
‘రేవంత్.. లంకెబిందెల వేట చేస్తున్నారు’
మార్పు పేరుతో ప్రజలను ఈ ప్రభుత్వం ఏమార్పిందన్న మాజీ మంత్రి హరీష్ రావు.
అభివృద్ధి తెలంగాణను కాంగ్రెస్ సర్కార్ గుంతల తెలంగాణ చేసిందంటూ మాజీ మంత్రి హరీష్ రావు విమర్వలు గుప్పించారు. రాష్ట్రంలో ఏ పల్లెకు వెళ్లినా గుంతలే దర్శనమిస్తున్నాయన్నారు. తెలంగాణ రహదార్లపై ప్రయాణించాలంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గుంతల రోడ్లను సరిచేయని సర్కార్.. ఫ్యూచర్ సిటీకి ఆరులైన్ల రహదారికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, విలువైన భూములను అమ్ముకుంటూ లంకె బిందెల వేట కొనసాగిస్తున్నారని ఆరోపించారు. మార్పు తెస్తాం.. మార్పు తెస్తాం అని చెప్పి ప్రజలను ఏమార్చారాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం అబద్ధాలను, చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించడం కోసమే బీఆర్ఎస్.. ‘కాంగ్రెస్ బాకీ కార్డులు’ తెచ్చిందని హరీష్ రావు చెప్పారు.
సిద్దిపేటలోని ఎమ్మెల్యే ఆఫీసులో నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న హరీష్ రావు.. బాకీ కార్డులను విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతున్నా ఒక్కటంటే ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. ఆరు గ్యారెంటీలను టాటా చెప్పేశారని ఎద్దేవా చేశారు. ఇక్కడ ఆరుగ్యారెంటీలను అమలు చేశామని బీహార్‌లో రాహుల్‌తో కలిసి ప్రకటించుకున్నారని, అక్కడి ప్రజలను మోసం చేయడానికి కూడ కాంగ్రెస్ సిద్ధమైందని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నంచి ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి రైతుకు రూ.75వేలు, ప్రతి మహిళకు రూ.44 వేలు బాకీ పడిందని అన్నారు.
‘‘మేము విడుదల చేసిన ఈ బాకీ కార్డు.. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌కు ఉరితాడు అవుతుంది. ఈ అసమర్థ ప్రభుత్వాన్ని బాకీ కార్డుతో ఎండగడతాం. పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా ప్రతి ఇంటికీ ఈ కార్డును పార్టీ నాయకులు, కార్యకర్తలు అందించాలి. ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ వైఫల్యాలను వివరించాలి. బాకీ కార్డుపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీయాలి. బాకీ తీర్చాకే కాంగ్రెస్ నేతలు ఓట్లు అడగాలి’’ అని హరీష్ రావు చెప్పారు.