బీజేపీలో హైడ్రా చిచ్చుపెట్టిందా ?
x
Telangana BJP

బీజేపీలో హైడ్రా చిచ్చుపెట్టిందా ?

హైడ్రా కూల్చివేతలపై ఎంపీలు, ఎంఎల్ఏలు ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడేస్తున్నారు. దాంతో పార్టీ నేతలు, క్యాడర్ గందరగోళంలో పడిపోయారు.


ఈ విషయం పార్టీలో స్పష్టంగా తెలిసిపోతోంది. హైడ్రా కూల్చివేతలపై ఎంపీలు, ఎంఎల్ఏలు ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడేస్తున్నారు. ఏదైనా అంశంపై బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలంతా ఏకతాటిపైన మాట్లాడాల్సుంటుంది. ప్రభుత్వం చేసే పనులను నూరుశాతం వ్యతిరేకించాల్సిన అవసరంలేదు. ఇదే సమయంలో పూర్తిగా మద్దతివ్వాల్సిన అవసరమూ లేదు. పార్టీ తీసుకునే ఏ లైన్ అయినా ప్రజాసంక్షేమాన్ని, మెజారిటి ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబించేట్లుగా ఉండాలి. కానీ ఇపుడు తెలంగాణా బీజేపీలో ఈ పరిస్ధితులు కనబడటంలేదు. ఎవరి వారే యమునా తీరే అన్నట్లుగా సాగిపోతున్నారు. హైడ్రా కూల్చివేతలపై ఎంపీలు, ఎంఎల్ఏలు ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడేస్తున్నారు. దాంతో పార్టీ నేతలు, క్యాడర్ గందరగోళంలో పడిపోయారు.

చెరువులు, కుంటలు, కాల్వాలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చేయటానికి ప్రభుత్వం హైడ్రా అనే ఏజెన్సీని ఏర్పాటుచేసింది. ఈ హైడ్రా హైదరాబాద్ లోని చెరువులు, శివార్లలోని చెరువుల పరిస్ధితిపై అధ్యయనం చేస్తోంది. ఇప్పటికి చెరువులు, కుంటలను ఆక్రమించి అక్రమంగా చేసిన 20 నిర్మాణాలను కూల్చేసింది. సుమారు 50 ఎకరాల భూమిని అక్రమార్కుల నుండి స్వాధీనం చేసుకుని ఆ భూమిని ప్రభుత్వానికి అప్పగించింది. ఇందులో మెజారిటి నిర్మాణాలు రాజకీయ నేతలు లేదా వాళ్ళ మద్దతుతో జరిగినవే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇదే ఊపులో ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూడా హైడ్రా కూల్చేసింది. దాంతో ఇపుడు హైడ్రాకు హీరో ఇమేజి పెరిగిపోయింది.

హైడ్రా కూల్చివేతలను బీఆర్ఎస్ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. తప్పులేదు ఎందుకంటే అక్రమనిర్మాణాల్లో బహుశా కారుపార్టీ నేతలవి చాలా ఉన్నాయేమో. హైడ్రాకు మద్దతు పలికితే తమ నిర్మాణాలను కూల్చేయటానికి తామే అనుమతిచ్చినట్లవుతుంది. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి ఇమేజీని తామే పెంచినట్లవుతుంది. తాము చెరువులు, కుంటలు, కాల్వలను ఆక్రమించుకున్నట్లు అంగీకరించినట్లవుతుంది. ఈ మూడు కారణాలతో బీఆర్ఎస్ నేతలు పూర్తిగా హైడ్రాను వ్యతిరేకిస్తున్నారు. లాభమో నష్టమో కేటీఆర్, హరీష్ తదితరులు హైడ్రాను వ్యతిరేకిస్తున్నారు. ఇక ఇష్టం ఉన్నా లేకపోయినా, నష్టం జరిగినా సరే హైడ్రాను కాంగ్రెస్ నేతలు సమర్ధించాల్సిందే తప్ప వేరు దారిలేదు. అందుకనే మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలు, సీనియర్ నేతలంతా హైడ్రా బ్రహ్మాండమంటున్నారు.

ఈ నేపధ్యంలోనే బీజేపీలో మాత్రం ఎందుకింత అయోమయమో అర్ధంకావటంలేదు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఏమో హైడ్రాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. జనాల దృష్టిలో హీరో అయిపోదామని రేవంత్ ప్రయత్నిస్తున్నట్లు గోలగోల చేస్తున్నారు. మెదక్ ఎంపీ రఘునందనరావు, చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాత్రం హైడ్రా చర్యలకు పూర్తి మద్దతిస్తున్నారు. చెరువులు, కుంటలు, కాల్వలను ఆక్రమించి చేసిన నిర్మాణాలను తొలగించాల్సిందే అంటున్నారు. హైడ్రా చర్యలకు పూర్తి మద్దతు పలుకుతున్నారు. గోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్, హైదరాబాద్ ఎంపీగా ఓడిపోయిన మాధవీలత హైడ్రాను పూర్తిగా సపోర్టు చేస్తున్నారు. కాకపోతే ఎంఐఎం ప్రజాప్రతినిధులు, నేతల ఆక్రమణలను కూడా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి, కామారెడ్డి ఎంఎల్ఏ కాటిపల్లి వెంకటరామిరెడ్డి మాత్రం బడా బాబుల ఆక్రమణలను కూల్చేసి మామూలు జనాలను వదిలేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ఎంపీలు, ఎంఎల్ఏల ప్రకటనలు, డిమాండ్లు చూస్తుంటే హైడ్రా విషయంలో పార్టీ తరపున ఒక లైన్ తీసుకోలేదని అర్ధమవుతోంది. అసలు పార్టీ ప్రజాప్రతినిదులంతా కూర్చుని హైడ్రా వల్ల లాభనష్టాల గురించి చర్చించుకున్నట్లే లేదు. ఒకే అంశంపై ఎంపీలు, ఎంఎల్ఏలు ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లేస్తున్నారు. దీంతోనే బీజేపీలో హైడ్రా చిచ్చు ఎంతస్ధాయిలో ఉందో అర్ధమైపోతోంది. రైతు రుణమాఫీ విషయంలో కూడా బీజేపీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు ఒకళ్ళతో మరొకళ్ళకు సంబంధలేకుండా ఏదేదో మాట్లాడేసిన విషయం తెలిసిందే. ఒకవైపు హైడ్రా యాక్షన్ను జనాలు ఫుల్లుగా స్వాగతిస్తుంటే బీజేపీ నేతలకు ఏమి మాట్లాడాలో దిక్కుతోచటంలేదు.

Read More
Next Story