
‘రేవంత్ రెడ్డిది చావు భాష’.. మండిపడ్డ హరీష్ రావు
రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఈగలు కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. కాంపౌండ్ లో గిరాకి లేదు, రిజిస్ట్రేషన్ ఆఫీసులకు ఆదాయం లేదు అని ఎద్దేవా చేశారు.
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు విమర్శలు చేశారు. ఢిల్లీలో రేవంత్ పనయిపోయిందన్నారు. కాంగ్రెస్ ఒక బీసీ వ్యతిరేక పార్టీ అని, అందుకే ఢిల్లీలో జరుగుతున్న బీసీ మహాధర్నాకు పక్కనే ఉన్న రాహుల్ గాంధీ రాలేదని ఆరోపించారు. అంతేకాకుండా తప్పుడు కేసులు పెట్టి హెచ్‌సీయూ విద్యార్థులను సతాయించిన సీఎం రేవంత్.. వారికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, ప్రజా క్షేత్రంలో ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా గణేష్ గడ్డ సిద్ధి వినాయక దేవాలయంలో జరిగిన ప్రత్యేక పూజలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూనే.. కాంగ్రెస్ ప్రభుత్వం, హరీష్ రావుపై విమర్శలు గుప్పించారు.
‘‘ఈరోజు రాష్ట్రమంతా కూడా కేసీఆర్ గారి వైపు చూస్తున్నది. ఏడాది పాలనలో ప్రజలకు పాలేవో నీళ్ళేవో అర్థం అయిపోయింది. రేవంత్ రెడ్డివి మాటలు తప్ప చేతలు లేవు అన్నది ప్రజలకు అర్థమయిపోయింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అయినా నెరవేర్చారా.? నో ఎల్ఆర్ఎస్ అని అన్నారు కానీ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. మేము వస్తే ఫార్మాసిటీ భూములన్ని రైతులకు వాపసిస్తామని అన్నారు. ఇప్పుడేమో 16 వేల ఎకరాలు ఫార్మా సిటీ కోసం స్వీకరిస్తామని ప్రకటించారు. జీవో 58,59 కింద ఇదే పటాన్చెరువు నియోజకవర్గంలో వేల మంది పేదలకు పట్టాలు పంపిణీ చేశాం’’ అని తెలిపారు.
‘‘ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చినాక 58, 59 జీవో బందు పెట్టిండు. పైసలు కట్టినోళ్లకు కూడా పట్టాలు ఇవ్వడం లేదు. రైతుబంధు కేసీఆర్ 10,000 ఇస్తుండు నేనొస్తే 15,000 ఇస్తానన్నాడు. కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక పోయినట్టు అయింది. రూ.15,000 కాదు కదా కేసీఆర్ ఇచ్చిన రూ.10,000కి కూడా ఇప్పుడు దిక్కులేదు. వానకాలం రైతుబంధు యాసంగి రైతుబంధు 40 పైసలు మందమేసి 60 పైసలు ఎగ్గొట్టిండు. వానకాలం రైతుబంధు 9,000 కోట్లు యాసంగి రైతుబంధు 5,000 కోట్లు. రెండు కలిపితే 14వేల కోట్లను రైతుబంధు కింద రేవంత్ రెడ్డి ఎగ్గొట్టిండు. రుణమాఫీ అసలు ఇయ్యాల్సింది 49 వేల కోట్లు, అసెంబ్లీలో చెప్పింది రూ.31 వేల కోట్లు, ఇచ్చింది రూ.15, 16 వేల కోట్లు కూడా లేదు.
‘‘వానకాలం యాసంగికి ఎగ్గొట్టిన రైతుబంధు డబ్బులు రూ.14,000 కోట్లు రుణమాఫీకి పెట్టిండు. 50% రుణమాఫీ కూడా కాలేదు, రైతుబంధు రాలే, రూ.4000 పెన్షన్ రాలే, అక్కచెల్లెళ్లకు మహాలక్ష్మి పెన్షన్ రాలే. కెసిఆర్ ఎన్నికల హామీ ఇవ్వకపోయినా 13 లక్షల పేదింటి ఆడపిల్లల కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించారు. ఇప్పుడు పెళ్లయి పిల్లలు పుట్టినా కల్యాణ లక్ష్మి చెక్కు లేదు తులం బంగారం పూసే లేదు. కేసీఆర్ తెలంగాణను నిలబెట్టిండు, రేవంత్ రెడ్డి తెలంగాణను పడగొట్టిండు. రాష్ట్ర జీఎస్టీ ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం 12 శాతం జీఎస్టీ వృద్ధిరేటు ఉండేది’’ అని చెప్పారు.
‘‘దేశ జీఎస్టీ కంటే సగానికి తెలంగాణ జిఎస్టి వృద్ధిరేటు పడిపోయింది. దేశం 10 శాతం జీఎస్టీ వృద్ధిరేటు సాధిస్తే తెలంగాణ కేవలం 5% మాత్రమే వృద్ధిరేటు సాధించింది. కేసీఆర్ ఉన్నప్పుడు దేశ జిఎస్టి వృద్ధి రేటు కంటే ఎప్పుడూ ఎక్కువగానే ఉన్నాం తప్ప తక్కువగా లేం. కేసీఆర్ చెట్లు పెడితే రేవంత్ రెడ్డి వాటిని నరుకుతున్నాడు. మొన్న అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాల భూమి తీసుకొని అక్కడ చెట్లని నరికేసిండు. నిన్న హెచ్ సీయు భూముల్లో 400 ఎకరాల అడవుల్లోనూ నరికి మూగజీవుల పాపం కట్టుకున్నాడు. ఏం పాపం చేశాయని మూగజీవాల ఉసురు పోసుకుంటున్నావు రేవంత్ రెడ్డి’’ అని చురకలంటించారు.
