
‘రేవంత్ రెడ్డికి చంద్రబాబును ప్రశ్నించే దమ్ము లేదు’
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ కూడా తన రెండు కళ్లు అని చంద్రబాబు చేసే వ్యాఖ్యలు వట్టి బోగస్ మాటలేనని ఎద్దేవా చేశారు.
తెలంగాణ నీటి హక్కులను కాంగ్రెస్ కాలరాస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన నీటిని చంద్రబాబు లాక్కెళ్తున్నా సీఎం రేవంత్ రెడ్డి చోద్యం చూస్తున్నారని విమర్శించారు. ఇప్పటికి కూడా తెలంగాణ నీటిని అక్రమంగా లాక్కెళ్లడానికి చంద్రబాబు ప్రయత్నిస్తుంటే అందుకు రేవంత్ మౌనంగా వత్తాసు పలుకుతున్నారని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నీటి సమస్యలపై హరీష్ రావు.. సిద్దిపేటలో చర్చించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ కూడా తన రెండు కళ్లు అని చంద్రబాబు చేసే వ్యాఖ్యలు వట్టి బోగస్ మాటలేనని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు, జగన్‌ది ఒకే బాట
‘‘చంద్రబాబు సమన్యాయం, రెండు కళ్ల సిద్ధాంతం వట్టి మాటలే. నాడు ప్రాజెక్టులను అడ్డుకున్నడు, నేడు నీటిని అక్రమంగా తరలించే యత్నం చేస్తున్నడు. తెలంగాణకు అన్యాయం చేయడంలో చంద్రబాబైనా, జగన్ అయినా ఇద్దరిదీ ఒకే బాట. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8మంది బిజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా తెలంగాణ ప్రయోజనాలు కాపాడటంలో విఫలం. కేంద్రంలో పలుకుబడిని అడ్డం పెట్టుకొని చంద్రబాబు చేసే కుట్రలకు బిజేపీ వత్తాసు పలుకుతుంది. ఇంత జరుగుతున్నా తెలంగాణ సీఎం రేవంత్ మాత్రం చోద్యం చూస్తున్నారు. తెలంగాణ నీటి హక్కుల కోసం ఎప్పటికీ పోరాటం చేసేది బీఆర్ఎస్ ఒక్కటే. చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే, తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అభ్యంతరం లేదని కేంద్రానికి లేఖ రాయాలి’’ అని డిమాండ్ చేశారు హరీష్.
కాంగ్రస్ చేతగాని తనమే
‘‘ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించలేదని, సముద్రంలో కలిసే నీటిని తీసుకువెళ్తున్నాని, తెలంగాణ ఏపీ రెండు కళ్ల లాంటివని, రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరగాలని కోరుకుంటున్నానని అన్నారు. పూర్తిగా సత్యదూరమైన వాస్తవాలను ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని తనం వల్ల, నిర్లక్ష్యం వల్ల కేంద్రంలో ఉన్న బిజేపీ పక్ష పాత దోరణి వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతున్నది. రేవంత్ రెడ్డికి కేంద్రాన్ని ఎదిరించే దైర్యం లేదు, చంద్రబాబును ప్రశ్నించే దమ్ము లేదు. ఢిల్లీని చూస్తే రేవంత్‌కు భయం, బాబు పట్ల గురు దక్షిణ. దీంతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నది’’ అని అన్నారు.
తెలంగాణ నీరు కాజేస్తున్నారు
‘‘మీకు రెండు రాష్ట్రాలు రెండు కళ్లు అయితే, నాగార్జున సాగర్ ఎడమ కాల్వను ఎండబెట్టి, సాగర్ కుడి కాల్వ నుంచి నిండుగా నీళ్లు తీసుకుపోతున్నావు. ఇదేనా సమన్యాయం. కృష్ణా జలాల్లో ఏపీకి తాత్కాలికంగా కేటాయించిన వాటా ప్రకారం 512 టీఎంసీలు రావాలి. కానీ మీరు 655 టీఎంసీల నీరు వాడారు. తెలంగాణకు 343 టీఎంసీ రావాలి. కాని తెలంగాణకు 220 వచ్చింది. ఢిల్లీలో ఉన్న మీ పలుకుబడి ఉపయోగించి బిజేపీ, చంద్రబాబు తెలంగాణ నోరు కొట్టారు. నాగార్జున సాగర్, శ్రీశైలం నుంచి రోజుకు రెండు టీఎంసీలు తీసుకుపోతున్నరు. తెలంగాణకు సాగు నీరు, తాగు నీరు లేకుండా చేస్తున్నారు. హైద్రాబాద్ తాగు నీరు, ఎడమ కాల్వ కింద పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది’’ అని ఆందోళన వ్యక్తం చేశారు.
