ అందరికీ పునరావాసం కల్పిస్తున్నప్పుడు ఆందోళన ఎందుకు? మూసీ ప్రక్షాళనపై పర్యావరణ వేత్తలు కూడా దృష్టి పెట్టాలి. మూసీని జీవనదిగా మార్చాలి’’ అని ఆయన సీఎంను కోరారు.

మూసీ నదిపై కేటీఆర్ ఏమన్నారంటే..

పాల‌న చేత‌కాక ప‌నికిమాలిన‌ మాట‌లు.. ‌.. పాగ‌ల్ ప‌నులు. వెర‌సి తెలంగాణ రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయింది

ఆడ‌లేక మ‌ద్దెల ఓడు అన్న‌ట్లు ప‌రిపాల‌న, అభివృద్ధి చేయ‌డం తెలియక మూసీ మురుగులో పొర్లుతున్న కాంగ్రెస్.... త‌నకు అంటిన బుర‌ద‌ను అంద‌రికీ అంటించాల‌ని చూస్తుంది

మూసీ ప్రాజెక్టుతోనే హైద‌రాబాద్ అభివృద్ధి అవుతుంద‌న్న చేత‌కాని ద‌ద్ద‌మ్మ తెలుసుకోవాల్సింది చాలా ఉంది

మూసీ ప్రాజెక్టుతో సంబంధం లేకుండానే తలసరి ఆదాయం లో (ప‌ర్ క్యాపిటాలో) తెలంగాణ దేశంలోనే నంబ‌ర్‌వ‌న్ అయింది

మూసీ ప్రాజెక్టులో 1,50,000 కోట్లు దోచుకోకుండానే జీడీపీ అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్ర‌స్థానం సాధించింది

బిల్డ‌ర్ల‌ను, రియ‌ల్ట‌ర్ల‌ను బెదిరించ‌కుండానే ఐటీ ఎగుమ‌తుల్లో బెంగ‌ళూరును హైద‌రాబాద్ దాటేసింది

మీ బడే భాయ్ మోడీ ITIR ని రద్దు చేసినా, తెలంగాణకు ఒక రూపాయి సహాయం చెయ్యకపోయినా, IT ఎగుమతులలో 2035 లో చేరుకోవాల్సిన టార్గెట్ ని పదకొండేళ్ల ముందే 2023 లో చేర్చిన ఘనత కెసిఆర్ నాయకత్వానిది

దిల్లీకి డ‌బ్బు సంచులు పంప‌కుండానే తెలంగాణ విత్త‌న భాండాగార‌మైంది. దేశంలోనే ధాన్య‌రాశిగా మారింది

పేద‌ల కంట క‌న్నీరు లేకుండానే Paris, Bogota, Mexico City, Montreal ల‌ను అధిగ‌మించి ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ గ్రీన్ సిటీ అవార్డును హైద‌రాబాద్‌ ద‌క్కించుకుంది

మూసీ న‌దికి అటుఇటు అభివృద్ధి, ఆకాశ హ‌ర్మ్యాలు క‌డుతున్న‌ప్పుడు మ‌రి ఫోర్త్ సిటీ ఎందుకు? మూసీ ప‌క్క‌న పెట్టుబ‌డి పెట్టేందుకు ఫోర్ బ్ర‌ద‌ర్స్ మ‌నీ స్పిన్నింగ్ కోస‌మా? ఫ్యూచర్ సిటీ అని పొంకణాలు ఎందుకు ?

ఎత్తైన కుర్చీలో కూర్చుంటేనో.. స‌మావేశాల్లో త‌ల కింద‌కి, మీద‌కి తిప్పితేనో అభివృద్ధి జ‌ర‌గ‌దు

ప్ర‌భుత్వ పాఠ‌శాలలో చ‌దువుకున్నా అంటూ ప్ర‌భుత్వ బ‌డి పిల్ల‌ల ఇజ్జ‌త్ తీయ‌కు. కేసీఆర్ ప్రారంభించిన గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు అద్భుత‌మైన ఇంగ్లిష్ మాట్లాడ‌తారు. ప్ర‌పంచవ్యప్తంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారు’’ అని కేటీఆర్ తన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

Read More
Next Story