అధికారులను బెదిరిస్తే ఏమొస్తుంది హరీషూ
x
BRS MLA Thanneru Harish Rao

అధికారులను బెదిరిస్తే ఏమొస్తుంది హరీషూ

అధికారంలో ఎవరుంటే వాళ్ళు చెప్పినట్లు నడుచుకోవటానికి చాలామంది అధికారులు అలవాటు పడిపోయారన్నది వాస్తవం


అధికారుల పరిస్ధితి రోజురోజుకు దయనీయంగా తయారవుతోంది. కరవమంటే కప్పుకు కోపం..విడవమంటే పాముకు కోపం అన్న సామెతలాగ అయిపోతోంది అధికారుల పని. తాజాగా బీఆర్ఎస్ ఎంఎల్ఏ, మాజీమంత్రి తన్నీరు హరీష్ రావు(Harish Rao) బెదిరింపులు పై సామెతను గుర్తుకుతెస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే పోస్టింగుల కోసం అధికారులు అక్రమకేసులు పెడితే అంతుచూస్తామని బెదిరించారు. హరీష్ ఏమన్నారంటే ‘‘ కేసులు మాకు కొత్తకాదు. అసెంబ్లీ సమావేశాలు ముగిసే 3వ తేదీ సాయంత్రం మాకు(Telephone Tapping) టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇవ్వమని చెప్పారట. కొందరు అధికారులు పోస్టింగుల కోసం అక్రమకేసులు పెట్టాలని చూస్తున్నారు. రేవంత్ రెడ్డి(Revanth) కోసం అతిచేస్తే అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఏపీలో ఏమి జరిగిందో అందరు చూస్తున్నారు కదా. రాజకీయ కక్షతో ఇబ్బందిపెడితే మీకూ అదేగతి పడీతుంది’’ అని హరీష్ వార్నింగ్ ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది.

అధికారంలో ఎవరుంటే వాళ్ళు చెప్పినట్లు నడుచుకోవటానికి చాలామంది అధికారులు అలవాటు పడిపోయారన్నది వాస్తవం. ఏపార్టీ అధికారంలోఉన్నా ప్రత్యర్ధిపార్టీల నేతల విషయంలో ఇలాగే వ్యవహరిస్తోంది అనటంలో సందేహంలేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు కూడా పోలీసులు ఇలాగే వ్యవహరించిన విషయాన్ని హరీష్ కు తెలీదా ? అప్పట్లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఎనుముల రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు జైలుకు పంపిన విషయం గుర్తులేదా ? కేటీఆర్ ఫామ్ హౌస్ పైన ద్రోన్ ఎగరేశాడనే కారణంతో పోలీసులు రేవంత్ ను అరెస్టు చేసి కోర్టు ద్వారా రిమాండుకు పంపారు. ఫామ్ హౌస్ పై ద్రోన్ ఎరేయటం ఏమంత పెద్దనేరమని అప్పట్లో పోలీసులు కేసుపెట్టి రిమాండుకు తరలించారు ? పైనుండి వచ్చిన ఆదేశాల ప్రకారం నడుచుకున్న పోలీసులు రేవంత్ పై కేసులు పెట్టి కోర్టు ద్వారా రిమాండుకు పంపారని అందరికీ తెలుసు.

అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వనిర్ణయాన్ని వ్యతిరేకిస్తు దీక్షలు చేసినందుకు అప్పట్లో బండి సంజయ్ మీద కేసులుపెట్టి పోలీసుస్టేషన్లో నిర్భందించారు. నిరసన తెలిపారన్న కారణంతో కేంద్రమంత్రి అనికూడా చూడకుండా జీ కిషన్ రెడ్డిపైన పోలీసులు కేసునమోదు చేసి అరెస్టుచేశారు. నిరసన తెలిపారన్న కారణంతో ఎంతోమంది కాంగ్రెస్ నేతలపైన కేసులు పెట్టి పోలీసులు అరెస్టులు చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. అవన్నీ పోలీసులు బుద్ధిపూర్వకంగా చేశారని ఎవరూ అనుకోవటంలేదు. పైనుండి వచ్చిన ఆదేశాల ప్రకారమే పోలీసులు నడుచుకున్నారు. రాజకీయంగా తేల్చుకోవాల్సిందిపోయి మధ్యలో అధికారులను బెదిరిస్తే హరీష్ కు ఏమొస్తుందో అర్ధంకావటంలేదు.

రాజకీయంగా తీసుకునే బాసుల నిర్ణయాలను అమలుచేయటం మాత్రమే పోలీసుల బాధ్యతగా మారిపోయింది. ఈమాత్రం దానికి మధ్యలో పోలీసులను బెదిరిస్తే హరీష్ కు ఏమొస్తుంది ? పైగా ఇలాంటి బెదిరింపులకు పోలీసులు కూడా బాగా అలవాటుపడిపోయారు. అధికారంలో ఎవరున్నా, ప్రతిపక్షంలో ఎవరున్నా పోలీసులకు మాత్రం బెదిరింపులు తప్పటంలేదు. అందుకనే రాజకీయనేతల బెదిరింపులను పోలీసులు పట్టించుకోవటం ఎప్పుడో మానేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అన్నవిషయం భవిష్యత్తుకు సంబంధించింది. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది చేయాలా వద్దా అన్నది వర్తమానం. వర్తమానం దాటితేనే కదా భవిష్యత్తుండేది. అందుకనే ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళు చెప్పినట్లు నడుచుకోవటానికి పోలీసులు అలవాటుపడిపోయారు.

Read More
Next Story