పెన్నా బేసిన్ ప్రాజెక్ట్‌లతో అన్యాయం
‘‘మీరు దత్తత తీసుకున్న మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కల్వకుర్తి, నెట్టంపాడు, కోయిల్ సాగర్, బీమా కింద కూడా పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. సమన్యాయం మాటల్లో ఉంది, చేతల్లో ఆంధ్రకు మాత్రమే ఉంది. తెలంగాణ విషయంలో మీది పక్షపాత ధోరణి. కృష్ణా జలాల్లో అన్యాయంగా నీళ్లు తీసుకుపోయి తెలంగాణకు అన్యాయం చేసింది మీరు కాదా.. గోదావరి బనకచర్ల ప్రాజెక్టు ద్వారా సముద్రంలో కలిసే నీళ్ళు తీసుకుపోతే తప్పేంటి అంటున్నారు. కృష్ణా నది విషయంలోనూ అదే జరిగింది. పెన్నా బేసిన్ లో ప్రాజెక్టులు కట్టి నదీ పరివాహక ప్రాంతం బయట కృష్ణా జలాలు వాడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పెన్నా బేసిన్ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టి తెలంగాణ నోరు కొట్టారు. అత్యధిక ప్రాంతం తెలంగాణలో పారితే, ఎక్కువ వాటా లేకుండా అన్యాయం చేశారు’’ అని మండిపడ్డారు.
చంద్రబాబు సీఎం అయ్యాక అంతా మారింది
‘‘అందుకే తెలంగాణ ఉద్యమం పుట్టింది. గోదావరి జాలల విషయంలోనూ అదే పని చేస్తున్నారు. బనకచర్ల ద్వారా 200 టీఎంసీలను గోదావరి నుంచి పెన్నా బేసిన్ కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బచావత్ ట్రిబ్యునల్ గోదావరి లో 1480 టీఎంసీలను ఉమ్మడి ఏపీకి కేటాయించింది. అప్పటి ప్రభుత్వ జీవోల ప్రకరామే 968 టీఎంసీ తెలంగాణకు కేటాయించారు. కానీ వాడకంలో ఎప్పుడూ 200 టీఎంసీలు దాటలేదు. అందుకే కేసీఆర్ సీఎం అయ్యాక గోదావరి నదిని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో 240 టీఎంసీలతో కాళేశ్వరం ప్రాజెక్టును, 47 టీఎంసీలతో సమ్మక్క సాగర్, 65 టీంఎంసీలతో సమ్మక్క సాగర్ ను, 12 టీఎంసీలతో వార్దా ప్రాజెక్టుకు రూపకల్పన చేసారు. కానీ చంద్రబాబు సీఎం కాగానే ఒక్కో ప్రాజెక్టు డీపీఆర్ లు వాపస్ వస్తున్నాయి. కేసీఆర్ శక్తి యుక్తులతో కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు సాధించారు’’ అని గుర్తు చేశారు.
రేవంత్‌కు ప్రశ్నించే తెగువ లేదు
‘‘సీతమ్మ సాగర్, సమ్మక్క సాగర్, వార్దా, కాళేశ్వరం మూడో టీఎంసీలకు అన్ని అనుమతులు సాధించి చివరి స్టేజీలో ఉంది. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం, చంద్రబాబు తన పలుకుబడి కేంద్రంలో ఉపయోగించి డీపీఆర్ లు వాపస్ వచ్చేలా చేసిండు. రేవంత్ రెడ్డికి బిజేపిని ప్రశ్నించే తెగువ లేదు, తెలివి లేదు. ఢిల్లీలో రేవంత్ రెడ్డిని జర్నలిస్టులు ప్రశ్నలు అడిగితే అవగాహన లేక ఐ యామ్ నాట్ రైట్ ద పర్సన్ అని పక్కకు తప్పుకున్నాడు. ఈయన చంద్రబాబును ఎదురించి చంద్రబాబును ప్రాజెక్టులు సాధిస్తారా, అక్రమ ప్రాజెక్టులను ఆపగలుగుతారా? చంద్రబాబు దగ్గర పని చేసిన వారిని తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారులుగా నియమించాడు. తెలంగాణకు ఎలా న్యాయం జరుగుతుంది’’ అని వ్యాఖ్యానించారు.
