Harish Rao
x

‘రేవంత్ మీరు చెప్పే మార్పిదేనా’.. చురకలంటించిన హరీష్ రావు

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌తో 4.47 లక్షల ఎకరాలకు సాగు నీరు.


ప్రభుత్వం చేపట్టనున్న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ చెప్పే మార్పు ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చూస్తే అర్థమవుతోందంటూ చురకలంటించారు. చేసే ఖర్చుకు అందే లబ్ధికి సంబంధమే లేదన్నారు. కాళేశ్వరంతో పోలిస్తే ఈ ప్రాజెక్ట్‌కు మూడో వంతు ఖర్చు చేస్తున్నారని, తీరా అందించే నీరు చూస్తే కాళేశ్వరంలో పదోవంతు పంటపొలాలకు కూడా సాగునీరు అందించట్లేదంటూ ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లూ మార్పు, అభివృద్ధి అని కాంగ్రెస్ కూతలు కూస్తుంటే.. ఏం చేస్తుందా అనుకున్నానని, తీరా చూస్తే వాళ్ల నిర్వాకం ఇది అంటూ హరీష్ రావు దుయ్యబట్టారు.

‘‘మేడిగడ్డ టు మల్లన్న సాగర్ - మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు రూ. 84,000 కోట్లు అయితే.. జస్ట్ తమ్మిడి హెట్టి టు ఎల్లంపల్లి కి రూ. 35,000 వేల కోట్లట! కాళేశ్వరం పథకంతో 37 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలనేది లక్ష్యం అయితే, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుతో కేవలం 4.47 లక్షల ఎకరాలకే సాగు నీరట! కాళేశ్వరంలో నీటి వినియోగం 240 TMC అయితే, ప్రాణహిత చేవెళ్లలో 80 TMC మాత్రమేనట! కాళేశ్వరం ప్రాజెక్టుతో పోల్చితే మూడో వంతు ఖర్చు చేస్తూ, పదోవంతు ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వరట! 35 వేల కోట్లు ఖర్చు చేసి, కేవలం 4.47 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలనే ఆలోచన అద్భుతం. అమోఘం. కాంగ్రెస్ ప్రభుత్వ ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఇది మరో నిదర్శనం. ఇది కదా అసలైన మార్పంటే? రేవంత్’’ అంటూ సెటైర్లు వేశారు హరీష్ రావు.

అయితే హరీష్ రావు వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు ఘాటుగా స్పందిస్తున్నాయి. లక్ష్యం పెట్టుకోవడం కాదని, దానిని నెరవేర్చాలని విమర్శిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో ఎన్ని ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించారని నిలదీస్తున్నారు. తమ ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కార్‌లా గాల్లో మేడలు కట్టదంటూ చురకలంటిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో 37లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారా? ఇస్తే కదా గొప్ప? అని చురకలంటిస్తున్నారు. కానీ తమ ప్రభుత్వం జరిగే పనులే చెప్తుందని, చెప్పిందంటే చేసి తీరుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read More
Next Story