మావోయిస్టుపార్టీ క్షీణదశకు చేరుకుందా ?
x
Maoist top leader Mallojula surrendered with his team

మావోయిస్టుపార్టీ క్షీణదశకు చేరుకుందా ?

మావోయిస్టులకు కేంద్రప్రభుత్వం ఇచ్చిన ఛాయిస్ ఒకటే. లొంగిపోవటమో లేకపోతే ఎన్ కౌంటర్లో(Maoist Encounters) చనిపోవటమో


మావోయిస్టు రహిత భారత్ డెడ్ లైన్ 2026, మార్చి 31. మావోయిస్టు రహిత భారత్ సాధనకోసం కేంద్రప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ అనే మిషన్ మొదలుపెట్టింది. ఈ మిషన్ దెబ్బకు మావోయిస్టుల్లో అలజడి పెరిగిపోతోంది. ఎందుకంటే ఇప్పటికే ఆపరేషన్ కగార్(Operation Kagar) దెబ్బకు మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరరావు, కొందరు కేంద్రకమిటి సభ్యులతో పాటు వివిధ స్ధాయిల్లోని మావోయిస్టు(Maoists)లు కొన్నివందలమంది వివిధ ఎన్ కౌంటర్లలో చనిపోయారు. అలాగే మరికొన్నివందల మంది పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టులకు కేంద్రప్రభుత్వం ఇచ్చిన ఛాయిస్ ఒకటే. లొంగిపోవటమో లేకపోతే ఎన్ కౌంటర్లో(Maoist Encounters) చనిపోవటమో. ఆపరేషన్ కగార్ దెబ్బ మావోయిస్టు సుదీర్ఘచరిత్రలో ఎప్పుడూ లేనంత అలజడి లేపుతోందనే చెప్పాలి.

అందుకనే బుధవారం మహారాష్ట్రలో కేంద్రకమిటి సభ్యుడు, మావోయిస్టుపార్టీలో అత్యంత కీలకమైన మల్లోజుల వేణుగోపాల్ @ అభయ్ తన మద్దతుదారులతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయాడు. అభయ్ తో పాటు వివిధ స్ధాయిల్లో పనిచేస్తున్న 60 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయారు. అలాగే ఛత్తీస్ ఘడ్ లోని సుక్మా, కాంకేర్, కొండగావ్ లో మరో 78 మంది పోలీసుల ముందు లొంగిపోయారు. ఇక్కడే మావోయిస్టుపార్టీకి రెండురకాలుగా నష్టం జరిగింది. ఎలాగంటే మొదటిది మల్లోజుల లాంటి దశాబ్దాల అనుబంధం ఉన్న కీలకనేత తో పాటు మరో 138 మంది మావోయిస్టులు లొంగిపోవటం. రెండో నష్టం ఏమిటంటే వీరు ఆయుధాలతో సహా లొంగిపోవటం. లొంగుబాటు సమయంలో వీళ్ళు పోలీసులకు 54 ఆయుధాలను అప్పగించారు. వీటిల్లో ఏడు ఏకే-47 తుపాకులు, ఇన్సాస్ రైఫిళ్ళున్నాయి.

మల్లోజుల తొందరలోనే లొంగిపోతారనే ప్రచారం కొద్దిరోజులుగా జరగుతోంది. అయితే ఇంతమంది మద్దతుదారులతో లొంగిపోతాడని, అదికూడా అత్యాధునిక ఆయుధాలతో సహా లొంగిపోతాడని ఎవరూ ఊహించలేదు. మల్లోజుల ఆయుధాలతో లొంగిపోతాడేమో అన్న అనుమానంతోనే పార్టీ ఆయుధాలను పార్టీకి సరెండర్ చేసి లొంగిపోవచ్చని చెప్పింది. ఆయుధాలు సరెండర్ చేయకపోతే తీవ్రపరిణామాలుంటాయని కూడా పార్టీ వార్నింగ్ ఇచ్చింది. అయినా పార్టీ వార్నింగును లెక్కచేయకుండా మద్దతుదారులతో కలిసి మల్లోజుల లొంగిపోవటం ఆశ్చర్యంగానే ఉంది. మల్లోజుల తలపైన రు. 6 కోట్ల రివార్డుందంటేనే ఈయన ఎంతటి కీలకమో అర్ధమవుతోంది.