కాళేశ్వరాన్ని అడ్డుకునే ప్రయత్నం
‘‘కాళేశ్వరం మంచిది అన్నరు. కనీసం ఒక మాట నిజం చెప్పారు. కానీ, నేను కాళేశ్వరం ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేయలేదు అన్నాడు. 13.06.2018 నాడు చంద్రబాబు కేంద్రానికి రాసిన లేఖను విడుదల చేస్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వడం పట్ల తీవ్రమైన విచారం వ్యక్తం చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. కానీ కాళేశ్వరం అడ్డుకోలేదు అని మాట్లాడారు. బనకచర్ల ద్వారా 200 టీఎంసీలు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క కాళేశ్వరమే కాదు, వారు దత్తత తీసుకున్న పాలమూరు జిల్లాలో కల్వకుర్తి నీటి కేటాయింపులు పెంచితే దాన్ని వ్యతిరేకిస్తూ లేఖ రాసారు, పాలమూరు ఎత్తి పోతల, డిండి ఎత్తిపోతల పథకాలను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసారు. శాంపిల్ గా కొన్ని విడుదల చేస్తున్నాం. ఇంకా పదుల సంఖ్యలో చంద్రబాబు, ఆయన ప్రభుత్వం రాసిన లేఖలు ఉన్నాయి’’ అని తెలిపారు.
బాబుది సమన్యాయమా?
‘‘మీరేమో ఎలాంటి అనుమతులు లేకుండా బనకచర్ల ద్వారా నీళ్లు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తారు. కానీ తెలంగాణలో రాష్ట్ర విభజన కంటే ముందే ప్రారంభమైన పాత ప్రాజెక్టులైన పాలమూరు, డిండి, కాళేశ్వరం ప్రాజెక్టులను వ్యతిరేకిస్తారు. పాత ప్రాజెక్టులను వ్యతిరేకిస్తారు, మీరు మాత్రం కొత్త ప్రాజెక్టులకు ఎవని అనుమతి లేదు, ఢిల్లీలో నాకు అధికారం ఉందని దంచుకుపోతా అంటున్నరు. ఇది సమన్యాయం ఎట్లా అయితది. ఇది రెండు కళ్ల సిద్ధాంతం ఎట్ల అయితది. కాళేశ్వరం అనేది తెలంగాణ లైఫ్ లైన్. 18.25లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 18.83లక్షల ఎకరాల స్థిరీకరణ. హైద్రాబాద్ సహా, సగం తెలంగాణకు సాగు, తాగు నీరు అందించే ప్రాజెక్టు. దీన్ని వ్యతిరేకించడం అంటే తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేయడమే’’ అని అన్నారు.
బాబు, జగన్‌ది ఒకే బాట
‘‘తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ చంద్రబాబు డజన్ల కొద్ది ఉత్తరాలు రాసిండు. బనకచర్ల కోసం ఆనాటివి మర్చిపోయి ఇప్పుడు మాట్లాడితే మేం మర్చిపోం కదా. తెలంగాణకు న్యాయం కోసం ఏనాడు చంద్రబాబు మాట్లాడలేదు, ఏపీ హక్కుల కోసమే మాట్లాడారు. తెలంగాణకు అన్యాయం చేయడంలో చంద్రబాబు, జగన్ లది ఒకే బాట. సూటిగా అడుతున్న. గోదావారి 969 టీఎంసీలు నీళ్లు కేటాయించారు కదా. ముందు మా నికర జలాల మీద నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఆపండి. నికరజలాల వినియోగం కోసం నిర్మిస్తున్న సీతమ్మసాగర్, సమ్మక్క సాగర్, కాళేశ్వరం మూడో టీఎంసీ, వార్దా ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ లేఖ రాసారు. నిజంగా తెలంగాణ మీద ప్రేమ నిజం అయితే, రెండు కళ్ల సిద్దాంతం నిజం అయితే, సమన్యాయం నిజమైతై ఈ నాలుగు ప్రాజెక్టులు తెలంగాణకు అనుమతి ఇవ్వండి, ఏపీకి అభ్యంతరం లేదు అని కేంద్రానికి ఉత్తరం రాయండి. గోదావరిలో నీళ్లు చాలా ఉన్నవి అంటున్నారు కదా. కేంద్రానికి వెంటనే లేఖ రాయండి’’ అని డిమాండ్ చేశారు.
