సీఎం సవాల్ స్వీకరించిన హరీష్ రావు, ప్రతి సవాల్
x

సీఎం సవాల్ స్వీకరించిన హరీష్ రావు, ప్రతి సవాల్

రేవంత్ రెడ్డి చేసిన ఛాలెంజ్ పై హరీష్ రావు స్పందించారు. సీఎం సవాల్ స్వీకరిస్తున్నానని తెలిపిన మాజీ మంత్రి హరీష్ రావు, ఆయనకి ప్రతి సవాల్ విసిరారు.


సీఎం రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరిస్తున్నానని తెలిపిన మాజీ మంత్రి హరీష్ రావు, ఆయనకి ప్రతి సవాల్ విసిరారు. రుణమాఫీ చేస్తా, దమ్ముంటే బీఆర్ఎస్ ని రద్దు చేస్తారా? అంటూ రేవంత్ రెడ్డి చేసిన ఛాలెంజ్ పై హరీష్ రావు స్పందించారు. బుధవారం ఆయన సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సవాల్ ని స్వీకరిస్తున్నాని స్పష్టం చేశారు.

ఆగస్టు 15 లోపు ఏకకాలంలో రైతు రుణమాఫీ, ఆరు గ్యారెంటీల అమలు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని హరీష్ రావు చెప్పారు. తనకి పదవులు ముఖ్యం కాదని తెలిపారు. రైతు రుణమాఫీ, ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని ప్రతి సవాల్ విసిరారు. ఎల్లుండి (శుక్రవారం) ఈ విషయాలపై చర్చించడానికి అసెంబ్లీ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు వస్తానని, సీఎం కూడా అక్కడికి రావాలని, ఇచ్చిన హామీల అమలుపై అక్కడే ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు.

కాగా, మంగళవారం లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ ప్రసంగించారు. ఈ సందర్భంగా రైతు రుణమాఫీ పై కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలపై రేవంత్ స్పందించారు.

"జోగులాంబ దేవి సాక్షిగా మాట ఇస్తున్నా.. ఆగస్టు 15 లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతా. అదే రోజు నువ్వు, నీ మామ కలిసి బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా? నా రాజీనామా కాదు, మీ పార్టీ రద్దుకి సిద్ధంగా ఉండండి. దమ్ముంటే హరీష్ రావు నా సవాల్ స్వీకరించాలి" అని రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావుకి సవాల్ విసిరారు. రేవంత్ సవాల్ పై నేడు హరీష్ రావు కూడా అదే రీతిలో స్పందించారు. ప్రస్తుతం రేవంత్, హరీష్ ల సవాళ్ల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

Read More
Next Story