‘‘హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూలగొట్టాడు రేవంత్ రెడ్డి. ఒక చిన్న పిల్ల వాళ్ళ నాన్న కొనిచ్చిన వాటర్ బాటిల్ తీసుకొని వస్తాను అన్నా వినకుండా ఇల్లును కూలగొట్టారు. కేసీఆర్ ది సాగు భాష అయితే రేవంత్ రెడ్డిది చావు భాష. కేసీఆర్ ఎప్పుడు మాట్లాడిన మిషన్ కాకతీయ కింద చెరువులు బాగు చేయాలి అనేది. ప్రాజెక్టుల నిర్మాణం చేసి రైతులకు నీళ్లు అందించాలని చెప్పేది. రేవంత్ రెడ్డి మాట్లాడితే పేగులు మెడలో వేసుకుంటా, తొక్కుతా చంపుతా తొడలదర కొడతా ఇలాంటి భాష రేవంత్ రెడ్డిది’’ అని విమర్శించారు.
‘‘ఢిల్లీలో కూడా రేవంత్ రెడ్డి పని అయిపోయింది. ఢిల్లీలో బిసి సభకు రాహుల్ గాంధీని తీసుకొని వస్తా పార్లమెంట్లో బిల్లు ఆమోదింప చేస్తా అని అన్నాడు. వీళ్ళ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండి కూడా ధర్నాకు రాలేదు. రాహుల్ గాంధీ, సోనియాగాంధీ మరుసటి రోజు రేవంత్ రెడ్డి లేకుండా పిసిసి అధ్యక్షులతో ఉపముఖ్యమంత్రితో ఫోటోలు దిగారు. ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. హెచ్ యు విద్యార్థుల మీద పెట్టిన కేసులు ఎత్తేస్తున్నామని ప్రకటించారు. ఈ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి ఆదేశించిందట ఉపముఖ్యమంత్రి కేసులు ఉపసంహరించుకుంటారంట’’ అని తెలిపారు.
‘‘ముఖ్యమంత్రి హోంమంత్రి రేవంత్ రెడ్డి కేసులు పెడితే ఉపముఖ్యమంత్రి కేసులు ఉపసంహరించుకుంటాడు అంట. ఇదేమి రాజ్యం. తోక కుక్కని ఆడిస్తున్నదా కుక్క తోకనాడిస్తున్నదా అర్థం కావడం లేదు. రేవంత్ రెడ్డి పెట్టింది తప్పుడు కేసులని ఉపముఖ్యమంత్రి బట్టి భట్టి విక్రమార్క చెప్పినట్టే కదా. హెచ్ యు విద్యార్థులపై అక్రమంగా కేసులు పెట్టారు అని విడుదల చేసినట్టే కదా. అక్రమ కేసులో పెట్టినందుకు రాష్ట్ర హోం మంత్రిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి హెచ్ యు విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. రేవంత్ రెడ్డి పాలన సగం సగం ఆగమాగం. హైడ్రా హైడ్రా అని ఆర్నెల్లు ఉరికిండు వెల్లకిలబడ్డాడు’’ అని ఎద్దేవా చేశారు.
‘‘దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి పంద్రాగస్టు కల్లా రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేదు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఈగలు కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. కాంపౌండ్ లో గిరాకి లేదు, రిజిస్ట్రేషన్ ఆఫీసులకు ఆదాయం లేదు. కెసిఆర్ పాలనలో రియల్ ఎస్టేట్ పెరుగుడే పెరుగుడు రేవంత్ రెడ్డి పాలనలో దిగుడే దిగుడు. ఏమనంటే ఆర్ఆర్ టాక్స్. మెట్రో రైల్ వద్దన్నాడు, ఫార్మాసిటీ వద్దన్నాడు. ఎటువంటి తెలంగాణను రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తున్నాడు. పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియాలో వారానికి రెండు రోజులు పవర్ హాలిడే వచ్చేది. కేసీఆర్ వచ్చాక పవర్ హాలిడేలు ఎత్తేసి 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇచ్చాడు’’ అని గుర్తు చేశారు.
‘‘దేశానికి నెంబర్ వన్ గా తెలంగాణ తీర్చిదిద్దింది కేసీఆర్. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు తెలంగాణ నుండి బియ్యాన్ని మాకు అమ్మండి అని అడిగేవారు. దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణను తీర్చిదిద్దారు కేసీఆర్. మళ్ళీ బీఆర్ఎస్ రావాలి కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తగిన గుర్తింపు, గౌరవం లభించే విధంగా ఆ బాధ్యత నేను తీసుకుంటాను. కష్టపడ్డ ప్రతి కార్యకర్తను పార్టీ కాపాడుకుంటుంది. ఏప్రిల్ 27 వరంగల్ మీటింగ్ ను విజయవంతం చేయాలని, పటాన్చెరువు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు కదిలి రావాలని కోరుతున్నాను’’ అని పేర్కొన్నారు.