టీజీపీఎస్సీ తెలుగు మీడియం విద్యార్థులను తక్కువ చేసి చూస్తోందా?
x

టీజీపీఎస్సీ తెలుగు మీడియం విద్యార్థులను తక్కువ చేసి చూస్తోందా?

గ్రూప్ -1 మెయిన్స్ లో ఇంగ్లీష్ మీడియం వారికే ప్రాధాన్యం ఇచ్చారని అభ్యర్థుల ఆగ్రహం, టీజీపీఎస్పీ అర్హత లేనివారితో కరెక్షన్ చేయించారని విమర్శలు


టీజీపీఎస్సీ సోమవారం గ్రూప్ -1 మెయిన్స్ మార్కులను ప్రకటించింది. అయితే జనరల్ ర్యాంకుల కోసం మరో 20 రోజులు పట్టవచ్చని కమిషన్ తెలియజేసింది. అధికారికంగా కమిషన్ మార్కులు ప్రకటించకపోయిన కొంతమంది అభ్యర్థులు వివిధ మార్గాల్లో వెలువరించిన సమాచారం ప్రకారం.. చాలామందికి 400 నుంచి 500 మధ్య మార్కులు వచ్చాయి.

అయితే నలుగురు విద్యార్థులకు మాత్రం 500 కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. హనుమకొండ జిల్లా శాయంపేట మండలానికి చెందిన జిన్నా తేజస్విని రెడ్డి కి అత్యధికంగా 532 మార్కులు సాధించారని తెలిసింది.

అయితే కమిషన్ ఎవరి వివరాలను మాత్రం ధృవీకరించలేదు. రీ కౌంటింగ్ పూర్తయిన తరువాత మరోసారి మార్కులు ప్రకటిస్తామని తరువాతే జనరల్ ర్యాంకులు వెల్లడిస్తామని, ఆ తరువాతే 1:2 నిష్ఫత్తిలో సర్టిఫికెట్లు పరిశీలన చేస్తామని కమిషన్ చైర్మన్ చెప్పారు.

