రేవంత్ హైడ్రా ఆపరేషన్ ఆకర్ష్
x

రేవంత్ హైడ్రా 'ఆపరేషన్ ఆకర్ష్'

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన కట్టడలపైనా హైడ్రా కన్నెర్రజేసింది. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు.


గత కొద్దిరోజులుగా హైడ్రా కూల్చివేతలు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యాయి. పార్కులు, చెరువులు, ప్రభుత్వం స్థలాలు కాపాడేందుకు హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ సంస్థ దూకుడుగావ్య్వవహరిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ భూముల్లో, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లలో నిర్మించిన అక్రమ కట్టడాలపై కొరడా ఝుళిపిస్తోంది. ఫిర్యాదులు వస్తే నోటీసులిచ్చి కూల్చిపారేస్తోంది. ఈ క్రమంలో శనివారం నటుడు అక్కినేని నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ హాల్ ని కూల్చివేయడం సంచలనంగా మారింది. మరోవైపు శనివారమే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన కట్టడలపైనా హైడ్రా కన్నెర్రజేసింది. హైదరాబాద్ లో ఆయనకి చెందిన అనురాగ్ యూనివర్సిటీని బఫర్ జోన్ లో నిర్మించారని, ఆదివారం కూల్చివేస్తున్నామని నోటీసులు సర్వ్ చేశారు.

ఈ వ్యవహారంపై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు. హైడ్రా పేరిట సీఎం రేవంత్ రెడ్డి తమ పార్టీలో నాయకులను బెదిరించి తమ పార్టీలో చేర్చుకోడానికి కుట్రలు పన్నాడని ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డి గారు కొంతమంది ఎమ్మెల్యేలను టార్గెట్ పెట్టుకొని కండువా కప్పుకోండి లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, మీ మీద అక్రమ కేసులు పెడతాం, మీ ఆస్తులు కూల్చేస్తాం అనే ధోరణితో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తా ఉందన్నారు.

"తెలంగాణ ఉద్యమంలో నిక్కచ్చిగా నిజాయితీగా పనిచేసినటువంటి నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి ఎన్నో కేసులు అయ్యి అరెస్టు అయ్యాడు. ఆనాడు ప్రభుత్వంలోనైనా, ప్రతిపక్షంలోనైనా ప్రజల పక్షాన ఒక నిబద్ధత కలిగిన నిజాయితీ గలిగిన ప్రజా ప్రతినిధిగా ఒక కార్యకర్తగా, ఒక ఉద్యమ నాయకుడిగా పనిచేసిన నాయకుడు ఆయన. అలాంటి వ్యక్తిపై కుట్రపూరితంగా కేసులు పెడుతున్నారు. పఠాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మీద అక్రమ మైనింగ్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి, 300 కోట్ల ఫైన్ కట్టాలి అని నోటిసులు ఇచ్చి, ఇప్పుడు ఆయన పార్టీలో చేరగానే అన్ని మర్చిపోయారు, కేసులు కూడా ఆటకెక్కాయ్" అని హరీష్ రావు రేవంత్ సర్కార్ ని విమర్శించారు.

ఇంకా ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే...

పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఇబ్బంది పెట్టేలా అక్రమ కేసులు పెడుతోంది

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పల్లాపై 6 కేసులు పెట్టారు

పల్లా రాజేశ్వర్ రెడ్డి భార్య, పిల్లలపై కూడా కేసులు పెట్టారు

మానసికంగా.. పొలిటికల్‌గా.. ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం కుట్ర

న్యాయం లేకుండా.. నోటీసులు ఇవ్వకుండా హైడ్రా పేరుతో డ్రామాలు

పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీలు ఒక్క ఇంచు ప్రభుత్వ భూమి ఉంటే చెప్పండి 24 గంటల్లో వారే తొలిగిస్తారు

మెడికల్ కాలేజీలో ఎంతో మంది వైద్యం పొందుతారు అక్కడ

అన్ని పర్మిషన్స్‌తో కాలేజీ నిర్మించారు.. ఉద్దేశపూర్వకంగా కాలేజీల మీద దాడి చేస్తున్నారు

ఎఫ్టీఎల్ లోకాని.. బఫర్‌లో కాని లేదని రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ సర్వే రిపోర్ట్ ఇచ్చారు

813 సర్వేనెంబర్లో ఎలాంటి బఫర్ భూమి లేదని అప్పటి జిల్లా కలెక్టర్ రిపోర్టు ఇచ్చారు

హెచ్ఎండీఏ పర్మిషన్ ఉంది.. పల్లాపై కేవలం రాజకీయంగా జరుగుతున్న కుట్ర మాత్రమే

అక్రమాలను మేం ఎప్పటికీ సమర్థించం

రాజకీయ ప్రేరేపితపై చర్యలను అధికారు ప్రేరేపించటం కరెక్ట్ కాదు

అధికారం ఉందని రాత్రికిరాత్రే బుల్డోజింగ్ పద్ధతి చేయటం సరికాదు

అధికారులు అత్యుత్సాహానికి పోవద్దు.. అన్ని పరిశీలించండి

రాజకీయ కక్షలను విద్యాసంస్థలు, ఆసుపత్రులపై రుద్దొద్దు

పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డిలను టార్గెట్ చేసి సీట్లు పెంచుకొనే అవకాశం ఇవ్వలేదు

Read More
Next Story