Harish Rao
x

విద్యార్థులు మరణిస్తున్నా రేవంత్‌కు పట్టదా..?

కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు.


గురుకులాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గురుకులాల పరిస్థితి అదోగతి అయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి పట్టడ లేదంటూ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో అన్నీ తానై గురుకులాలను ప్యవేక్షిస్తానన్న రేవంత్.. ఆ మాటను అధికారం రాగానే మర్చిపోయారంటూ దుయ్యబట్టారు. కల్తీ ఆహారం, ఎలుక కాట్లు, పాము కాట్లు ఇలా గురుకుల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావన్నారు.

‘‘కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యావ్యవస్థ దీనస్థితికి చేరడం శోచనీయం. విష జ్వరాలు, పాముకాట్లు, ఎలుక కాట్లు, కుక్కకాట్లు, ఫుడ్ పాయిజనింగ్ తో విద్యార్థులు ఆస్పత్రుల పాలై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి దాపురించింది. గురుకులాల్లో పనిచేస్తున్న 2500 మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వని దుస్థితి. ఉపాధ్యాయుల దినోత్సవం నాడు ఆడంబరంగా ప్రకటనలు చేయడం కాదు ముందు వారికి సకాలంలో జీతాలు చెల్లించు రేవంత్’’ అని అన్నారు.

‘‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా నేనే ఇకనుండి గురుకులాలను పర్యవేక్షిస్తానని చెప్పిన మాటలు నీటి మూటలు అయ్యాయి. కల్తీ ఆహారం పెడితే జైలుకే అని ఇచ్చిన ప్రకటనలు గాలి మాటలయ్యాయి. కేసీఆర్ గారి హయాంలో గురుకుల విద్యా వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిస్తే రేవంత్ రెడ్డి పాలనలో నరక కూపాలుగా మారాయి. నాడు 294గా ఉన్న గురుకులాల సంఖ్యను 1024 కి పెంచిన ఘనత కేసీఆర్ ది. గురుకులాల్లో లక్ష 90 వేలుగా ఉన్న విద్యార్థుల సంఖ్యను ఆరున్నర లక్షలకు పెంచి నాణ్యమైన విద్యను అందించిండు కేసీఆర్’’ అని గుర్తు చేశారు.

‘‘విద్యపై చేసే వ్యయాన్ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ గా భావించిన కేసీఆర్ గారు గురుకులాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. కానీ కాంగ్రెస్ 22 నెలల పాలనలో గురుకులాల ఖ్యాతి అధఃపాతాళానికి దిగజారింది. ఇది మీ అసమర్థత పాలనకు మరో నిదర్శనం. గురుకులాలంటే ఎందుకు మీకు అంత చిన్న చూపు రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి గాడిదప్పిన గురుకుల విద్యా వ్యవస్థపై శ్రద్ధ వహించు. తక్షణమే గురుకులాల సమస్యలను పరిష్కరించు. 2500 మంది కాంట్రాక్ట్, ఔర్ సోర్సింగ్ సిబ్బందికి పెండింగ్ జీతాలను చెల్లించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం’’ అని స్పష్టం చేశారు.

Read More
Next Story