
‘చాలా చర్చించాలి.. అసెంబ్లీని 15 రోజులు నిర్వహించండి’
అసెంబ్లీ సమావేశాల అజెండాను రాత్రికి రాత్రే నిర్ణయిస్తామంటే ఎలా? అని ప్రశ్నించిన మాజీ మంత్రి హరీష్ రావు.
అసెంబ్లీ సమావేశాల నిడివిపై మాజీ మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు మూడు రోజులు సమావేశాలు నిర్వహించి చేతులు దులుపుకోవాలని కాంగ్రెస్ పన్నాగం పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని, కనీసం 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం జరిగిన బీఏసీ సమావేశం మధ్య నుంచి ఆయన బయటకు వచ్చేశారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధిగా లేదని, ఏదో తూతూ మంత్రంగానే సమావేశాలను నిర్వహించాలని ప్లాన్ చేస్తోందన్నారు. రాత్రి రాత్రే సమావేశాల అజెండాను నిర్వహిస్తామని అనడం ఎంత వరకు సమంజసం అంటూ మండిపడ్డారు హరీష్ రావు. వరదలు, విద్యార్థులు ఫీజు రియింబర్స్‌మెంట్ ఇలా అనేక అంశాలపై మాట్లాడాలని, రెండు రోజులంటే అన్ని అంశాలను ప్రతిపాదించడానికి కూడా సరిపోవని అన్నారు.
కొన్ని రోజులుగా తెలంగాణను కుండపోత వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఒకవైపు వరదలు, పొంగి పొర్లుతున్న వాగులు వంకలు, ప్రబలుతున్న విషజ్వరాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని, వాటిపై చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందని హరీష్ రావు అన్నారు. వీటితో పాటు గురుకుల పిల్లల మరణాలు సహా ఇతర ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీలో సమయం ఇవ్వకుండా రెండు రోజులే నడుపుతామని ప్రభుత్వం చెప్పడంతో BAC నుండి వాకౌట్ చేశామని చెప్పారు. 15 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నడపాలని బీఏసీ సమావేశంలో కోరామని అన్నారు.
‘‘చాలా గ్రామాల్లో కరెంటు, రోడ్లు లేవు. ప్రాణాలు కోల్పోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మొదటి ప్రాధాన్యత కింద రాష్ట్రంలో వరదల వల్ల జరిగిన ప్రాణ నష్టం, పంట నష్టంపై అసెంబ్లీలో చర్చించాలని బీఆర్ఎస్ పార్టీ కోరింది. రెండో ప్రధానమైన సమస్య యూరియా కొరత. రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్, బిజెపిలు దొంగ నాటకాలు ఆడి రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. యూరియా కొరతకు కారణం బిజెపి, కాంగ్రెస్ అన్నదానిపై చర్చిద్దామని కోరాం. ఎరువుల కొరత తీర్చేందుకు అసెంబ్లీలో చర్చించాలని బీఆర్ఎస్ పార్టీ కోరింది. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ సరిగ్గా లేక మలేరియా, డెంగ్యూ లాంటి విష జ్వరాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు’’ అని తెలిపారు.
‘‘అంటురోగాలపై చర్చించాలని కోరాం. గురుకులాల్లో 100కు పైగా మరణాలు జరిగాయి. వాటిపై చర్చించాలని కోరాము. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ పై చర్చించాలని కోరాం. ఫోర్త్ సిటీలో ముఖ్యమంత్రి సోదరులపై వస్తున్న అరాచకాలపై చర్చ కోరాము. ఉద్యోగుల పిఆర్సిడిఎల్ఐ గురించి చర్చించాలని కోరాము. బనకచర్లపై చర్చించాలని కోరాము. రెండే రోజులు అసెంబ్లీ నడిపిస్తామని ప్రభుత్వం చెబుతున్నది. ప్రజా సమస్యలపై చర్చించకుండా సభ వాయిదా వేసుకుని పారిపోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది. వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజల కష్టాల గురించి చర్చిద్దాం అంటే బురద రాజకీయాలు చేస్తున్నారు’’ అని విమర్శించారు.
‘‘ప్రజలు పడుతున్న బాధల గురించి మాట్లాడడానికి ముందుకు రాకపోవడంతో బీఎస్సీ సమావేశం నుండి వాకౌట్ చేసి బయటకు వచ్చాం. వరదలపై, యూరియా కొరతపై మాట్లాడటం కంటే ప్రభుత్వానికి ఇంకేమి ప్రాధాన్యత ఉంటుంది? ప్రభుత్వ ధోరణి చూస్తుంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పెట్టి బురద రాజకీయాలకు పాల్పడాలని చూస్తున్నట్టు ఉంది. ఒక్కరోజు కాదు నాలుగు రోజులైనా సరే కాళేశ్వరం కమిషన్ పై మాట్లాడదాం కానీ ముందు ప్రజలు కష్టాల గురించి చర్చిద్దామని కోరాం. కాళేశ్వరం, బీసీ బిల్లు రెండు రేపే చర్చించి వాయిదా వేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం పారిపోవాలని చూస్తుంది’’ అని చురకలంటించారు.
‘‘ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వ వైఖరికి నిరసన నిరసనగా బీఏసీ నుంచి వాకౌట్ చేసాం. రేపు సభలో ఏం చర్చిస్తారో రాత్రి 9 తర్వాత తెలుపుతామని సమాధానం ఇచ్చారు. రేపు అసెంబ్లీలో పెట్టే చర్చ గురించి సమాచారం ఇవ్వకపోతే ప్రతిపక్షాలు ఎలా ప్రిపేర్ అవుతాయి. ప్రతిపక్షాల గొంతు నొక్కడమంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే. ప్రజాపాలన మాదంటూ రాజ్యాంగాన్ని చేతుల్లో పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీ ఏమని సమాధానం చెబుతారు. 15 రోజులు అసెంబ్లీ నిర్వహించకుండా కేవలం రాజకీయాల కోసం రెండు రోజులు అసెంబ్లీ నిర్వహించడం దుర్మార్గం. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యం. స్థానిక సంస్థలపై ప్రభుత్వం ఎలాంటి ఎజెండా తెలుపలేదు’’ అని అన్నారు.