
‘ఎన్ని చేశాం అన్నది కాదు.. ఎంత అభివృద్ధి చేశామన్నది ముఖ్యం’
కాంగ్రెస్ వస్తే ఉచిత ఎల్ఆర్ఎస్ అన్నారు. ఇప్పుడు తీరా వచ్చాకా డబ్బులు కట్టాల్సిందేనంటున్నారని గుర్తు చేసిన హరీష్ రావు.
తెలంగాణలో కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు కోసం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చ సమయంలో మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్ఆర్ఎస్ పేరుతో కాంగ్రెస్ భారీ మోసం చేసిందన్నారు. నో ఎల్‌ఆర్‌సీ.. నో బీఆర్ఎస్ అన్న ఈ కాంగ్రెస్ ఆ హామీని కూడా అమలు చేయలేక చతికిలబడిందంటూ చురకలంటించారు. అధికారంలోకి రాకముందంతవరకు తాము వస్తే ఫ్రీ ఎల్‌ఆర్‌సీ అన్నారని, తీరా అధికారం వచ్చాక ఎల్‌ఆర్‌సీకి డబ్బులు కట్టాల్సిందేనని అనడమే కాకుండా, ముక్కుపిండ డబ్బులు వసూలు చేస్తున్నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలానే చేస్తే ‘నో ఎల్‌ఆర్‌సీ.. నో కాంగ్రెస్’ అనే రోజులు కూడా వస్తాయని అన్నారు. మున్సిపాలిటీ శాఖ సీఎం దగ్గరే ఉందని, ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని మున్సిపాలిటీలు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. అసలు ఎన్ని మున్సిపాలిటీలు ఏర్పాటు చేశాం అన్నది ముఖ్యం కాదని, ఎంత అభివృద్ధి చేశాం అనేది కీలకమని పేర్కొన్నారు హరీష్ రావు.
‘‘బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల నుంచి ఎల్‌ఆర్‌సీ అంటూ డబ్బులు గుంజుకుంటుంది. రక్తమాంసాలు పిండేస్తోంది. అదే కాంగ్రెస్ వస్తే ఎల్‌ఆర్‌సీ ఫ్రీ చేస్తాం. నో ఎల్‌ఆర్‌సీ నో బీఆర్ఎస్ అని ఆనాడు అన్నారు. ఇప్పుడేమో అంతా తలకిందులయింది. డబ్బులు కట్టితీరాల్సిందే అంటున్నారు. అదే ప్రజలు నో ఎల్ఆర్ఎస్ నో కాంగ్రెస్ అనే పరిస్థితి వస్తుంది. ఎల్ఆర్ఎస్ జీవో తెచ్చాం.. ఎల్ఆర్ఎస్ ద్వారా వచ్చిన డబ్బుల్లో కొంత మేర ఆ మున్సిపాలిటీ అభివృద్ధికి కేటాయించడం జరుగుతుందని జీవోలో చెప్పాం. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వసూలు చేసిన ఎల్ఆర్ఎస్ డబ్బులను మున్సిపాలిటీలకు ఎప్పటి వరకు అందజేస్తారో చెప్పాలి. వచ్చిన డబ్బు ఎంతనో చెప్పాలి’’ అని హరీశ్‌రావు కోరారు.
డబ్బులు రావట్లేదు..
‘‘పట్టణ ప్రగతి కింద నిధులు నిల్. ఫైనాన్స్ నుంచి డబ్బులు రావట్లేదు. ఎల్‌ఆర్‌సీ నిధుల నుంచి డబ్బులు ఇవ్వట్లేదు. రాష్ట్రం నుంచి నయా పైసా లేదు. మరి మున్సిపాలిటీలు ఎలా కొనసాగాలి. ప్రజలు కట్టిన డబ్బులు ఎప్పటిలోగా ఇస్తారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ నుంచి వచ్చే డబ్బులను కూడా ఇవ్వడం లేదు. ఇలా చేస్తే మున్సిపాలిటీలు ఎలా నడవాలి? వాటి పరిస్థితి ఏంటి అనేది ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పటికయినా ఆలోచించి నిధులు ఇవ్వండి. మున్సిపల్ కమిషనర్లు, ఇంజినీర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు లేరు. కొత్త మున్సిపాలిటీలకు అనుగుణంగా పోస్టులు మంజూరు చేయండి. ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరుతున్నాం’’ అని తెలిపారు.