మాకు అన్యాయం జరిగింది: తెలుగు మీడియం విద్యార్థులు..
తెలంగాణ వచ్చిన తరువాత తొలిసారి వెలువడిన గ్రూప్ -1 ఫలితాల్లో తమకు అన్యాయం జరిగిందని తెలుగు మీడియం అభ్యర్థులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
పది సంవత్సరాలు కష్టపడి చదివి పరీక్ష రాశామని, ఫలితాలు త్వరగా ఇవ్వాలనే ఆతృతతో తమకు అన్యాయం చేశారని కొందరు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అర్హత లేని వాళ్లతో పేపర్లు కరెక్షన్ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ అంశానికి సంబంధించిన ఓ అభ్యర్థి ‘ ది ఫెడరల్’ తో మాట్లాడారు. అయితే తన పేరు బయటకు చెప్పవద్దని షరతు విధించారు. తనకు 432. 5 మార్కులు వచ్చాయని కేవలం తెలుగు మీడియంలో రాసినందువలనే తక్కువ మార్కులు ఇచ్చారని ఆరోపించారు. ‘‘ పేపర్ 6, తెలంగాణ ఉద్యమం.. పేపర్ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్. నేను మంచి కొటేషన్ లతో అద్భుతంగా రాశాను. కనీసం 90 మార్కులు వస్తాయని ఆశించాను.
కానీ ఆశ్చర్యకరంగా 69 మార్కులు మాత్రమే వచ్చాయి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కూడా చాలా తక్కువ మార్కులు వచ్చాయి. అన్నీ ఇంగ్లీష్ పదాలు ఉండటం వాటికి సరైన తెలుగు పదాలు లేకపోవడం కూడా మార్కులపై ప్రభావం చూపాయి.’’ అన్నారు.
తనకు దాదాపుగా 50 నుంచి 70 మార్కుల వరకూ తగ్గాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము వ్యక్తిగతంగా అప్పట్లో టీజీపీఎస్సీకి ప్రజెంటేషన్ కూడా ఇచ్చామని, తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం చేయవద్దని కోరామన్నారు. అయినా మార్కుల్లో ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు, తెలుగు మీడియం విద్యార్థులకు స్ఫష్టమైన విభజన కనిపిస్తుందని అన్నారు.
తెలుగు మీడియం విద్యార్థులకు ఇంగ్లీష్ అర్హత పేపర్ పెడుతున్నారని, కానీ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ఎలాంటి అర్హత పేపర్ పరీక్ష లేదన్నారు. వారికి కూడా తెలుగు పేపర్ ఉండాలని కొంతమంది విద్యార్థులు అభిప్రాయం వెలిబుచ్చారు. ఇప్పుడు కూడా యూపీఎస్సీ వారితో తెలుగు, ఇంగ్లీష్ మీడియం పేపర్లు వాల్యూయేషన్ చేయించాలని అప్పుడూ నిజాలు బయటకు వస్తాయని డిమాండ్ చేస్తున్నారు.
ఓ ఇనిస్టిట్యూట్ లో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న జ్యోతి అనే ఉద్యోగిని ‘ఫెడరల్’ తో మాట్లాడారు. ‘‘మాకు నిన్న రాత్రి నుంచి చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అందులో చాలా మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు.
అందరిది ఒకటే బాధ. మేము అనుకున్న దానికంటే చాలా తక్కువ మార్కులు వచ్చాయి. స్కోరింగ్ పేపర్ లో ఎందుకు తక్కువ మార్కులు వచ్చాయో అర్థకావడం లేదని ఏడుస్తున్నారు. రీ వాల్యూయేషన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీరంతా తెలుగు మీడియంలోనే పరీక్ష రాశారు’’ అని చెప్పారు.
ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఆరో పేపర్ లో కనీసం 100 నుంచి 120 వరకూ వస్తాయనుకున్న వారికి కూడా 60- 70 లోపే వచ్చాయని ఎవరికి కనీసం 100 మార్కులు రాలేదని చెప్పారు.
గ్రూప్-1 పరీక్షరాసిన అభ్యర్థులతో మాట్లాడటానికి ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రయత్నించిన చాలామంది అభ్యర్థులు మాట్లాడటానికి నిరాకరించారు. కొంతమంది అసలు ఫోన్ లిప్ట్ చేయలేదు. ఒకరిద్దరు ప్రత్యక్షంగా కలిసిన వారంతా మూడ్ ఆఫ్ అయినట్లు కనిపించారు. ఒక్కో పేపర్ రీ కౌంటింగ్ కు రూ. 1000 పెట్టడంపై కూడా కొంతమంది అభ్యర్థులు పెదవి విరిచారు.
సోషల్ మీడియాలో పోస్టులు
గ్రూప్-1 పరీక్ష మెయిన్స్ వాల్యూయేషన్ లో తమకు అన్యాయం జరిగిందని సామాజిక మాధ్యమాల్లో కొంతమంది పోస్టులు పెట్టారు. సోషల్ మీడియాలోని ఓ పోస్ట్ ఈ విధంగా ఉంది.
‘‘తెలంగాణ గ్రూప్ - 1 ఎగ్జామ్స్ లో తెలుగు మీడియం వాళ్ళకు కనీసం మార్క్స్ వేయలేదు , అదే సమయం లో పాయింట్స్ వైస్ గా ఫ్యాక్ట్స్ రాసిన వారికి మార్క్స్ వేసి అనలిటికల్ గా రాసిన వాళ్ళకు మినిమం మార్క్స్ కూడా వేయలేదు.
అనలిటికల్ గా రాసిన సమాధానాలను అర్థం చేసుకొలేని డిస్ క్వాలిఫైడ్ వాళ్లతో పేపర్ కరెక్షన్స్ చేయించిన టీజీపీఎస్సీ దద్దమ్మలను ఏ విధంగా శిక్షించిన తప్పు లేదు. తొందరగా రిజల్ట్స్ పెట్టాలి అని ఆబ్జెక్టివ్ టైపులో ఎగ్జామ్స్ రాసి జాబ్స్ కొట్టిన వారితో వ్యాస రూపంలో రాసిన పేపర్స్ ను దిద్దించిన టీజీపీఎస్సీ దద్దమ్మలయిన అధికారులకు ఏం శిక్ష వేసిన సరిపోదు.
13సంవత్సరాల నుంచి గ్రూప్ -1 నోటిఫికేషన్ కోసం వేచిచూసిన జీవితాలను మీ ఈగో, స్వార్ద ప్రయోజనలకోసం , తొందరగా రిజల్ట్స్ ఇచ్చాము అని చెప్పుకోవడానికి నాశనం చేశారు కదర ! టీజీపీఎస్సీ అధికారుల్లారా మీకు దమ్ము ఉంటే ఇంగ్లీష్ మీడియంలో రాసిన పేపర్స్ లో టాప్ 1000 పేపర్స్, తెలుగు మీడియంలో రాసిన పేపర్స్ లో టాప్ 1000 పేపర్స్ ను తీసి ప్రొఫెసర్ లతో దిద్దియించండ్రా , ఒకవేళ తెలుగు మీడియం వారికీ ఎక్కువ మార్కులు రాక పోతే మీరు వేసే ఏ శిక్షకయిన మేము సిద్దం.
13 సంవత్సరాల నుంచి గ్రూప్ - 1 నోటిఫికేషన్ కోసం వేచిచూసిన జీవితాలను నాశనం చేయకండిరా .. హైల్ లీ క్వాలిఫైడ్ అధికారులను తెలంగాణ కు అందించండి రా .. మీరు తెలంగాణ పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం ఎప్పుడు అపుతారు రా ?? మీ యొక్క అహం వదిలి పని చేయండి రా ..’’ అని సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్ బాగా వైరల్ అవుతుంది.
అనేక గండాలు దాటి.. ఫలితాల వరకూ..
తెలంగాణ వచ్చిన దాదాపు పది సంవత్సరాల తరువాత 500 లకు పైగా పోస్టులతో అప్పట్లో భారాస ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ తరువాత పేపర్ లీక్ అయినట్లు నిర్థారణ అయింది. కమిషన్ లో పనిచేసే ఉద్యోగులే పేపర్ లీక్ పాల్పడినట్లు తేలడంతో రాష్ట్రంలో కలకలం రేగింది.
అనేక పరీక్షలకు సంబంధించిన పేపర్లను ముందే అమ్ముకున్నట్లు వెల్లడి కావడంతో ప్రభుత్వం సీరియస్ అయింది. తప్పులను సరిదిద్దుకోవడానికి మరోసారి ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహిస్తామని ప్రకటించి, నిర్వహించింది. అయితే నిబంధనలు పాటించలేదనే కారణంతో హైకోర్టు పరీక్షను మరోసారి రద్దు చేసింది.
తరువాత ప్రభుత్వం మారడంతో టీజీపీఎస్సీని సంస్కరించిన కాంగ్రెస్ ప్రభుత్వం అదనంగా మరో 60 పోస్టులు జతచేస్తూ 563 పోస్టులతో గత ఏడాది ఫిబ్రవరిలో కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. తరువాత మెయిన్స్ నిర్వహించింది. ఇలా ఏడాది తిరిగిందో లేదో ఫలితాలు ప్రకటించింది. కానీ ఇప్పుడు ఇదే వివాదంగా మారే అవకాశం కనిపిస్తుంది.
Read More
Next Story