కల్తీ ఆహారం ప్రభుత్వ నిర్లక్ష్యమే: హరీష్
x

కల్తీ ఆహారం ప్రభుత్వ నిర్లక్ష్యమే: హరీష్

రాష్ట్రంలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలు కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని తనం, నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని విమర్శించారు హరీష్ రావు.


‘తెలంగాణలో రోజూ ఎక్కడో ఒకచోట ఆహారం వికటించడం, విద్యార్థులు ఆసుపత్రి పాలవడం కొంత కాలంగా సాధారణ విషయంలా మారిపోయింది. విద్యార్థులు తిండి కోసం ఎన్ని తిప్పలు పడుతున్నా, నాణ్యతలేని తిండి తిన ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నా ప్రభుత్వం మాత్రం సరైన చర్యలు ఏమీ తీసుకోవట్లేద’న్న వాదన రాష్ట్రమంతటా బలంగా వినిపిస్తోంది. తాజా ఈ అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలు కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని తనం, నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని విమర్శించారు. కల్తీ ఆహారం తిని విద్యార్థులు కళ్లు తేలేస్తున్నా ప్రభుత్వం మాత్రం తనకు ఏం పట్టనట్లు కూర్చోవడం దారుణమని అన్నారు. మహబూబాబాద్ జిల్లా దామరవంచ గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. ఈ అంశంపై స్పందిస్తూనే సర్కార్‌పై విమర్శలు గుప్పించారు హరీష్. ఈ ఘటనపై ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.

‘‘మహబూబాబాద్ జిల్లా దామరవంచ గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరిగి, విద్యార్థులు ఆసుపత్రి పాలు కావడం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఏడాది కాంగ్రెస్ పాలనలో ఒకటి కాదు రెండు కాదు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు వందల్లో జరిగాయి. వందల మంది విద్యార్థులు ఆసుపత్రి పాలు కాగా, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. కల్తీ ఆహారం విద్యార్థులకు పెడితే అరెస్టులు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా గురుకులాల తీరు ఉంది. రేవంత్ రెడ్డి మీ మాటలు కోటలు దాటితే, ఆచరణ గడప దాటదు అనేందుకు గురుకులాల దీన స్థితే నిదర్శనం. ఆసుపత్రి పాలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, ఫుడ్ పాయిజన్ కేసులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు హరీష్ రావు.

గతంలో రేవంత్ ఏమన్నారంటే

‘‘విద్యార్థులకు పరిశుభ్ర వాతావరణంలో పౌషికాహారం అందించాలి. వారికి మంచి విద్యా అందించాలన్న ఉద్దేశంలో వేల సంఖ్యలో ఉపాధ్యాయుల నియామకాలు చేశాం. అదే విధంగా విద్యార్థులకు ఆహారం కూడా నాణ్యమైనది అందించాలని డైట్ ఛార్జీలు పెంచాం. ప్రభుత్వానికి అప్రతిష్ఠ తీసుకొచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. బాధ్యులపై కలెక్టర్ వేటు వేయాలి. వదంతులతో భయాందోళనలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఈ విషయంలో నిర్లక్ష్యం, అలసత్వం కనబరిచినట్లు రుజువైతే సదరు అధికారులను వెంటనే ఉద్యోగాల నుంచి తొలగిస్తాం. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో తరచూ తనిఖీలు చేయండి. విద్యార్థులకు పెట్టే ఆహారం తయారు చేస్తున్న పరిసరాలు, సరుకుల నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. అదే విధంగా విద్యార్థులకు అందించే తాగు నీరు కూడా కలుషితం కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలి’’ అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

కానీ రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలు పరిపూర్ణంగా అమలు కాలేదు. అందుకు ఇప్పటికీ జరుగుతున్న ఫుడ్ పాయిజన్‌ ఘటనలే నిదర్శమని హరీష్ రావు పేర్కొన్నారు. ఒక సీఎం ఆదేశాల అమలుకే గతిలేని ఈ పాలనను ఇందిరమ్మ రాజ్యం అని, ప్రజాప్రభుత్వం అని కాంగ్రెస్ గప్పాలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని హరీష్ రావు సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ ముందుగా తమ పార్టీ నేతలను క్రమశిక్షణలో పెట్టుకోవాలని, వాళ్ల పార్టీ అభివృద్ధి చేసుకోవాలని, ఆ తర్వాత తెలంగాణ అభివృద్ధి గురించి బెంగపడొచ్చంటూ చురకలంటించారు.

Read More
Next Story