దెబ్బమీద దెబ్బ అన్నట్లుగా మాల్లోజుల లొంగుబాటే మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బంటే అదేబాటలో ఆశన్న కూడా లొంగిపోవటానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఆశన్న అలియాస్ తక్కెళ్ళపల్లి వాసుదేవరావుకు కూడా దశాబ్దాలుగా మావోయిస్టుపార్టీతో అనుబంధముంది. ఛత్తీస్ గఢ్ పోలీసుల ముందు 150 మంది మద్దతుదారులతో లొంగిపోయినట్లు ప్రచారంలో ఉంది. ఈ విషయం ఇంకా అధికారికంగా పోలీసులు ప్రకటించలేదు. ములుగు జిల్లా పోలోనిపల్లికి చెందిన ఆశన్న 1991లో పీపుల్స్ వార్ గ్రూప్ లో చేరారు. అంచలంచెలుగా ఎదిగి పార్టీలో కీలకనేతగా మారారు. హైదరాబాదులో ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర హత్య, 2000లో మాజీ హోంశాఖ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి హత్యతో పాటు 2003లో అలిపిరి దగ్గర చంద్రబాబునాయుడు కాన్వాయ్ ను క్లెమోర్ మైన్స్ తో పేల్చటంలో ఆశన్నదే కీలకపాత్ర. పై మూడు ఘటనలతోనే మావోయిస్టుపార్టీలో ఆశన్న ఎంతటి కీలకనేతో అర్ధమవుతోంది.

మావోయిస్టుపార్టీలో మిగిలింది ఎవరు ?

వరుస లొంగుబాట్లు, ఎన్ కౌంటర్ల తర్వాత మావోయిస్టుపార్టీలో మిగిలిన కీలకనేతలు ఎవరు ? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. తెలంగాణ పార్టీ కార్యదర్శి దామోదర్, చంద్రన్న, ఆజాద్ ఉన్నారు. ఛత్తీస్ గఢ్ లో హిడ్మా, బాలు, పాపారావు, తిప్పిరి తిరుపతి, మల్లారెడ్డి రాజిరెడ్డి, సంగ్రాం, ఘణపతి, విశ్వనాధ్, ఘనేష్, విశేష్ బెహరా ఉన్నారు. మావోయిస్టుపార్టీ దేశంలో ఇంతగా బలపడటంలో కీలక పాత్ర తెలంగాణ నేతలదే. తెలంగాణలోని మారుమూల గ్రామాలకు చెందిన అనేకమంది పీడబ్వ్యుజీలో చేరి మావోయిస్టుపార్టీలో కీలకనేతలుగా ఎదిగారు. వీరి ప్రాబల్యం, మాటలకు ఆకర్షితులయ్యే తెలంగాణ వ్యాప్తంగా చాలామంది పార్టీలో చేరారు.

పార్టీలో కీలకనేతలుగా చెప్పుకునేవారు మహాయితే ఏడుగురు మాత్రమే మిగిలుంటారని పోలీసులు చెబుతున్నారు. కేంద్రకమిటిలోని 17మందిలో ఆరుమంది ఎన్ కౌంటర్లలో చనిపోగా మరో ముగ్గురు పోలీసుల ముందు లొంగిపోయారు. ఏవోబీ ఎన్ కౌంటర్లలో కేంద్రకమిటి సభ్యులు చలపతి, గాజర్ల గణేష్, మోడెం బాలకృష్ణ చనిపోయారు. ఇంద్రావతి నేషనల్ పార్క్ అడవుల్లో కేంద్రకమిటి సభ్యులు సుధాకర్, మైలారపు ఆదేలు చనిపోయారు. దండకారణ్యంలో ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు, రామచంద్రారెడ్డి, కడారి రామకృష్ణారెడ్డి మరణించారు. వీరితో పాటు పై ఏరియాల్లో చాలామంది మావోయిస్టులు ఎన్ కౌంటరైపోయారు. మొత్తంమీద బ్రతుకుమీద తీపి ఉన్నావారేమో పోలీసుల ముందు లొంగిపోతుంటే, ప్రాణాలు పోయిన పర్వాలేదని అనుకున్న వారు ఎన్ కౌంటర్లలో చనిపోయారు.

