Harish Rao
x

Harish Rao | రైతుపై రాజకీయాలు.. రేవంత్‌పై హరీష్ మాటల తూటాలు..

రైతుబంధు, రూ.500 బోనస్.. వీటిలో రైతుకు ఏది మేలు చేస్తుంది.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హరీష్ రావు.


తెలంగాణలో కాంగ్రెస్(Congress) ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు పండగ కార్యక్రమంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు(Harish Rao) ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతుకు పిసరంత మేలు చేయలేదు కానీ రైతుపండగ చేస్తున్నారంటే ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో రైతుకు ఏం మేలు జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు. రైతుపండగ ముగింపు సభకు హాజరుకావడం కోసం సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy).. శనివారం మహబూబ్‌నగర్‌ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన ఎక్స్(ట్విట్టర్) ఖాతా వేదికగా ఆసక్తికర పోస్ట్ ఒకటి పెట్టారు. గతేడాది ఎన్నికల్లో రైతు వేసిన.. అభయహస్తమై నేడు రైతు చరిత్రను మార్చిందని రేవంత్ రాసుకొచ్చారు. దీనిపై హరీష్ రావు ఘాటుగా స్పందించారు. రైతులకు ఏం చేశారని వారి చరిత్ర మారిందని ప్రశ్నించారు. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైతుల పరిస్థితులు మరింత దుర్భరమయ్యాయని విమర్శించారు. పైగా వారికి గత ప్రభుత్వం కల్పించిన పథకాలను రూపుమాపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుండటం దుర్మార్గమని మండిపడ్డారు. ఈ మేరకు హరీష్ రావు కూడా ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఘాటైన పోస్ట్ పెట్టారు.

అభయహస్తమైన ఓటు: రేవంత్

‘‘ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు పోలింగ్ బూతుకు వెళ్లి “మార్పు” కోసం ఓటేశాడు. ఆ ఓటు అభయహస్తమై రైతన్న చరిత్రను తిరగరాసింది. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ.. రూ.7,625 కోట్ల రైతు భరోసా… ధాన్యానికి క్వింటాల్ కు రూ.500 బోనస్… రూ.10,444 కోట్ల ఉచిత విద్యుత్… రూ.1433 కోట్ల రైతుబీమా… రూ.95 కోట్ల పంట నష్ట పరిహారం… రూ.10,547 కోట్ల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. ఒక్క ఏడాదిలో.. రూ.54 వేల కోట్తో రైతుల జీవితాల్లో పండగ తెచ్చాం. ఇది నెంబర్ కాదు. రైతులు మాపై పెట్టుకున్న నమ్మకం. ఈ సంతోష సమయంలో అన్నదాతలతో కలిసి రైతు పండుగలో పాలు పంచుకోవడానికి ఉమ్మడి పాలమూరుకు వస్తున్నా’’ అని రేవంత్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హరీష్ రావు.. రైతు బంధు కంటే బోనస్ అందించడం ఎలా మేలు అవుతుందో చెప్పాలి? అని ప్రశ్నించారు.

మంత్రి మాటలు శోచనీయం: హరీష్

‘‘సాగుకు పెట్టుబడి సాయం అందించి రైతన్నకు భరోసా కల్పించిన రైతు బంధు పథకాన్ని శాశ్వతంగా బంధు పెట్టే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెర లేపడం సిగ్గుచేటు. రైతుబంధు కంటే సన్నాలకు ఇచ్చే రూ.500 బోనసే మేలు అని రైతులు చెబుతున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం శోచనీయం. ప్రపంచంలో రైతుకు పెట్టుబడి సాయం అందించిన ఏకైక పథకం రైతుబంధు అని ఐక్యరాజ్య సమితి సైతం ప్రశంసించింది. అలాంటి గొప్ప పథకాన్ని ఒక ప్రణాళిక ప్రకారం రూపుమాపే ప్రయత్నం చేస్తుండడం దుర్మార్గం’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బోనస్ ఎలా మేలు

‘‘రాష్ట్రంలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తే 5,19,605 క్వింటాళ్ల సన్న వడ్లను క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన రైతులకు దక్కిన బోనస్ సుమారు రూ.26 కోట్లు మాత్రమే. అదే రైతుబంధు కింద ఏడాదికి రూ.7500 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. మీరు మ్యానిఫెస్టోలో చెప్పినట్లు ఎకరాకు రూ.15,000 చెల్లిస్తే ఇది ఇంకా ఎక్కువ అవుతుంది. మరి రైతు బంధు కంటే, బోనస్ అందించడం రైతులకు మేలు ఎట్లవుతుందో వ్యవసాయ మంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి’’ అని నిలదీశారు.

కేసీఆర్ ముందే చెప్పారు

‘‘అధికారంలోకి రాగానే రుణమాఫీ సగం మందికి చేసి, సగం మందికి మొండి చేయి చూపారు. ఆ తర్వాత అన్ని పంటలకు బోనస్ అని, చివరకు సన్నాళ్లకు మాత్రమే పరిమితం చేశారు. ఇప్పుడు రైతుబంధును శాశ్వతంగా రద్దు చేసే ప్రయత్నం మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుబంధును బందు చేస్తారని కేసీఆర్ ముందే హెచ్చరించారు. అనుకున్నట్టే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నది. రైతు భరోసా వస్తదని ఎదురుచూస్తున్న రైతులు, కౌలు రైతులు, ఉపాధి కూలీలు మోసపోయినట్లేనా? రైతులను విజయవంతంగా మోసం చేసినందుకు రైతు పండుగ నిర్వహిస్తున్నావా రేవంత్ రెడ్డి? మేనిఫెస్టోలో చెప్పి, రైతులను నమ్మించి అధికారంలోకి వచ్చాక దగా చేసినందుకు విజయోత్సవాలా రేవంత్ రెడ్డి? రైతుల బతుకులు మార్చేందుకు కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు పథకాన్ని నిలిపివేసే కుట్రను బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. నేడు మహబూబ్ నగర్‌లో నిర్వహించే కార్యక్రమంలో రైతు బంధు అమలుపై స్పష్టత ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న వానకాలం రైతుబంధు తో పాటు, యాసంగికి పంట పెట్టుబడి సాయం వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

Read More
Next Story