గుత్తా ఆగ్రహం  ‘కారు’చిచ్చుగా మారుతోందా ?
x

గుత్తా ఆగ్రహం ‘కారు’చిచ్చుగా మారుతోందా ?

బీఆర్ఎస్ సీనియర్ నేత, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రగిల్చిన చిచ్చు చివరకు ‘కారుచిచ్చు’గా మారుతోందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.


బీఆర్ఎస్ సీనియర్ నేత, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రగిల్చిన చిచ్చు చివరకు ‘కారుచిచ్చు’గా మారుతోందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. సరిగ్గా పార్లమెంటు ఎన్నికలకు ముందు నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం పరిధి పార్టీలో విభేదాలు బాగా పెరిగిపోతున్నాయి. సుమారు వారంరోజుల క్రితం గుత్తా మాట్లాడుతు కేసీయార్ తో పాటు పార్టీపైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. కేసీయార్ చెప్పుడుమాటలు వింటున్నారని, ప్రజలకు ప్రభుత్వం దూరమవ్వటంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందన్నారు. బచ్చాలు కొంతమంది పార్టీలో చేరి కోట్లకు పడగలెత్తారంటు మండిపోయారు. పార్టీకి సంబంధించి ఏమైనా సూచనలు, సలహాలు ఇవ్వాలని అనుకున్నా కేసీయార్ అవకాశం ఇవ్వటంలేదన్నారు. తాను గడచిన ఆరుమాసాలుగా అపాయిట్మెంట్ కోసం ప్రయత్నిస్తుంటే కేసీయార్ టైం ఇవ్వటంలేదని వాపోయారు. ఈ నేపధ్యంలోనే బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందో కూడా తన అభిప్రాయాలు చెప్పారు.

ఇదే విషయమై తుంగతుర్తి మాజీ ఎంఎల్ఏ గాదరి కిషోర్ గుత్తాపై చాలా ఘాటుగా స్పందించారు. భువనగిరి ఎంపీ అభ్యర్ధి క్యామ మల్లేష్ నామినేషన్ వేసిన సమయంలో సభ జరిగింది. ఆ సందర్భంగా గుత్తా పేరును ఎక్కడా ప్రస్తావించకుండానే గుత్తును అరే ఒరే అంటు మాట్లాడారు. గుత్తాను ఉద్దేశించి లంగాని, దొంగని, పాలల్లో నీళ్ళు కలిపి అమ్ముకుని డబ్బులు సంపాదించాడన్నారు. దమ్ముంటే రాజీనామా చేయాలన్నారు. ‘పాము కాటేస్తే చచ్చిపోతారు..ఎవరైనా కరిస్తే చచ్చిపోతారు..కాని ఈ లంగాగాడు మనల్ని నాకితే చాలు విషానికి చచ్చిపోతామ’ని రెచ్చిపోయారు. ‘అసలు ప్రత్యేక తెలంగాణా కోసం ఏనాడైనా ఎక్కడైనా కొట్లాడాడా’ ? అంటు నిలదీశాడు. ఇలాంటి మాటలు గాదరి చాలానే మాట్లాడారు.

దానికి జవాబుగా గురువారం ఉదయం గుత్తా క్యాంపు ఆఫీసులో ఆయన మద్దతుదారులు కూడా గాదరిపై అంతే ఘాటుగా ఆరోపణలతో విరుచుకుపడ్డారు. జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ ఇరిగి పెద్దులు మాట్లాడుతు గాదరిని చిల్లర మనిషిగా వర్ణించారు. 40 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉన్న గుత్తా గురించి మాట్లాడే అర్హత మాజీ ఎంఎల్ఏ గాదరి కిషోర్ కు లేదన్నారు. తన తండ్రి వయసున్న గుత్తాను అరేయ్, ఒరేయ్ అనటం చాలా దురదృష్టమన్నారు. ఉస్మానియా యూనివర్సిటిలో వేలాదిమంది విద్యార్ధులు చేసిన ఉద్యమాన్ని గాదరి తన ఖాతాలో వేసుకుని ఉద్యమకారుడిగా చెలామణి అవటం అందరికీ తెలిసిందే అన్నారు. రెండుసార్లు ఎంఎల్ఏగా గెలిచి తుంగతుర్తి అభివృద్ధికి గాదరి చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఇసుక దందాచేసి గాదరి వందల కోట్ల రూపాయలు సంపాదించుకున్నట్లు ఆరోపించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ పతనానికి గాదరే కారణమని రెచ్చిపోయారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గుత్తా పేరు ప్రస్తావించకుండానే గాదరి చేసిన ఆరోపణలు, అన్న మాటలకు గుత్తా మద్దతుదారుడు పెద్దులు డైరెక్టుగా మాజీ ఎంఎల్ఏ పేరుపెట్టి ఆరోపణలుచేశారు. అయితే పార్లమెంటు ఎన్నికలకు ముందు మొదలైన ఈ డెవలప్మెంట్లు కచ్చితంగా పార్టీ గెలుపుపై నెగిటివ్ ప్రభావం చూపుతుందనటంలో సందేహంలేదు. అసలే పార్లమెంటు అభ్యర్ధి క్యామ మల్లేష్ ప్రచారం అంతంతమాత్రంగా ఉంది. గెలుపు అవకాశాలు కూడా పెద్దగా లేవనే ప్రచారం పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలో పార్టీ నేతల మధ్య మొదలైన వివాదం పెరిగి కారుచిచ్చుగా మారుతుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అసలే పార్టీ అధినేత కేసీయార్ పైన గుత్తా బాగా అసంతృప్తిగా ఉన్నారు. దానిమీద తనను లంగా, దొంగ, అరేయ్, ఒరేయ్ అని గాదరి బహిరంగా తిట్టినా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంతో గుత్తా మండిపోతున్నారు.

ఈవిధంగా పార్టీలోని నేతల మధ్య విభేదాలు రోడ్డునపడటంతో పార్టీ జనాల్లో పలుచనైపోతోంది. దీని ప్రభావం అభ్యర్ధి గెలుపుమీద నెగిటివ్ గా పడుతుందనటంలో సందేహంలేదు. ఇద్దరు నేతలు ఒకరిమీద మరొకరు గొడవలు పడుతు వాళ్ళ మద్దతుదాలరుల మధ్య గొడవలతో విభేదాలు మరింత పెరిగిపోతున్నాయి. ఇపుడు క్యాంపు ఆపీసు నుండి గాదరిని గుత్తా మద్దతుదారులు నానా మాటలన్నారు. చివరకు అది గుత్తానే వెనకుండి తన మద్దతుదారులతో తనను తట్టించారని కేసీయార్ కు ఫిర్యాదు వెళుతుంది. అప్పుడు కేసీయార్ ఏమి నిర్ణయం తీసుకుంటారన్నది కీలకమవుతుంది. పార్టీ అధనేత కేసీయార్ విషయంలో గుత్తా రగిల్చిన చిచ్చు చివరకు కారుచిచ్చుగా మారబోతోందన్న సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి. చివరకు ఏమవుతుందో చూడాలి.

Read More
Next Story