రేవంత్ రెడ్డి, హరీష్ రావుల మధ్య మరో వార్
సీఎం రేవంత్ రెడ్డి భ్రమల్లో ఉన్నారని సిద్ధిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేవా చేశారు. భ్రమలు వీడి పాలన పై దృష్టి పెడితే మంచిదని సూచించారు.
అందరూ తనలాగే కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతారని సీఎం రేవంత్ రెడ్డి భ్రమల్లో ఉన్నారని సిద్ధిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేవా చేశారు. భ్రమలు వీడి పాలన పై దృష్టి పెడితే మంచిదని సూచించారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ట్విట్టర్ వేదికగా హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్ లో మీడియాతో సీఎం రేవంత్ చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యుత్ శాఖలో కొందరు కావాలనే పవర్ కట్ చేస్తున్నారని, అందుకే పవర్ ఇంటరప్షన్స్ వస్తున్నాయని అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కొందరితో ఇలాంటి తలతిక్క పనులు చేయిస్తున్నారని ఆరోపణలు చేశారు.
రేవంత్ రెడ్డి చేసిన ఈ ఆరోపణలపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. "కరెంట్ కోతల విషయంలో రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా ప్రతి పక్షాలు, విద్యుత్ ఉద్యోగుల మీద అభాండాలు మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. విద్యుత్ రంగ వైఫల్యాలకు నేనే భాద్యుడిని అన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఆయన వైఖరి ఆడ రాక పాత గజ్జెలు అనే సామెతను గుర్తు చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం, 24 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసేందుకు.. విద్యుత్ ఉద్యోగుల సహకారంతో పటిష్ఠమైన వ్యవస్థను నిర్మించింది. రెప్పపాటు కాలం కూడా కరెంట్ కోతలు లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపింది. కేవలం 5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వ్యవస్థను కుప్ప కూల్చింది" అని హరీష్ రావు విమర్శించారు.
"గృహ, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు సరిపోయే విద్యుత్ సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైంది. తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు, ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగులపై రేవంత్ రెడ్డి నిరాధార ఆరోపణ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ పునర్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన విద్యుత్ ఉద్యోగులను చీటికి మాటికి నిందించడం, చర్యలు తీసుకోవడం వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే. విద్యుత్ ఉద్యోగులపై నెపం నెట్టడమే తప్ప కరెంటు కోతలను ఎలా సరిదిద్దాలనే చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి లేకపోవడం దురదృష్టకరం. సీఎం ఇలాంటి చిల్లర మల్లర చేష్టలు మాని కేసీఆర్ హయాంలో రెప్ప పాటు కూడా పోని విధంగా 24 గంటల విద్యుత్ ను ఇచ్చినట్టుగా అన్ని రంగాలకు సరఫరా చేస్తే మంచిది. తన లాగే అందరూ కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతారని సీఎం భ్రమల్లో ఉన్నట్టున్నారు. వాటిని వీడి పాలన పై దృష్టి పెడితే మంచిదని" మాజీ మంత్రి రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు.
కాగా, ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి, హరీష్ రావుల మధ్య ప్రమాణాల పర్వం నడిచిన విషయం తెలిసిందే. రైతు రుణమాఫీపై హరీష్ రావు కాంగ్రెస్ ని దుయ్యబడుతున్న నేపథ్యంలో రేవంత్ ఓ ఛాలెంజ్ చేశారు. పంద్రాగస్టు నాటికి రైతు రుణమాఫీ చేస్తానని, అలా చేస్తే మామా అల్లుళ్ళు కలిసి బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా అంటూ హరీష్ రావు కి సవాల్ చేశారు. ఆయన చేసిన సవాల్ ని స్వీకరించిన హరీష్ రావు... రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రతి సవాల్ చేశారు. కొనసాగింపుగా అమరవీరుల స్థూపం వద్దకి వచ్చి దీనిపై ప్రమాణం చేద్దాం రావాలంటూ రేవంత్ ని డిమాండ్ చేశారు. హరీష్ రావు అమరవీరుల స్థూపం వద్దకి వెళ్లి తన రాజీనామా లేఖని జర్నలిస్టుల చేతిలో పెట్టి, ఛాలెంజ్ లో ఓడిపోతే స్పీకర్ కి లెటర్ చేర్చాలని కోరారు. రేవంత్ రెడ్డి.. హరీష్ రావు రెసిగ్నషన్ లెటర్ స్పీకర్ ఫార్మాట్ లో లేదని విమర్శించారు. తాను రుణమాఫీ చేస్తానంటే హరీష్ రావు ఏవేవో చెప్తున్నాడని కొట్టిపారేశారు. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరి నేతల మధ్య విద్యుత్ వార్ మొదలైంది.