Harish Rao
x

‘సీఎం రేవంత్ తీరు రైతుల దురదృష్టం’

మొక్కజొన్న రైతులను ఆదుకోవాలంటూ సీఎం రేవంత్‌కు హరీష్ రావు లేఖ.


ఇటువంటి ముఖ్యమంత్రి ఉండటం రైతులు చేసుకున్న దురదృష్టం అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొక్కజొన్న రైతులు పడుతున్న కష్టాలు సీఎం రేవంత్‌కు కనిపిస్తలేవంటూ చురకలంటించారు. ఇప్పటికి అయినా రేవంత్ అలసత్వం వదిలి అప్రమత్తతో పనిచేయాలని, మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రేవంత్‌కు హరీష్ రావు లేఖ రాశారు. ‘‘తెలంగాణ రాష్ట్రంలోని రైతులు పడుతున్న ఇబ్బందులను పదే పదే మీకు గుర్తు చేయాల్సి రావడం చాలా బాధాకరం. పంటల దిగుబడి సమయంలో ఓ ముఖ్యమంత్రిగా అప్రమత్తతతో ఉండాల్సిన మీరు పూర్తి అలసత్వం వహించడం ఈ రాష్ట్ర రైతుల దురదృష్టం. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 7లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయడం జరిగింది. పంట కోతకు వచ్చి మక్కలను మార్కెట్లలోకి తరలిస్తున్నారు. దాదాపు అన్ని మార్కెట్ యార్డులు మొక్కజొన్న నిల్వలతో నిండిపోయాయి. కానీ మీ ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. దీంతో రైతుల శ్రమను దళారులు దోచుకుంటున్నారు. క్వింటాలుకు రూ.2400 మద్దతు ధరతో పాటు కాంగ్రెస్ మేనిఫెస్టోలో మీరు చెల్లిస్తామన్న రూ.330 బోనస్ ను రైతులకు అందించడంలో మీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది’’ అని అన్నారు.

‘‘ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అడ్డికి పావుశేరు చొప్పున రైతులు అమ్ముకునే దుస్థితి ఏర్పడింది. క్వింటాల్ మక్కలను రూ.1600కే రైతుల వద్ద నుంచి ప్రైవేట్ వ్యాపారులు కొంటున్నారు. ఫలితంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లి వారి కష్టమంతా దళారుల పాలవుతున్నది. గత రెండు సంవత్సరాలుగా బోనస్ డబ్బులు ఊసు లేదు. ఇటు మద్దతు ధర రాక.. అటు బోనస్ లేక రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. రైతుల కష్టాలు మీ కళ్లకు కనిపించడం లేదా.. వారి రోదన మీకు వినిపించడం లేదా..!. ఢిల్లీ టూర్లు, కమిషన్లు,సెటిల్మెంట్లు పక్కనబెట్టి రైతుల బాధలపై దృష్టి పెట్టండి. రైతుల ఏడుపు, అన్నదాతల ఆవేదన కంటే మీకు కక్ష రాజకీయాలే ముఖ్యమా. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి మొక్కజొన్నకు కనీస మద్దతు ధర క్విoటాల్ కు 2400 రూపాయలతో పాటు రూ. 330 రూపాయల బోనస్ లభించేలా చూడాలి’’ అని డిమాండ్ చేశారు.

Read More
Next Story