Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్‌లమీద కక్ష కట్టిందా?
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సర్పంచ్‌లు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు కాంగ్రెస్ హయాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు.
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సర్పంచ్‌లు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు కాంగ్రెస్(Congress) హయాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటి నుంచి వారికి కష్టాలు మొదలయ్యాయని, బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ పల్లెలు అద్భుతంగా తీర్చిదిద్దబడ్డాయని చెప్పుకొచ్చారు. గ్రామాలు, పల్లెల అభివృద్ది కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అహర్నిశలు శ్రహించిందని, ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి మరీ నెలకు రూ.275 కోట్లు పల్లెల కోసం వెచ్చించనట్లు ఆయన వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ పల్లెలలు తిరోగమనం చెందడం ప్రారంభించాయని విమర్శించారు.
ఈ ఏడాదిలో ఒక్క రూపాయి కూడా పల్లెల కోసం కాంగ్రెస్ ఖర్చు చేసింది లేదని అన్నారు. తెలంగాణ గ్రామపంచాయతీలను కాంగ్రెస్ ప్రభుత్వ ఎంతలా నిర్లక్ష్యం చేసిందంటే.. తెలంగాణ పల్లెలకు వెళ్తే చికెన్ గున్యా వంటి వ్యాధులు వస్తాయిన అమెరికా తన పౌరులకు హెచ్చరించే పరిస్థితి నెలకొందని వివరించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో భాగంగా సర్పంచ్‌ల పెండింగ్ బిల్లుల విషయాన్ని లేవనెత్తారు హరీష్ రావు. సర్పంచ్‌లకు ఇప్పటి వరకు బిల్లులు ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. దాదాపు రూ.691కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.
పెద్దోళ్లకు ఒక లెక్క.. చిన్నవారికి ఒక లెక్కా..?
‘‘బడా బడా కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచిన్న కాంట్రాక్టర్లకు ఎందుకని బిల్లులు చెల్లించడం లేదు. ఏడాది నుంచి చిన్న కాంట్రాక్టర్‌లకు రూ.691కోట్ల విలువై బిల్లులు పెండింగ్‌లో ఎందుకు ఉంచారు. రూ.690 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి సీతక్క గారు చెప్పారు. ఏడాది కాలం నుండి 690 కోట్లు ఇవ్వకుండా సర్పంచులు, ఎంపీటీసీలను ఈ ప్రభుత్వం గోస గుచ్చుకుంటున్నది. గవర్నర్‌ను కలిసి మొర పెట్టుకున్నారు, మంత్రులను కలిసి మొరపెట్టుకున్నారు. ఎక్కడిక్కడ వారిని అరెస్టులు చేశారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తీర్చిదిద్దిన పల్లెలు..
‘‘కేసీఆర్.. పల్లెలను అద్భుతంగా తీర్చిదిద్దారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి గొప్ప కార్యక్రమాలు అమలు చేశారు. పల్లె ప్రగతికి ప్రతి నెల రూ.275 కోట్లు, పట్టణ ప్రగతి కోసం రూ.150 కోట్లు ఇచ్చాము. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏడాది కాలంలో ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వ చెబుతున్న లెక్కలు. దేశవ్యాప్తంగా ఉత్తమ గ్రామపంచాయతీలు ప్రకటిస్తే 20 కిగాను 19 తెలంగాణ గ్రామాలకు వచ్చాయి. తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్, బీఆర్‌ఎస్‌కు దక్కుతుంది’’ అని అన్నారు.
బిల్లులు దారి మళ్లాయి..
‘‘ఈ ప్రభుత్వం వచ్చాక SFC నిధులు విడుదల కావడం లేదు, 15 ఫైనాన్స్ కమిషన్ బిల్లులు డైవర్ట్ చేశారు. జిపి ఫండ్ కూడా ఖర్చు పెట్టుకోకుండా చేశారు. సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. అప్పులు చేసి, బంగారం కుదువపెట్టి గ్రామ పంచాయతీ పనులు చేశారు. నవంబర్ ఒక్క నెలలోనే బడా బడా కాంట్రాక్టర్లకు రూ.1200 కోట్లు విడుదల చేశారు. చిన్న పనులు చేసిన సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్‌పీటీసీలకు బిల్లులు విడుదల చేయకుండా పగ బట్టారు, కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు’’ అని మండిపడ్డారు.
దేశానికి, రాష్ట్రానికి అవమానం
‘‘గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయక పోవడం వల్ల రోగాలు పెరిగాయి. తెలంగాణకు పోతే చికెన్ గున్యా వంటి వ్యాధులు వస్తాయి వెళ్ళకండి జాగ్రత్త అని అమెరికా హెచ్చరించిన దుస్థితి. ఇది దేశానికి, తెలంగాణకు అవమానం. సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు 9 నెలలు అయినా జీతాలు పెండింగ్లో ఉన్నాయి. చేసిన పనులకు బిల్లులు ఇవ్వరు, జీతాలు ఇవ్వరు. అప్పులు కట్టలేక వారు చాలా బాధల్లో ఉన్నారు. ఇప్పటికైనా బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టమైన తేదీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని కోరారు.