క్రికెట్ దిగ్గజం జైసింహపై వేధింపుల ఆరోపణలు, సస్పెన్షన్ వేటు
x
జైసింహ (ఫైల్ ఫోటో)

క్రికెట్ దిగ్గజం జైసింహపై వేధింపుల ఆరోపణలు, సస్పెన్షన్ వేటు

జై సింహ.. క్రికెట్‌ దిగ్గజం.. హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్‌ అంటే గుర్తుకు వచ్చే పేరు జై సింహ. అటువంటి వ్యక్తిపై లైంగిక ఆరోపణలు సంచలం సృష్టించాయి..


జై సింహ.. క్రికెట్‌ దిగ్గజం.. హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్‌ అంటే గుర్తుకు వచ్చే పేరు జై సింహ. అటువంటి వ్యక్తిపై లైంగిక ఆరోపణలు సంచలం సృష్టించాయి. క్రికెటర్, కోచ్‌ అయిన జైసింహ ఈ ఆరోపణలను కొట్టిపారేసినా ప్రస్తుతానికైతే ఆయనపైన వేటు పడింది. జైసింహను కావాలనే ఈ కుట్రలో ఇరికించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిని నిరూపించుకోవాల్సిన బాధ్యత మాత్రం జైసింహపై పడింది.



కోచ్‌ జైసింహ అసభ్యంగా ప్రవర్తించారంటూ మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేయడంతో అసోసియేషన్‌ చర్యలకు ఉపక్రమించింది. వెంటనే ఆయన్ను సస్పెండ్‌ చేసిన HCA... అవసరమైతే క్రిమినల్‌ చర్యలకు సిఫారసు చేస్తామని ప్రకటించింది. జైసింహపై గతంలో కూడా ఆరోపణలు వచ్చాయని పలువురు సీనియర్‌ మెంబర్లు ఆరోపిస్తుండగా.. తానసలు ఎలాంటి తప్పూ చేయలేదని ప్రకటించారు కోచ్‌ జైసింహ.

మహిళా క్రికెటర్ల ఫిర్యాదు...

HCA కోచ్‌ విద్యుత్‌ జైసింహపై మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న క్రమంలో బస్సులోనే మద్యం సేవించారని.. అడ్డుకోబోయిన తమను దూషించారని ఈమెయిల్‌ ద్వారా HCAకు కంప్లైంట్‌ ఇచ్చారు. ఈ సమయంలో మరో కోచ్‌ పూర్ణిమరావు కూడా జైసింహను ప్రోత్సహించారని ఆరోపించారు. అంతేకాదు.. తమను టీమ్‌ నుంచి తప్పిస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు క్రికెటర్లు వాపోయారు.

జైసింహపై సస్పెన్షన్‌ వేటు

"జైసింహపై ఆరోపణలు వచ్చాయి. హెచ్‌సీఏ పరిశీలించింది. ఆరోపణల నేపథ్యంలో కోచ్‌ జైసింహను సస్పెండ్‌ చేయాలని నిర్ణయించాం" అన్నారు HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు. 'మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదు' అన్నారు జగన్‌మోహన్‌ రావు. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు పెడతామన్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరుపుతామని.. మహిళా క్రికెటర్లకు HCA అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

చాలా కాలంగా ఫిర్యాదులు ఉన్నాయా?

అయితే..'జైసింహపై చాలా కాలంగా అనేక ఆరోపణలున్నాయి. ఇప్పుడు వచ్చినవి కొత్తవేమీ కాదు' అన్నారు HCA సీనియర్ సభ్యుడు, మాజీ రంజీ ప్లేయర్ వంకా ప్రతాప్. గతంలో జైసింహపై తాము కూడా ఫిర్యాదు చేశామని, కానీ.. అప్పటి కమిటీలోని అధికారి ఆయనపై చర్యలు తీసుకోలేదన్నారు. మహిళా క్రికెటర్లకు మహిళా కోచ్‌లే ఉండాలన్న ప్రతాప్‌.. గతంలో మహిళా క్రికెటర్లకు ఇలా మెన్‌ కోచ్‌లను పెట్టడం వల్లే సమస్యలు తలెత్తాయన్నారు.

జైసింహపై రెండు నెలల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు HCA సీనియర్ మెంబర్ బాబూరావు సాగర్. అసలు HCAలోనే పెద్ద మాఫియా ఉందన్న ఆయన.. ఆ మీటింగ్‌ నిన్ననే జరిగిందన్నారు. మూడు గ్రూపుల నుంచి ఇద్దరు చొప్పున.. అన్నీ పంచుకుంటున్నారని ఆరోపించారాయన.

జైసింహ స్పందన ఇది...

మరోవైపు.. తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు కోచ్‌ జైసింహ. మహిళా క్రికెటర్లపై వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలను జైసింహ కొట్టిపారేశారు. 'ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పంపిన లెటర్ ఆధారంగా తనపై ఆరోపణలు చేయడం తగదు.. అందరం కలిసి కూల్‌ డ్రింక్స్‌ మాత్రమే తాగాం. గుర్తు తెలియని వ్యక్తులు పంపిన లెటర్‌ ఆధారంగా HCA తనను ఎలా సస్పెండ్‌ చేస్తుంది' అని ప్రశ్నించారు జైసింహ. తనపై వచ్చిన ఆరోపణలపై లాయర్లతో సంప్రదిస్తున్నానని చెప్పిన జైసింహ.. ఆ తర్వాత అన్ని వివరాలు తెలియజేస్తానని ప్రకటించడం కొసమెరుపు.

Read More
Next Story