Harish Rao
x

‘రేవంత్ ఈసారయినా జీతాలివ్వవయ్యా..!’

జీతాలు ఇవ్వకుండా సిబ్బందికి దసరా పండగను దూరం చేసిన ఘనుడు రేవంత్ అంటూ విమర్శించిన హరీష్ రావు.


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీస్ రావు విమర్శలు గుప్పించారు. రేవంత్ మాటలయితే కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప కూడా దాటడం లేదని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నీ చెప్పడమే తప్పా చేయడం చేతకావడం లేదని విసుర్లు విసిరారు. ఇప్పటికయినా రేవంత్ తన తీరు మార్చుకోవాలన్నారు. జీతాలు ఇవ్వకుండా వైద్య సిబ్బందిని నరకయాతనకు గురిచేస్తున్నారని, వారికి దసరా పండగ లేకుండా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారయినా జీతాలు సరిగ్గా సమయానికి ఇచ్చి దీపావళి పండగనయినా జరుపుకునే భాగ్యం వాళ్లకి రేవంత్ కలిగించాలంటూ దుయ్యబట్టారు.

‘‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే, చేతలు గడప దాటవు అనడానికి వేతనాలు అందక టీవీవీపీ, బస్తీ దవాఖానల వైద్య సిబ్బంది పడుతున్న నరకయాతనే నిదర్శనం. ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం తప్ప ఆచరించింది లేదు, అమలు చేసింది లేదు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ రెగ్యులర్ ఉద్యోగులకు ప్రతి నెలా రెండు, మూడు వారాలు దాటినా జీతాలు రాని పరిస్థితి. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకైతే నెలల తరబడి జీతాలు అందని దుస్థితి. ఇక బస్తీ దవాఖాన వైద్య సిబ్బందికి అయితే ఆరు నెలలుగా వేతనాలు పెండింగ్ పెట్టి, చుక్కలు చూపిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. వైద్యులకు, ఇతర సిబ్బందికి బతుకమ్మ, దసరా పండుగ సంబురం లేకుండా చేసి, వారిని మానసిక క్షోభకు గురి చేయడం తగునా? వేతనాలు ఇవ్వాలని ఎన్నిసార్లు అధికారులకు వినతులు ఇచ్చినా పట్టించుకోకపోవడం దుర్మార్గం’’ అని అన్నారు.

‘‘అత్యవసర సేవలు అందించే వైద్య సిబ్బందికే జీతాలు ఇవ్వకుంటే, ఇక ఇతర శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల పరిస్థితి ఏమిటి? పథకాల్లో కోతలు.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా వాతలు మాటల్లో ఫేకుడు.. ఢిల్లీకి వెళ్లి జోకుడు.. ఇదే కదా రేవంత్ రెడ్డి 22 నెలల్లో నువ్వు చేసింది. నీ పాలన వైఫల్యం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు శాపంగా మారింది. జీతాలు ఇవ్వకుండా 13వేల మంది వైద్య సిబ్బందికి దసరా పండుగ దూరం చేసావు. కనీసం ఇప్పుడైనా జీతాలు ఇచ్చి వారికి దీపావళి సంబురాన్ని అందించు’’ అని హరీష్ రావు హితవు పలికారు.

Read More
Next Story