
‘‘టిమ్స్’ పూర్తికాకపోతే ఉద్యమిస్తాం’
కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు వార్నింగ్..
రేవంత్ ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీస్ రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘టిమ్స్’ ఆసుపత్రి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఆ ఆసుపత్రి నిర్మాణాన్ని కేటీార్ తలపెట్టారని తెలిపారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత.. ఆ ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే కేసీఆర్‌కు పేరొస్తుందేమో అని.. కాంగ్రెస్ కావాలని ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. అందుకే టిమ్స్ నిర్మాణ పనులను నత్తననడకన నడిపిస్తున్నారని విమర్శించారు. కొత్తపేటలో నిర్మిస్తున్న టిమ్స్ భవనాలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబిత ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి, వివేకానంద, కాలేరు వెంకటేశ్‌తో కలిసి హరీష్ రావు శనివారం పరిశీలించారు. భవన నిర్మాణ పనులను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగానే కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరికలు చేశారు.
‘‘మా ప్రభుత్వం ఉండి ఉంటే ‘టిమ్స్’ ఇప్పటికే పూర్తయి ఉండేది. కానీ కాంగ్రెస్ కావాలనే ఆలస్యం చేస్తోంది. రాజీకయాలను పక్కనబెట్టి కంటి వెలుగు కార్యక్రమాన్ని కొనసాగించాలి. రేవంత్ రెడ్డి సర్కారులో ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టారు. కేసీఆర్ తెచ్చిన మంచి పనులను, పథకాలను ఆపాలని సీఎం ఆలోచిస్తున్నారు. ఆరు నెలల్లో టిమ్స్ ఆసుపత్రి నిర్మాణాలను పూర్తి చేయాలి. లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమిస్తాం. రాజకీయాల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టడం సబబు కాదు. అది సీఎం ఆలోచించుకోవాలి’’ అని హితవు పలికారు.
‘‘వందేళ్ల ముందు చూపు కేసీఆర్ ది అయితే, మంద బుద్ధి కాంగ్రెస్ పార్టీది. రెండేళ్లుగా టిమ్స్ ఆస్పత్రులను పడావు పెట్టిన చేతగాని సీఎం రేవంత్. వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ లను పూర్తి చేసి వినియోగంలోకి తేవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్. కేసీఆర్ మీద కక్షతో ఆసుపత్రులపై పగ పెంచుకోవడం దారుణం. ప్రజల ప్రాణాలు కాపాడే ఆసుపత్రులతో రాజకీయాలు చేయడం తగదు. డేట్లు, డెడ్‌లైన్లు మారాయి తప్ప పనులు పూర్తి కావడం లేదు. బీఆర్ఎస్ మంజూరు చేసిన మహేశ్వరం, కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీలను రద్దు చేయడం దుర్మార్గం’’ అని అన్నారు.
‘‘బస్తీ దవాఖానలకు సుస్తీ పట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ‘ఒకటో తేదీనే జీతాలు’ అన్న రేవంత్‌రెడ్డి, 6 నెలలుగా బస్తీ వైద్యులకు, సిబ్బందికి ఎందుకు వేతనాలు చెల్లించలేదు? రూ. 1400 కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టి, పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. కంటి వెలుగు పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదు? బీఆర్ఎస్ పాలనలో పురోగమనం – కాంగ్రెస్ పాలనలో తిరోగమనం. వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ ఆసుపత్రుల పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని రేవంత్‌రెడ్డిని హెచ్చరిస్తున్నాం’’ అని స్పష్టం చేశారు.