రేవంత్ కాసుల వేటకు సీఎస్ బలైపోయారా ?
x
Revanth and Chief Secretary

రేవంత్ కాసుల వేటకు సీఎస్ బలైపోయారా ?

అధికారవ్యవస్ధ కావచ్చు, న్యాయవ్యవస్ధ, ఎగ్జిక్యూటివ్ ఏదన్నా కానీండి అంతిమ నిర్ణయం మాత్రం, పై చేయి ఎప్పటికీ శాసనవ్యవస్ధదే అన్నవిషయం చాలాసార్లు నిరూపణైంది


ఎవరెన్ని మాటలుచెప్పినా, చట్టాలున్నా చివరకు రాజకీయవ్యవస్ధే అన్నీ వ్యవస్ధలకు సూపర్ బాస్. అధికారవ్యవస్ధ కావచ్చు, న్యాయవ్యవస్ధ, ఎగ్జిక్యూటివ్ ఏదన్నా కానీండి అంతిమ నిర్ణయం మాత్రం, పై చేయి ఎప్పటికీ శాసనవ్యవస్ధదే అన్నవిషయం చాలాసార్లు నిరూపణైంది. రాజకీయబాసులుగా ఎవరుంటారో వాళ్ళు చెప్పిందే శాసనంగా మారుతుంది. ఇపుడిదంతా ఎందుకంటే రేవంత్ రెడ్డి(Revanth) కాసుల వేటలో చీఫ్ సెక్రటరీ సుప్రింకోర్టు(Supreme Court) ముందు తలొంచుకోవాల్సొచ్చింది. సీఎస్ పై సుప్రింకోర్టు చేసిన వ్యాఖ్యలు చాలా ఇబ్బందిగా ఉన్నాయన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.

విషయం ఏమిటంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి(HCU) పరిధిలోని 400 ఎకరాల వేలం విషయంలో రేవంత్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు సుప్రింకోర్టు చీఫ్ సెక్రటరీని బాధ్యులను చేసింది. తమఆదేశాలకు భిన్నంగా వెళితే జైలుకు పంపటానికి కూడా వెనకాడేదిలేదన్న సుప్రింకోర్టు హెచ్చరిక కచ్చితంగా సీఎస్ సర్వీసులో బ్లాక్ మార్క్ అనటంలో సందేహంలేదు. చెట్లుతొలగించిన 100 ఎకరాల స్ధలంలోనే తాత్కాలిక జైలు ఏర్పాటుచేసి అందులోనే సీఎస్ ను ఖైదుచేస్తామని సుప్రింకోర్టు జస్టిస్ బీఆర్ గవాయ్ చేసిన హెచ్చరిక అధికారయంత్రాంగంలో సంచలనంగా మారింది.

అసలు హెచ్సీయూ భూములు అనుకుంటున్న 400 ఎకరాలను వేలంద్వారా అమ్మాలన్న నిర్ణయం రేవంత్ ది. 400 ఎకరాల్లోని చెట్లు,పుట్టలను తొలగించి భూమిని చదునుచేయాలన్న నిర్ణయం రేవంత్ దే. యుద్ధానికి వెళుతున్నట్లుగా వందలాది ట్రాక్టర్లు, జేసీబీలను హెచ్సీయూ కాంపౌండ్ లోకి పంపించి యుద్ధప్రాతిపదికన చెట్లను కొట్టాలన్నది కూడా రేవంత్ నిర్ణయమనే అనుకోవాలి. పై నిర్ణయాలన్నీ డైరెక్టుగా రేవంత్ లేదా రేవంత్ పేరుతో సలహాదారులో ఇంకెవరో తీసుకున్నదే. ఆనిర్ణయాలు లేదా ఆదేశాలను పాటించింది మాత్రం అధికారులు. ఆదేశాలను పాటించిన అధికారులు కూడా అత్యుత్సాహంతో వెనకాముందు ఆలోచించకుండా ముఖ్యమంత్రి మెప్పుకోసం యుద్ధప్రాతిపదికన హెచ్సీయూ భూముల్లోకి ట్రాక్టర్లు, జేసీబీలను దింపేశారు. ఇంకేముంది ఆవిషయం విద్యార్ధుల దృష్టిలోపడి అల్లరై చివరకు సుప్రింకోర్టుకుచేరి విచారణలో చీఫ్ సెక్రటరీ దోషిగా నిలబడాల్సొచ్చింది.