చంద్రబాబు కిరికిరి పెట్టారు
‘‘మీ మాటలు నిజం అయితే ఎందుకు అడ్డుకుంటున్నారు. మీరు లేఖ రాయాలని డిమాండ్ చేస్తున్నం. పాలమూరు జిల్లాలో నిర్మిస్తున్న పాలమూరు, డిండి ఎత్తి పోతల పథకాలకు అభ్యంతరం లేదని కేంద్రానికి లేఖ రాసి మీ సమన్యాయం నిరూపించండి. సమన్యాయం నిజమే అయితే పాలమూరులో వేసిన ఎన్ జి టి కేసు విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ ఎంతో ఆలోచించి 45 టీఎంసీలు పాలమూరు ఎత్తిపోతల కోసం నికర జలాలు కేటాయించి, కేంద్రానికి డీపీఆర్ పంపినం. సిడబ్ల్యుసి మాజీ చైర్మన్ బజాజ్ గారి నేతృత్వంలో కమిటి వేస్తే, చంద్రబాబు కిరికిరి పెట్టి, తన పలుకుబడి ఉపయోగించి ఇవాల్టి వరకు రిపోర్టు బయటికి రానివ్వలేదు. ఆ రిపోర్టు వస్తే పాలమూరు ప్రాజెక్టు ఆగదు, మీ సమన్యాయం నిజం అయితే ఎందుకు పాలమూరు మీద ఎన్జీటి కేసు వేసారు. చంద్రబాబు సమాధానం చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు.
బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచెయ్యి ఎందుకు
‘‘ఢిల్లీ చంద్రబాబు చేతుల్లో ఉంది. పలుకుబడి ఉపయోగించి బడ్జెట్ లో ఏపీకి డబ్బులు తెచ్చుకున్నరు. సమన్యాయం అయితే తెలంగాణకు బడ్జెట్ లో గుండు సున్నా ఎందుకు వచ్చింది. రేవంత్ రెడ్డికి చేతకాలేదు, 8 మంది బిజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు చేసిందేం లేదు. సమన్యాయం అని చెబుతున్న మీరు ఎందుకు మాట్లాడలేదు. ఎందుకంటే మీ రెండు కళ్లు ఆంధ్రప్రదేశ్ దిక్కే చూస్తున్నయి. వైజాగ్ ఉక్కు ఫ్యాక్టీరిని ప్రైవేటీకరణ చేయకుండ ఆపారు. కేసీఆర్ గారు విశాఖ ఉక్కుకు మద్దతు తెలిపారు. ప్రైవేటీకరణ చేయొద్దని మాట్లాడారు. మీరు కేంద్రంలో పలుకుబడి ఉపయోగించి విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయకుండా కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ తెచ్చుకున్నారు’’ అని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది అందుకే
‘‘మీ సమన్యాయం నిజమే అయితే ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తుక్కు కింద అమ్ముతున్నరు. ఎందుకు ఉత్తరం రాయడం లేదు, ఎందుకు మాట్లాడటం లేదు. మీ రెండు కళ్లు, సమన్యాయం పెదవుల మీద ఉంది. మీకు తెలంగాణ పట్ల ఎలాంటి ప్రేమ లేదు. ఆదిలాబాద్ సిమెంట్ ప్రైవేటీకరించడం వద్దు అని డిమాండ్ చేయండి. పోలవరం వలే, పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేయండి. కాంగ్రెస్ ఎంపీలు అడుగరు, బిజేపీ ఎంపీలు ప్రశ్నించరు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సెమెంట్ ఫ్యాక్టీరిని తుక్కు కింద అమ్మితే చోద్యం చూస్తున్నడు. చంద్రబాబుకు బిజేపీ వత్తాసు పలుకుతున్నది, రేవంత్ మాట్లాడడు, ఎంపీలు నోరు మెదపరు. అందుకే తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ గొంతు విప్పాల్సి వస్తున్నది. తెలంగాణకు అన్యాయం బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు. ప్రజలను చైతన్యం చేస్తం. బిజేపీ,చంద్రబాబు కుట్రలను తిప్పిగొడుతం. రేవంత్ రెడ్డి చేతగాని తనాన్ని ఎండగడుతం’’ అని హెచ్చరించారు.