
హైకోర్టు తీర్పు రేవంత్‌కు చెంపపెట్టా..!
విద్యార్థుల జీవితాలతో ఆటలాడటమేంటన్న మాజీ మంత్రి హరీష్ రావు.
గ్రూప్-1 పరీక్షల విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును మాజీ మంత్రి హరీష్ రావు స్వాగతించారు. ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్‌కు చెంపపెట్టని వ్యాఖ్యానించారు. విద్యార్థుల జీవితాలతో రేవంత్ చెలగాటం ఆడాలనుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై రేవంత్ ఏమని సమాధానం చెప్తారు? అని ప్రశ్నించారు. మొదటి నుంచి కూడా విద్యార్థులు తమకు అన్యాయం జరుగుతుందని వాపోతున్నా ప్రభుత్వం మాత్రం ఒంటెద్దు పోకడతో ప్రవర్తించిందని, విద్యార్థులపై లాఠీ ఛార్జ్‌లు చేసి, కేసులు పెట్టి వారి జీవితాలను నాశనం చేయాలనుకుందని మండిపడ్డారు. కానీ ఇప్పుడు హైకోర్టు ఈ అంశంలో సరైన తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు.
‘‘గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో అవకతవకలు.. పరీక్ష కేంద్రాల కేటాయింపు, హల్ టికెట్ల జారీ, పరీక్ష ఫలితాల్లో అనుమానాలు, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో నేడు హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు. లోప భూయిష్టంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రేవంత్ రెడ్డి.. ఈ కోర్టు తీర్పుకు మీరు చెప్పే సమాధానం ఏమిటి? హడావుడిగా పరీక్షలు నిర్వహించి, అవకతవకలకు పాల్పడ్డ నీ నిరాక్ష్యానికి విద్యార్థులు, నిరుద్యోగులు బలవుతున్నారు. గప్పాలు కొట్టే కాంగ్రెస్ ప్రభుత్వానికి పరీక్షలు ఎలా నిర్వహించాలి అనే సోయి కూడా లేదు. పరీక్షలు నిర్వహించడం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అంటే విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొట్టి చిల్లర రాజకీయాలు చేయడం కాదు రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా కండ్లు తెరువు. నీ నిర్లక్ష్య, మోసపూరిత వైఖరికి సిగ్గుతో తలదించుకో. తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పు’’ అని సూచించారు.
అయితే గ్రూప్-1 మూల్యాంకనం, ర్యాంకుల విషయంలో విద్యార్థులు భారీ ఎత్తున ఆందోళనలు తెలిపారు. ఈ క్రమంలో విద్యార్థులపై పలు కేసులు నమోదు చేశారు పోలీసుతు. కాగా ఆ కేసులను తొలగించాలని న్యాయస్థానం గతంలోనే పోలీసులకు తెలిపింది. అనంతరం గ్రూప్-1 మూల్యాంకనం అంశం విచారణను కొనసాగించింది. తాజాగా పునఃమూల్యాకనం చేపట్టాలని ఆదేశిస్తూ మార్చి నెలలో విడుదల చేసిన మార్కులు, ర్యాంకులను రద్దు చేసింది. పునఃమూల్యాకనం చేయడానికి అధికారులకు ఎనిమిది నెలల గడువు ఇచ్చింది. పునఃమూల్యాకనం చేయని పక్షంలో గ్రూప్-1 మెయిన్స్‌ను రద్దు చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది.