ఎన్నికలను ‘గ్రేటర్’ బహిష్కరించిందా ?
x
urging people to vote in old city of Hyderabad

ఎన్నికలను ‘గ్రేటర్’ బహిష్కరించిందా ?

పార్లమెంటు ఎన్నికలను గ్రేటర్ హైదరాబాద్ బహిష్కరించిందా ? జనాల మూడ్ చూస్తుంటే, 5 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం చూస్తే ఎవరికైనా ఇదే అనుమానాలు రాకమానవు.



పార్లమెంటు ఎన్నికలను గ్రేటర్ హైదరాబాద్ బహిష్కరించిందా ? జనాల మూడ్ చూస్తుంటే, 5 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం చూస్తే ఎవరికైనా ఇదే అనుమానాలు రాకమానవు. 2019 ఎన్నికల్లోనే పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదైందని కేంద్ర ఎన్నికల కమీషన్ నెత్తి నోరు మొత్తుకున్నది. అప్పుడు చాలా తక్కువగా పోలింగ్ నమోదైంది కాబట్టి తాజా ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చాలా కార్యక్రమాలనే చేపట్టింది. కమీషన్ ఎన్ని కార్యక్రమాలను చేపట్టినా గ్రేటర్ జనాలైతే చెవికెక్కించుకున్నట్లు లేదు. 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం సగటు 61.16 శాతంగా నమోదైంది. అయితే ఇందులో గ్రేటర్ పరిధిలోని మూడు పార్లమెంటు నియోజకవర్గాలైన హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి ఓటింగ్ శాతం చాలా అన్యాయంగా ఉంది.

ఎన్నికల కమీషన్, స్వచ్చంధ సంస్ధల కృషివల్ల తాజాగా ముగిసిన పార్లమెంటు ఎన్నికల ఓటింగ్ శాతం పెరుగుతుందని అనుకుంటే మరింత అన్యాయంగా తగ్గిపోయింది. 2019 ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటులో నమోదైన ఓటింగ్ 46.9 శాతమైతే తాజాగా ముగిసిన ఎన్నికలో నమోదైన ఓటింగ్ 42.48 శాతం మాత్రమే. అంటే సుమారు 4 శాతం ఓటింగ్ తగ్గిపోయింది. ఇక హైదరాబాద్ పార్లమెంటులో 2019లో 44.8 శాతం ఓటింగ్ నమోదైతే ఇప్పటి పోలింగ్ లో 39.37 శాతం మాత్రమే నమోదైంది. ఇక్కడ సుమారు 5 శాతం తగ్గిపోయింది. అలాగే మల్కాజ్ గిరిలో 2019లో 49.63 శాతం ఓటింగ్ నమోదైతే ఇపుడు నమోదైన ఓటింగ్ 46 శాతం. అంటే ఇక్కడ కూడా సుమారు 3 శాతం ఓటింగ్ తగ్గింది.

గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలైన పెద్దపల్లి, వరంగల్, జహీరాబాద్, మెదక్, ఖమ్మం లాంటి మిగిలిన అన్నీ నియోజకవర్గాల్లోను సగటు ఓటింగ్ శాతం 60గా నమోదైంది. బాగా చదువుకున్నవారు. మేథావులు, ఉన్నతస్ధాయి ఉద్యోగులు, ప్రైవేటు, ప్రభుత్వ రంగంలో పనిచేసే లక్షలాదిమంది ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులుండే గ్రేటర్ పరిధిలో మాత్రం మరీ ఇంతపూర్ ఓటింగ్ నమోదవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. నమోదైన ఓటింగ్ వల్ల ఏ పార్టీకి లాభము, ఏ పార్టీకి నష్టమన్న చర్చ అవసరంలేదు. హోలు మొత్తంమీద ఎన్నికలంటేనే గ్రేటర్ జనాలు దూరంగా జరిగిపోతున్నారనే విషయం మాత్రం స్పష్టమైపోతోంది. 6 గంటలవరకు క్యూలైన్లలో ఉండే జనాలను ఓట్లేయించటం అందరికీ తెలిసిందే. ఆ లెక్కన చూసుకున్నా మహాయితే పై మూడు నియోజకవర్గాల్లో మహాయితే మరో 3 లేదా 4 శాతం ఓటింగ్ కన్నా పెరుగుతుందని ఎవరు అనుకోవటంలేదు. జరిగింది చూసిన తర్వాతే గ్రేటర్ జనాలు ఎన్నికలను బహిష్కరించారా అనే అనుమానాలు అందరిలోను పెరిగిపోతోంది.

ఇదే విషయమై ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు ది ఫెడరల్ తెలంగాణాతో మాట్లాడుతు ‘ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గిపోవటానికి ఎన్నికల కమీషన్ దే తప్ప’న్నారు. ‘పోలింగ్ కేంద్రాలను పెంచకపోవటం, పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు తగిన సదుపాయాలు కల్పించటంలో ఎన్నికల కమీషన్ ఫెయిలయ్యింద’న్నారు. ‘1970ల్లో ఎన్ని పోలింగ్ కేంద్రాలున్నాయో ఇప్పుడూ అన్నే పోలింగ్ కేంద్రాలుండటంలో అర్ధమేలేద’ని మండిపోయారు. ‘ఓటర్లకు పోలింగ్ కేంద్రాల్లో కూర్చోవటానికి కూడా సదుపాయాలు కల్పించకుండా గంటలకొద్ది వెయిట్ చేసి ఓట్లేయమంటే ఎవరు వేస్తార’ని పుల్లరావు ప్రశ్నించారు. ‘పోలింగ్ కేంద్రాలకు తోడు సబ్ పోలింగ్ కేంద్రాలను కమీషన్ ఎందుకు ఏర్పాటుచేయటం లేద’ని నిలదీశారు. ‘ఎన్నికల కమీషన్ విఫలమవ్వటం వల్లే పోలింగ్ శాతం తగ్గిపోతోంద’ని పుల్లారావు అభిప్రాయపడ్డారు.

‘గ్రేటర్ పరిధిలో పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గిపోవటానికి ఎన్నికలకు పట్టణ ప్రజల జీవితాలకు సంబంధం తెగిపోవటమే’ అని ప్రొషెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు అభిప్రాయపడ్డారు. పోలింగ్ తగ్గిపోవటానికి ప్రొఫెసర్ మూడు కారణాలను వివరించారు. ‘లోక్ సభ ఎన్నికల్లో అభివృద్ధి, ఉద్యోగవకాశాలు పెంచడం, రోడ్లు, మంచినీటి సమస్యలను పరిష్కరించటంలో తీసుకోవాల్సిన చర్యలకన్నా నిత్యజీవితంలో సంబంధంలేని అనేక సమస్యలు చర్చకు వచ్చాయ’న్నారు. అందువల్లే ఈ ఎన్నికలు తమకు సంబంధంలేనవిగా జనాలు అనుకున్నట్లు ప్రొఫెసర్ చెప్పారు. ‘నగరంలోని ఓటర్లలో సుమారు 30 శాతం మంది ఇతర రాష్ట్రాల వాళ్ళే ఉండటంతో తెలంగాణాకు సంబంధించిన ఎన్నికలపై వీళ్ళల్లో పెద్దగా ఆశక్తిలేద’న్నారు. మూడో కారణంగా ‘అభ్యర్ధుల ఎంపిక, అభ్యర్ధుల తీరు, వారిపై అవినీతి ఆరోపణల వల్లే ఓటర్లలో ఉదాసీనత పెరిగిపోతోంద’న్నారు. ‘పార్టీల ధోరణలు మార్చుకోకపోతే భవిష్యత్తులో జనాలందరు ఎన్నికలను బహిష్కరించే ప్రమాదం కూడా లేకపోలేద’ని ప్రొఫెసర్ ఆందోళన వ్యక్తంచేశారు.

ఆర్ధిక రంగ నిపుణుడు, విశ్లేషకుడు పాపారావు మాట్లాడుతు ‘గ్రేటర్ పరిధిలో నుండి ఏపీ ఎన్నికల్లో ఓట్లేయటానికి చాలామంది వెళ్ళిపోయార’ని అభిప్రాయపడ్డారు. ‘ఏపీలో పోటీచేస్తున్న అభ్యర్ధుల్లో కొందరు గ్రేటర్ లోని ఓటర్లకు వాహనాలను ఏర్పాటుచేసి తమ నియోజకవర్గాలకు పిలిపించుకున్న’ట్లు పాపారావు చెప్పారు. గ్రేటర్ నుండి సుమారు 25 లక్షల మంది ఓటర్లు ఏపీకి వెళ్ళిపోయినట్లు చెప్పారు. ‘రెండు రాష్ట్రాల్లోనూ పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నా ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతుండటమే గ్రేటర్ పరిధిలోని సీమాంధ్ర ఓటర్లను బాగా ఆకర్షించింద’ని అభిప్రాయపడ్డారు. పోలింగ్ శాతం పెరగటానికి ఎన్నికల కమీషన్ తీసుకోవాల్సిన చర్యలు తీసుకోలేదన్నారు. ‘2019 ఎన్నికల్లో తక్కువ పోలింగ్ శాతం నమోదైన పార్లమెంటు నియోజకవర్గాల్లో అనంతనాగ్, శ్రీనగర్, బారాముల్లా తర్వాత హైదరాబాద్ ఉండటం చాలా ఆందోళనకరమ’న్నారు.

Read More
Next Story