‘కుల గణన నుంచి వారికి మినహాయింపు ఇవ్వండి’.. సీఎంను కోరిన హరీష్
x

‘కుల గణన నుంచి వారికి మినహాయింపు ఇవ్వండి’.. సీఎంను కోరిన హరీష్

తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన చేపట్టనున్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు.


తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన చేపట్టనున్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. రేపటి నుంచే కులగణన ప్రారంభం కానుండటం, ఈరోజు ఈ అంశంపై చర్చించడానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు వస్తున్న క్రమంలో హరీష్ రావు లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కుల గణన కోసం కాంగ్రెస్ సర్కార్.. ఉపాధ్యాయులను రంగంలోకి దించింది. ఈ కుల గణన ముగిసే వరకు ఉపాధ్యాయులు ఇటు స్కూళ్లో మధ్యాహ్నం వరకు పాఠాలు చెప్పి ఆ తర్వాత నుంచి కుల గణన సర్వే చేయాల్సి ఉంటుంది.

ఈ క్రమంలో సమగ్ర కుటుంబ సర్వే నుంచి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను మినయించాలని హరీష్ రావు తన లేఖలో కోరారు. కుల గణన సర్వే కోసం సెకండరీ గ్రేడ్ టీచర్లు 36,559 మంది, ప్రైమరీ స్కూల్ హెడ్‌మాస్టర్లు 3,414 మందిని ప్రభుత్వం నియమించింది. అంతేకాకుండా సమగ్ర కుటుంబ సర్వే కోసం ఉపాధ్యాయులను వినియోగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హరీష్ రావు తప్పుబట్టారు. ఇది విద్య హక్కు చట్ట ఉల్లంఘనే అవుతుందని అన్నారు. కావున ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఆయన కోరారు.

ప్రభుత్వ ఉత్తర్వులు చట్ట విరుద్ధం

‘‘సమగ్ర కుటుంబ సర్వే కోసం 36,559 మంది ఎస్జీటీలను, 3,414 మంది ప్రధానోపాధ్యాయులను ఈ సర్వేలో భాగం చేశారు. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ ప్రభుత్వం నవంబర్ 1న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు విద్య హక్కు చట్ట నిబంధనలకు విరుద్ధమే. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకే పాఠశాలలు నిర్వహించాలని, మధ్యాహ్నం నుంచి ఉపాధ్యాయులు సర్వే కోసం వెళ్లాలన్నది ఆ ఉత్తర్వులు సారాంశంగా ఉంద’’ అని హరీష్ రావు వివరించారు. ఇది ఏమాత్రం సరైన పద్ధతి కాదని, కావాలంటే వాలంటీర్లో, ఇతర శాఖ అధికారుల ద్వారానో కుటుంబ సర్వే చేయించుకోవాలని హరీష్ రావు సూచించారు. ఇంతకీ సీఎంకు రాసిన లేఖలో హరీష్ రావు ఏయే అంశాలు పేర్కొన్నారంటే..

హరీష్ రావు లేఖలో ఏమన్నారంటే..


‘‘మీ పాలన పుణ్యమా అని ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలపై ఉన్న నమ్మకం రోజురోజుకు తగ్గిపోతోంది. మీ నిర్లక్ష్యం, అనాలోచిత నిర్ణయాలు విద్యార్థులు, తల్లిదండ్రులకు తోడు ఉపాధ్యాయులకు శాపాలుగా మారుతున్నాయి. ఇప్పుడు కుటుంబ సర్వే పేరుతో టీచర్లు, విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తూ, విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం, ఉపాధ్యాయులను జనాభా గణన లెక్కలు, ప్రకృతి వైపరిత్యాలలో సహాయ విధులు, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ, స్థానిక ప్రభుత్వాలకు జరిగే ఎన్నికలకు సంబంధించిన విధులకు మాత్రమే వినియోగించాలని స్పష్టం చేస్తోంది. ఇవి కాకుండా మరే ఇతర పనులకు వినియోగించకూడదని విద్యా హక్కు చట్టం నిర్దేశిస్తోంది. ఈ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం కుల గణన కోసం ఉపాధ్యాయులను వినియోగించుకోవడం విద్యా హక్కు చట్ట ఉల్లంఘన కిందికి వస్తుంది. ప్రభుత్వ బడులలో చదివే పిల్లల తల్లిదండ్రులు అత్యధిక శాతం కూలి నాలి చేసుకునే వారే. అకస్మాత్తుగా ఒంటి పూట బడులు నడపడం వలన పిల్లలకే కాకుండా తల్లిదండ్రులకు కూడా ఇబ్బందులు ఉంటాయి. పిల్లల చదువులు కుంటుపడటంతో పాటు వారి భవిష్యత్తుపై ప్రభావం పడుతుంది. విద్యా హక్కు చట్టాన్ని దృష్టిలో ఉంచుకొని సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నుంచి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను మినహాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం” అంటూ హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు.

Read More
Next Story