తెలంగాణాలో ఒంటిపూట బడులు
x
Half day schools in Telangana

తెలంగాణాలో ఒంటిపూట బడులు

చలికాలంలో కొత్తగా తెలంగాణా(Telangana)లో ఈ ఒంటిపూట బడులు ఏమిటని ఆశ్చర్యపోతున్నారా ?


తెలంగాణా వ్యాప్తంగా ఈనెల 6వ తేదీ నుండి ఒంటిపూట బడులు మొదలవ్వబోతున్నాయి. మామూలుగా అయితే ఒంటిపూట బడులు వేసవికాలంలోనే ఉంటుంది. చలికాలంలో కొత్తగా తెలంగాణా(Telangana)లో ఈ ఒంటిపూట బడులు ఏమిటని ఆశ్చర్యపోతున్నారా ? ఒంటిపూట బడులు(Half Day Schools) నిజమే కాని అందుకు ఒక కారణముంది. ఇంతకీ ఆ కారణం ఏమిటంటే ఫ్యామిలీ సర్వే(Family Survey) మొదలవ్వబోతోంది కదా. ఆ సర్వేలో సుమారు 90 వేలమంది సిబ్బందిని ప్రభుత్వం రంగంలోకి దింపబోతోంది. ఈ సర్వే ఏకధాటిగా 15 రోజులు జరగబోతోంది. సర్వేలో పాల్గొనే సుమారు 90 వేలమందిలో దాదాపు 40 వేలమంది టీచర్లు, హెడ్ మాస్టర్లే ఉన్నారు. ఇన్నివేలమంది టీచర్లు(Teachers), హెడ్ మాస్టర్లకు సర్వే డ్యూటీలు వేసిన తర్వాత ఇక వాళ్ళు ఉదయం నుండి సాయంత్రం వరకు స్కూళ్ళల్లోనే చదువులు చెప్పమంటే ఏం చెబుతారు ?

అందుకనే ప్రభుత్వ స్కూళ్ళను ఒంటిపూట నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. సమగ్ర కులగణన కోసం 36,559 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు, 3414 మంది ప్రైమరీ స్కూళ్ళ హెడ్ మాస్టర్ల సేవలను ప్రభుత్వం ఉపయోగించుకోబోతోంది. అలాగే స్కూళ్ళల్లో పనిచేసే మరో 8 వేలమంది సేవలను కూడా సర్వేలో ఉపయోగించుకోబోతోంది. అందుకనే సర్వే పూర్తయ్యేవరకు స్కూళ్ళ(Government Schools)కు ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఈ మేరకు అన్నీ స్కూళ్ళకు ఉత్తర్వులను కూడా జారీచేసింది. ప్రభుత్వం తరపున జరగాల్సిన ఏ భారీ కార్యక్రమం అయినా ముందుగా అందరికీ గుర్తుకొచ్చేది టీచర్లే. అందుకనే ఇపుడు కూడా ప్రభుత్వం టీచర్లు, హెడ్ మాస్టర్లనే రంగంలోకి దింపేస్తోంది.

కాకపోతే టీచర్లకు, హెడ్ మాస్టర్లకు కొన్నిరోజులు డబుల్ డ్యూటీ చేయక తప్పేట్లు లేదు. ఎలాగంటే ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటవరకు స్కూళ్ళలో పాఠాలు చెప్పాలి. తర్వాత గంటపాటు లంచ్ టైమ్ పోతుంది. మళ్ళీ 2 గంటల నుండి సాయంత్రం వరకు సర్వే డ్యూటీ చేయాలి. కులగణనలో భాగంగా ప్రభుత్వ యంత్రాంగం అంతా ప్రతి ఇంటికి తిరగాల్సిందే. అందుకనే ప్రతి 150 ఇళ్ళకు ఒక పర్యవేక్షణ అధికారితో పాటు కులగణన అధికారులను ప్రభుత్వం బృందాలుగా ఏర్పాటుచేసింది. ప్రతి బృందానికి 50 ప్రశ్నల ద్వారా ఒక్కో డేటా ఫారమ్ ను అందించింది. దీనికోసం ప్రభుత్వం అందరికీ ప్రత్యేకంగా కిట్లను కూడా అందించింది. అయితే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం డ్యూటీలు చేస్తున్న టీచర్లలో చాలామందికి సర్వే డ్యూటీ చేయటం ఏమాత్రం ఇష్టంలేదు. ఎందుకంటే ఉదయం స్కూళ్ళలో చదువులు చెప్పాలి వెంటనే మధ్యాహ్నం భోజన సమయం కాగానే సర్వే డ్యూటీ చేయాలి కాబట్టి. దీన్ని టీచర్లు డబుల్ డ్యూటీగా చెప్పుకుంటున్నారు.

ఇదే విషయమై మాజీ మంత్రి శ్రీనివాసగైడ్ మాట్లాడుతు కులగణన సర్వే కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కమిషన్ ను ఏర్పాటు చేయాలన్నారు. కులగణనకు ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టం చేయకుండానే సర్వే చేస్తుండటం పట్ల గౌడ్ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ సర్వేతో కులాలు, ఉపకులాల వివరాలు కచ్చితంగా తెలుస్తాయని కాబట్టి సర్వేను ప్రభుత్వం చాలా జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. ఈ సర్వేలో టీచర్ల పాత్ర చాలా కీలకమన్న విషయాన్ని మాజీమంత్రి ప్రభుత్వానికి గుర్తుచేశారు.

Read More
Next Story