Harish Rao comments on E-car Race
x

తెలంగాణలో భూములపై కుట్ర జరుగుతోంది: హరీష్

రూ.లక్షల కోట్లు విలువైన పారిశ్రామిక భూములను కొల్లగొట్టడం కోసం ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయని హరీష్ రావు అన్నారు.


తెలంగాణలో భారీగా భూ కుంభకోణం జరగనుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ కలిసి ఈ కుంభకోణానికి తెరలేపుతున్నాయన్నారు. అందుకే రూ.లక్షల కోట్లు విలువైన భూములను కాజేసే ప్రయత్నాలు జరుగుతున్నా బీజేపీ నేతలు నోరుమెదపడం లేదన్నారు. పారిశ్రామిక అవసరాల కోసం 50-60 ఏళ్ల క్రితం ఇచ్చిన భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం కోసం కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. రూ.లక్షల కోట్లు విలువైన భూములను ఆగమేఘాలపై ఎలా అప్పగిస్తారు? అని హరీష్ రావు ప్రశ్నించారు. రెండు నెలల్లో ఈ భూముల ప్రక్రియను ముగించడం వెనక భారీ కుట్ర ఉంది? అని అనుమానం వ్యక్తం చేశారు.

‘‘బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో అజామాబాద్ పారిశ్రామిక భూములను క్రమబద్దీకరించాం. అప్పుడు ఎస్ఆర్ఓ రేట్ల కంటే 100శాతం నుంచి 200శాతం అధికంగా వసూలు చేయాలని చట్టం చేశాం. కానీ కాంగ్రెస్ మాత్రం 30శాతం రేట్లకే భూములు అప్పగించాలని ప్రయత్నిస్తోంది. 7 రోజుల్లో దరఖాస్తులు? 7 రోజుల్లో ఆమోదాలు? 45 రోజుల్లో క్రమబద్దీకరణ? ఎవరికి లాభం చేయడానికి ఇంత తొందర? దీని వల్ల రాష్ట్ర ఖజానాకు తీవ్ర నష్టం కలుగుతుంది. రూ.5లక్షల కోట్లు రావాల్సిన భూములను రూ.5వేల కోట్ల కోట్లకు ఎలా వస్తాయి? రెండు సంవత్సరాల బడ్జెట్‌కు సరిపడా నిధులు వచ్చే నిర్ణయాన్ని ఏకపక్షంగా ఎలా తీసుకుంటారు’’ అని హరీష్ రావు ప్రశ్నించారు.

‘‘అసెంబ్లీ చర్చ లేకుండా ఈ అంశంపై ఎలా నిర్ణయం తీసుకుంటారు? రూ.లక్షల కోట్ల విలువైన భూములకు సంబంధించిన ప్రక్రియను రెండు నెలల్లో ఎలా పూర్తి చేశారు? దాని వెనక ఉన్న కుట్ర ఏంటి? ఆ భూములను బహిరంగ మార్కెట్లో వేలం వేస్తే రూ.5లక్షల కోట్లు వస్తాయి. ప్రభుత్వ అవసరాల కోసం కూడా భూమి లేని పరిస్థితిలో ఇలా అమ్మేయడమేంటి? కాలుష్యాన్ని పెంచే పరిశ్రమలను మాత్రమే ఓఆర్‌ఆర్ వెలుపలికి మార్చాలనేది ప్రభుత్వ విధానం. కానీ ఇప్పుడు గ్రీన్ ఇండస్ట్రీలను కూడా బయటకు పంపే నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొత్తం 9,290 ఎకరాల భూముల వ్యవహారంలో కాంగ్రెస్ నాయకులు లాభపడేలా చూస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిశ్రమల కోసం ఇచ్చిన భూములను బహుళ ప్రయోజనాలకు వినియోగించుకునేలా ఎలా అనుమతిస్తున్నారు? ఇంత పెద్ద స్థాయి అక్రమాల్లో కేంద్రంలోని బీజేపీ ఎందుకు స్పందించడం లేదు’’ అని హరీశ్ రావు ప్రశ్నించారు.

Read More
Next Story