
‘సీఎంకు ప్రాణాలకన్నా ప్రచారమే ముఖ్యమైంది’
ప్రతీ క్షణం చాలా విలువైంది. ఎంత త్వరగా సహాయక చర్యలు ప్రారంభిస్తే అంత త్వరగా వారిని ప్రాణాలతో కాపాడే అవకాశాలు పెరుగుతాయని హరీష్ పేర్కొన్నారు.
ఎల్‌ఎల్‌బీసీ ప్రమాదంలో ప్రభుత్వ వైఫల్యం పూర్తిస్థాయిలో ఉందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సహాయక చర్యలు అందించడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని, పైగా బీఆర్ఎస్ నేతలను విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 10 గంటల వరకు సహాయక చర్యలు ప్రారంభం కాకపోవడం దారుణమన్నారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రమద స్థలం వద్దకు హరీష్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలు వెళ్లారు. అక్కడి పరిస్థితుల గురించి అధికారునలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రికి ప్రచారంపై ఉన్న ఆసక్తి ఎస్‌ఎల్‌బీసీలో చిక్కుకున్న వారి ప్రాణాలపై లేదన్నారు. అందుకే ఈ అంశంపై ఆయన ఫోకస్ పెట్టడం లేదన్నారు. ప్రమాదం జరిగి ఐదురోజులు ముగిసినా ఇప్పటి వరకు ఘటనా స్థలానికి వచ్చి సహాయక చర్యలు జరుగుతున్న తీరును పరిశీలించే సమయం కూడా ఆయనకు లేదని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల తరపున ప్రచారం చేసే సమయం మాత్రం పుష్కలంగా ఉందంటూ చురకలంటించారు.
‘‘టన్నెల్‌లో ప్రమాదం జరగడం దురదృష్టకరం. ఇప్పటికి ఐదు రోజులయ్యాయి. సొరంగంలో చిక్కుకున్న వారు ఆహారం, తాగునీరు కూడా లేకుండా తీవ్ర అవస్థలు పడుతున్నారు. వారి ప్రాణాలు కాపాడటానికి ప్రతీ క్షణం చాలా విలువైంది. ఎంత త్వరగా సహాయక చర్యలు ప్రారంభిస్తే అంత త్వరగా వారిని ప్రాణాలతో కాపాడే అవకాశాలు పెరుగుతాయి. ఈ ఘటనపై ప్రభుత్వ స్పందన చాలా బాధాకరం. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి హెలికాప్టర్ వేసుకుని వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల ప్రచారం ముఖ్యమా? కార్మికుల ప్రాణాలు ముఖ్యమా? కనీసం ఒక్కసారంటే ఒక్కసారి కూడా అక్కడకు వెళ్లి సహాయక చర్యలపై సూచనలు కూడా చేయలేదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ పేరు మార్చిన హరీష్
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ దగ్గరకు వెళ్లడానికి ముందు మాజీ మంత్రి హరీష్ రావు.. సీఎం రేవంత్‌పై విమర్శలు గుప్పించారు. ఆయన ఎనుముల రేవంత్ కాదని, ఎగవేతల రేవంత్ అంటూ చురకలంటించారు. అబద్ధాలు చెప్తారు కాబట్టి అబద్ధాల రేవంత్ అని విమర్శించారు. ‘‘SLBC ఘటనలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. ఏజెన్సీల మధ్య సమన్వయం చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది. మంత్రులు ఇంటర్వ్యూలు ఇవ్వడంలో పోటీ పడుతున్నారు. ఎస్ఎల్‌బీసీ ఘటనలో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే మాపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడతాను. SLBC కోసం కాంగ్రెస్ హయాంలో కంటే బీఆర్ఎస్ హయంలోనే ఎక్కువ నిధులు ఖర్చు చేశాం. SLBC కోసం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి రూ.100 కోట్ల మోబిలైజేశన్ ఫండ్ ఇచ్చాం. రేవంత్ రెడ్డి 15 నెలల పాలనలో 15 మీటర్లు కూడా సొరంగాన్ని తవ్వలేదు. రేవంత్ రెడ్డి డిఫెన్స్ లో పడ్డారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల ఎనిమిది మంది ప్రాణాలు గాలిలో ఉన్నాయి’’అని ఘాటు వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు.