
Guvvala | బీఆర్ఎస్ నాయకత్వంపై గువ్వల సంచలన ఆరోపణలు
రాజీనామాచేసిన వెంటనే పార్టీలోని లోపాలను గువ్వల మీడియాతో చెప్పారు
పార్టీకి రాజీనామా చేసిన అచ్చంపేట మాజీ ఎంఎల్ఏ గువ్వల బాలరాజు బీఆర్ఎస్ నాయకత్వంపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బుధవారం మీడియాతో మాట్లాడుతు 2023 ఎన్నికల్లో అసమర్ధ నాయకత్వం కుట్రలు చేసి తనను అచ్చంపేట(ఎస్సీ) నియోజకవర్గంలో ఓడించినట్లు ఆరోపించారు. అన్యాయాన్ని ఎదిరించే పాత్రను ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పోషించటంలేదని మండిపడ్డారు. కష్టకాలంలో కార్యకర్తలకు పార్టీ అండగా ఉండాలని గువ్వల(Guvvala BalaRaju) అభిప్రాయపడ్డారు. ప్రజలు బీఆర్ఎస్(BRS) నుండి ఏమి ఆశిస్తున్నారో అదిచేయటంలేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అధికార-ప్రతిపక్ష పార్టీలు మాటల యుద్ధం చేసుకుంటున్నాయని మండిపోయారు.
పార్టీలోఉన్నపుడు అధినేత కేసీఆర్ ఏమిచెబితే అది చేశానన్నారు. జీబీఆర్ అంటేనే ఒక సంచలనం అన్నారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడకూడదు అని ఎవరైనా అంటే తాను అంగీకరించనన్నారు. పేదరిక నిర్మూలన, ప్రజలపక్షమే తన పంతమని చెప్పారు. తనకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుండి పిలుపు వచ్చిందని అయితే తనకు స్వేచ్చ ఉండే పార్టీలో చేరుతానని తెలిపారు. ఏ పార్టీలో చేరాలనే విషయాన్ని ఇంకా నిర్ణయించుకోలేదని కూడా చెప్పారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పార్టీకి రాజీనామాచేసిన వెంటనే పార్టీలోని లోపాలను గువ్వల మీడియాతో చెప్పటం. బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పాత్రను సమర్ధవంతంగా పోషించటంలేదని ఆరోపించటమే ఆశ్చర్యంగా ఉంది. బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రను సరిగా పోషించటంలేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పనితీరు సరిగా లేదని పరోక్షంగా చెప్పినట్లే అయ్యింది. పైగా పార్టీ అసమర్ధ నాయకత్వమే కుట్రలుచేసి పోయిన ఎన్నికల్లో తనను ఓడించిందని చెప్పటం కూడా ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి ఆరోపణలే గతంలో కల్వకుంట్ల కవిత కూడా చేశారు. నిజామాబాద్ ఎంపీగా రెండోసారి పోటీచేసినపుడు తనను పార్టీలోని కొందరు వ్యతిరేకంచేసి ఓడించారని కవిత చేసిన ఆరోపణలు గుర్తుండే ఉంటుంది. ఇపుడు గువ్వల కూడా అలాంటి ఆరోపణలే చేశారు. మొత్తంమీద పార్టీ వదిలేసిన తర్వాత గువ్వల చాలా విషయాలే మాట్లాడుతున్నారు.