Harish Rao
x

‘కష్టాలకు ప్రజలకు.. నిధులు ఢిల్లీకి’

రేవంత్ రెడ్డికి కేసీఆర్ భయం పట్టుకుంది. అందుకే ఆయన పేరు తలవకుండా ఉండలేకున్నారు.


తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కుతున్నాయి. నీటి వివాదాలతో పాటు అనేక అంశాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి.. తెలంగాణ ప్రజల యోగక్షేమాల కన్నా.. ఢిల్లీ పెద్దలను మెప్పించుకోవడమే ముఖ్యమంటూ చురకలంటించారు. అందుకే తెలంగాణ నీటినేమో గురుదక్షిణగా ఏపీకి ధారాదత్తం చేస్తున్నారని, నిధులనేమో పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి ఢిల్లీకి పంపుతున్నారని ఘాటు విమర్శలు చేశారు. హరీష్ రావు. రేవంత్ చేతకానితనం వల్లే తెలంగాణ నీరు.. ఏపీకి వెళ్తున్నాయని అన్నారు.

అంతేకాకుండా రేవంత్ రెడ్డికి రోజురోజుకు కేసీఆర్ భయం అధికమైపోతోందని ఎద్దేవా చేశారు హరీష్ రావు. ప్రజలు మళ్ళీ కేసీఆర్, బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని రేవంత్‌కు అర్థమైందని, అందుకే ప్రజల దృష్టి మళ్లించడం కోసం కేసీఆర్, బీఆర్ఎస్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని చురకలంటించారు. కేసీఆర్ పేరు పలకనిదే రేవంత్‌కు రోజు గడవదని, రాత్రి నిద్రలో కూడా రేవంత్‌కు కేసీఆర్ గుర్తుకొస్తున్నారని ఎద్దేవా చేశారు. బనకచర్ల అంశంపై మాట్లాడుతూ.. తెలంగాణ నీటి హక్కుల కోసం మరో ఉద్యమం చేపట్టాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.

తెలంగాణ నీళ్లు APకి, నిధులు ఢిల్లీకి పోతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పార్టీలు కలసి తెలంగాణ హక్కులను కాలరాస్తున్నాయని తీవ్ర విమర్శలు గుప్పించారు. "తెలంగాణ హక్కులను మనమే కాపాడుకోవాలి. నీటి దోపిడీపై కుట్రలను బద్దలు కొట్టాలి. రేవంత్ ఏనాడూ 'జై తెలంగాణ' అనలేదు. కేసీఆర్‌ను తలుచుకోకుండా ఆయన ప్రసంగం సాగదు. ఉద్యమ సమయంలో రాజీనామా చేయకుండా పారిపోయిన వ్యక్తి ఇప్పుడు సీఎం అయ్యారు. "తెలంగాణ ద్రోహుల చరిత్ర రాస్తే.. మొదటి పేరు చంద్రబాబు, రెండో పేరు రేవంత్‌దే. తెలంగాణ పోరాట ఆనవాళ్లను కనుమరుగుచేయడం ముఖ్యమంత్రి లక్ష్యంగా ఉంది. "మన అస్థిత్వాన్ని కాపాడుకునే బాధ్యత యువతదే. నీటి హక్కుల కోసం మరో ఉద్యమం చేస్తాం. బనకచర్ల విషయంలో ఢిల్లీ మెడలు వంచుతాం" అని హెచ్చరించారు.

Read More
Next Story