
అతి త్వరలో బీజేపీ చేతులు మారబోతోంది: సామ రామ్మోహన్
కారు దిగి కమలాన్ని అందుకోవడానికి హరీష్ రెడీ అవుతున్నారన్న కాంగ్రెస్ నేత.
తెలంగాణ రాజకీయాల్లో త్వరలో సంచలన జరగబోతోందని కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ నాయుడు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. అతి త్వరలో తెలంగాణ బీజేపీ కంట్రోల్ హరీష్ రావు చేతుల్లోకి వెళ్లనుందని సామ జోస్యం చెప్పారు. కారు దిగి కమలాన్ని అందుకోవడానికి హరీష్ రావు రెడీగా ఉన్నారని, బీఆర్ఎస్ హరీష్ కాస్తా బీజేపీ హరీష్‌గా అవతరించడానికి రెడీగా ఉన్నారని రామ్మోహన్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. హరీష్ ఎంట్రీ ఇచ్చాక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు, బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలు బొమ్మల్లా మిగిలిపోతారని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఈటల రాజేందర్, హరీష్ రావు పన్నిన వ్యూహంలో బీజేపీ చిక్కిందని సామ అన్నారు. హరీష్ రావు కార్యక్రమాలకు కేటీఆర్‌ను మంచిన ప్రచారం వచ్చేలా తెలంగాణ బీజేపీ నాయకత్వం ఇప్పటికే ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తోందని చెప్పారు. అతి త్వరలోనే హరీష్ రావు.. బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని సామా వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చలకు దారితీస్తోంది.
ఇది వరకు కూడా హరీష్ రావు.. బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరతారని పలుసార్లు ప్రచారం జరిగింది. కాగా తాను ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్‌లోనే ఉంటానని హరీష్ రావు స్పష్టం చేశారు. అయితే ఇటీవల బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయి, ఆ తర్వాత రాజీనామా చేసిన బయటకు వచ్చేసి కల్వకుంట్ల కవిత.. అనేక సందర్భాల్లో హరీష్ రావు టార్గెట్‌గా విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే హరీష్ రావు.. బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నారని కూడా ఆమె హింట్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు సామ చేసిన వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

