
‘హైదరాబాద్ జలదిగ్బంధానికి రేవంతే కారణం’
ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్లే ఇలా జరిగిందని విమర్శించిన హరీస్ రావు.
కుండపోత వర్షాలతో హైదరాబాద్ అంతా జలదిగ్బంధమైంది. ఎటువెళ్లాలన్నా నీరేనీరు. రహదారులు నదులను తలపిస్తునస్నాయి. నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జనజీవనం అవస్థవ్యస్థమయింది. అయితే దీనంతటికి రేవంత్ రెడ్డి నిర్లక్ష్య ధోరణే కారణమంటూ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మందబుద్ది, ముందుచూపు లేకపోవడం వల్లే ఇప్పుడు హైదరాబాద్ అంతా నీటమునిగిందని చురకలంటించారు. తీవ్ర వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ముందే రిపోర్ట్ ఇచ్చి హెచ్చరించిందని, కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుందని విమర్శించారు. వర్షాలను ఎదుర్కొనడానికి ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని, ఇది దుర్మార్గమని, ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపానికి నిదర్శనమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘‘ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లనే జల దిగ్బంధంలో హైదరాబాద్ ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లనే MGBS లో ప్రయాణికులు వరద నీటిలో చిక్కుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పండగ వేళ సొంతూళ్లకు వెళ్ళలేక, భయం భయంగా రాత్రి నుండి పడిగాపులు కాస్తున్నారు. మూసి నది ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో పరిసర ప్రాంత ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించాలి. రేవంత్ రెడ్డి.. మీ బురద రాజకీయాలు కాసేపు పక్కన పెట్టీ వరదలో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షితంగా తరలించండి. మూసి పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఎప్పటికపుడు సమాచారం అందిస్తూ, అప్రమత్తం చేస్తూ, ముంపు ప్రభావం ఉన్న వారిని తరలించి భరోసా కల్పించండి. తీవ్ర వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం’’ అని పేర్కొన్నారు.
ఉధృతంగా వరద..
అయితే భారీ వర్షాల వల్ల మూసీ పొంగిపొర్లుతోంది. మూసీ వరద ఉధృతి అంతకంతా పెరుగుతోంది. ఇప్పటికే ఎంజీబీఎస్ బస్‌స్టేషన్ సహా పలు కాలనీలు జలమయం అయ్యాయి. ఈ వరద ప్రభావం వల్ల హైదరాబాద్-విజయవాడ హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముసారాంబాగ్ వంతెన పై నుంచి 10 అడుగుల మేర ప్రమాదకరంగా వరద ప్రవహిస్తోంది. నిర్మాణంలో ఉన్న నూతన వంతెనను తాకుతూ వరద ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలోనే అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని తెలిపారు.