
కవిత రాజీనామాపై స్పందించిన శాసనమండలి ఛైర్మన్
పునరాలోచన చేసుకోమని చెప్పానన్న గుత్తా సుఖేందర్.
ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేయడంపై శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ స్పందించారు. ఆయన ఇంకా కవిత రాజీనామాకు ఆమోదం తెలపలేదని గుర్తు చేశారు. ఈ అంశంపై ఇప్పటికే కవితతో మాట్లాడినట్లు చెప్పారు. తన రాజీనామాను ఆమోదించాలని కవిత కోరారని అన్నారు. కాగా రాజీనామాపై ఒకసారి పునరాలోచించుకోవాలని తాను సూచించానని అన్నారు. ‘‘మీరు ఎమోషనల్ రాజీనామా చేశారు. మరోసారి ఆలోచించుకోండి అని కవితకు చెప్పాను’’ అని ఆయన వివరించారు. కాగా అతి త్వరలోనే కవిత రాజీనామాపై ఒక నిర్ణయం తీసుకుంటానని అన్నారు. తాజాగా నిర్వహించిన చిట్‌చాట్‌లో భాగంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు. వాటిలో కవిత రాజీనామా కూడా ఒకటి. దీంతో పాటుగానే ఎస్‌ఎల్‌బీసీ వంటి ప్రాజెక్ట్‌ల గురించి కూడా ఆయన మాట్లాడారు.
‘శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్ పూర్తి అయ్యే లోపు డిండి నుంచి వృథాగా సముద్రంలో కలిసే నీటిని సద్వినియోగం చేసుకోవాలి. యూరియా సరఫరా విషయంలో ప్రభుత్వ వైఫల్యం లేదు. ఆరోగ్య శ్రీ కింద ప్రభుత్వ ఆసుపత్రికి ఇచ్చే డబ్బులు ప్రభుత్వ ఆస్పత్రులకు ఇచ్చి అభివృద్ధి చేయాలి. ప్రభుత్వ విద్య, వైద్యాన్ని ప్రభుత్వమే ప్రైవేట్‌కు దీటుగా అభివృద్ధి చేస్తే.. ప్రైవేట్ సంస్థల బెదిరింపులు తగ్గుతాయి. కుల, మతాల ప్రాతిపదికన రాజకీయ పార్టీల మనుగడ కొనసాగదు’ అని అన్నారు.
కవిత రాజీనామా..
కొంతకాలంగా పార్టీలో కీలక నేతల విషయంలో కవిత చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆ దూకుడే ఇప్పుడు తన సస్పెన్షన్‌కు కారణమైంది. కాళేశ్వరం నిర్మాణంలో తన్నీరు హరీష్ రావు, జోగినపల్లి సంతోష్ అవినీతికి పాల్పడ్డారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. హరీష్ రావు కవితకు బావ అవుతారు. సంతోష్ కుమార్ మేనల్లుడు. వారిద్దరి మీద ఆమె చేసిన తీవ్రమయిన అవినీతి ఆరోపణ పార్టీలో కూడా తీవ్ర దుమారం రేపింది. కాళేశ్వరం నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను ఆమె నిర్ధారించినట్లు అయింది. వాళ్లిద్దరు కాళేశ్వరం కాంట్రాక్టర్ కంపెనీతో కుమ్మక్కయి భారీగా సొమ్ము చేసుకున్నారన్నది ఆమె ఆరోపణ. దీనిని ఆమె బహిరంగంగా విలేకరుల సమావేశంలో చెప్పడంతో బిఆర్ ఎప్ అంతర్గత కుమ్ములాట పతాక స్థాయికి చేరింది. అంతేకాదు, పార్టీ నేత కుటుంబం కూడా సంక్షోభంలో పడిపోయింది. కవిత ఇంకా ముందుకెళ్లి మరిన్ని విషయాలు వెల్లడించుకుండా ఉండేందుకు కెసిఆర్ చర్యలు మొదలుపెట్టారు. దీంతో మంగళవారం పార్టీ నేతలతో దాదాపు మూడు గంటల పాటు పార్టీ నేతలతో సమావేశమై కవితపై సస్పెన్షన్ వేటు వేయాలని కేసీఆర్ నిర్ణయించారు. సస్పెండ్ అయిన మరుసటి రోజే ఎంఎల్సీ పదవితో పాటు బీఆర్ఎస్ ప్రాధమిక సభ్యత్వానికి కల్వకుంట్ల కవిత రాజీనామా చేశారు.