నిజానికి నిర్ణయాలు రాజకీయబాసులవే అయినా వాటిని అమలుచేయాల్సింది మాత్రం అధికారులే అని అందరికీ తెలిసిందే. బాసులు తీసుకునే నిర్ణయాల్లోని లోపాలను ఎత్తిచూపాల్సిన ఉన్నతాధికారుల్లో చాలామంది ఆపనిచేయటంలేదు. బాసుల నిర్ణయాలు నియమ, నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా ? లేకపోతే తలెత్తే సమస్యలను తెలియజెప్పాల్సిన బాధ్యత అధికారులదే. అయితే బాసుల ప్రాపకంకోసం, కీలకమైన పోస్టింగుల కోసమని బాసులు ఏమిచెబితే వాటిని మాట్లాడకుండా అమలుచేస్తున్నారు. ఎక్కడైనా సమస్య వచ్చి తగులుకుంటే జవాబులు చెప్పుకోవాల్సింది, కోర్టులో తలొంచుకోవాల్సింది మాత్రం ఉన్నతాధికారులే. తాత్కాలికంగా అంటే ఐదేళ్ళ పరిమితికి మాత్రమే ఎన్నికయ్యే రాజకీయబాసులు చెప్పిన్నటల్లా శాశ్వతంతా ఉండే అధికారయంత్రాంగం వింటే ఎదురయ్యే పర్యవసానాలు ఇలాగే ఉంటాయి.

ఇపుడు హెచ్సీయూ వ్యవహారమే కాదు గతంలో ఫార్మాసిటి(Pharma City) ఏర్పాటులో భూసేకరణ చేయాల్సొచ్చింది. అందుకనే రేవంత్ నియోజకవర్గం కొడంగల్లోని మూడు గ్రామాల్లో సమావేశాలు నిర్వహించారు. లగచర్ల(Lagacharla Village) గ్రామంలో గ్రామసభకు కలెక్టర్ ప్రతీక్ జైన్ హజరయ్యారు. సమావేశం మొదలవ్వగానే గ్రామస్తులు, రైతుల్లో కొందరు సడెన్ గా కలెక్టర్ మీద దాడిచేశారు. కలెక్టర్ మీద దాడి దేశంలో సంచలనమైపోయింది. కలెక్టర్ తో పాటు ఆర్డీవోను కూడా జనాలు తరిమితరిమికొట్టారు. కారులో కూర్చున్న తర్వాత కూడా రాళ్ళు తీసుకుని అద్దాలుపగులగొట్టారు. ఆదాడిలో కలెక్టర్ లేదా ఆర్డీవోకి ఏమన్నా అయ్యుంటే జనాబు ఎవరుచెబుతారు ?

హెచ్సీయూ వివాదమైనా, లగచర్ల వివాదమైనా నిర్ణయం తీసుకున్నది రేవంత్ లేదా రేవంత్ పేరుతో సలహాదారులైతే బాధ్యత వహించాల్సింది లేదా దాడికి గురైంది మాత్రం ఉన్నతాధికారులే. హెచ్సీయూ, లగచర్ల, మూసీ అంశాల్లో ఎలాంటి వివాదాలు లేకుండా చాకచక్యంగా రాజకీయబాసులు మ్యానేజ్ చేసుండచ్చు. కాని తొందరపాటు ఆలోచనలు, నిర్ణయాల కారణంగా గోటితో పోయేవి గొడ్డలిదాకా వెళ్ళింది. విషయం ఏదైనా ఇపుడు సుప్రింకోర్టు విచారణలో దోషిగా నిలబడింది మాత్రం చీఫ్ సెక్రటరీయే. ఈవిషయం రేవంత్ ప్రభుత్వంలో మాత్రమే జరగలేదు ఇదివరకు కేసీఆర్(KCR), జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడు పాలనలోను ఇలాగే జరిగిన విషయం అందరికీ తెలిసిందే.

Read More
Next Story