ఆపరేషన్ కగార్ సక్సస్సేనా ?

ఆపరేషన్ కగార్ దాదాపు సక్సెస్ అనేచెప్పాలి. మావోయిస్టు రహిత ఇండియాకు కేంద్రప్రభుత్వం మార్చి 31, 2026 డెడ్ లైన్ పెట్టుకుంది. దానిప్రకారమే ప్రణాళికలు వేసుకుంటు ముందుకు వెళుతోంది. మావోయిస్టులకు దశాబ్దాలుగా పెట్టనికోటలాగ ఉన్న దండకారణ్య ప్రాంతాన్ని భద్రతాదళాలు చేజిక్కించుకున్నాయి. అలాగే ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో పాగావేశాయి. ఆంధ్రా-ఒడిస్సా బార్డర్(ఏవోబీ) అడవుల్లో భద్రతాదళాలు అణువణువు గాలిస్తున్నాయి. ఒకపుడు పైన చెప్పిన అడవుల్లోకి పోలీసులు అడుగుకూడా పెట్టలేకపోయేవారు. అలాంటిది ఇపుడు పై అటవీప్రాంతాల్లో మవోయిస్టుల ప్రాణాలకే రక్షణలేకుండా పోయింది. అంటే మావోయిస్టుల షెల్టర్ జోన్లలో చాలావాటిని భద్రతాదళాలు చేజిక్కించుకున్నాయి. కాబట్టి ఆపరేషన్ కగార్ దాదాపు సక్సెస్ అయినట్లే అనుకోవాలి. పోయిన వారు పోగా, మరికొందరు లొంగిపోతున్న నేపధ్యంలో మిగిలిన కొద్దిమంది కీలకనేతలు భవిష్యత్తు ఏమవుతుందో చూడాలి.

మావోయిస్టుపార్టీ క్షీణదశలో ఉంది : జంపన్న

మావోయిస్టుల లొంగుబాట్లను లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత జినుగు నరసింహారెడ్డి @ జంపన్న వెలకమ్ చేశారు. తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు జరుగుతున్న లొంగుబాట్లు చర్చల ద్వారా గౌరప్రదంగా జరిగితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. 2017, డిసెంబర్లోనే జంపన్న లొంగిపోయారు. అప్పటినుండి ప్రజాజీవితంలోనే గడుపుతున్నారు. తాజా లొంగుబాట్లపై మాట్లాడుతు ‘‘ఆపరేషన్ కగార్ తో మావోయిస్టులు బలహీనపడలేద’’ని చెప్పారు. ‘‘అనేక కారణాలతో మావోయిస్టుపార్టీ చాలాకాలం క్రితమే బలహీనపడిపోయంద’’న్నారు.

‘‘మావోయిస్టుపార్టీ క్షీణించటం చాలాకాలం క్రితమే మొదలైంద’’న్నారు. ‘‘బీజేపీ లేదా కేంద్రప్రభుత్వం చేస్తున్న ఆపరేషన్ కగార్ కారణంగా మావోయిస్టులు క్షీణదశకు చేరుకోలేద’’ని స్పష్టంచేశారు. ‘‘నక్సల్బరీ మొదలైనపుడు ఉన్న భూస్వామ్య వ్యవస్ధ ఇపుడు లేద’’ని గుర్తుచేశారు. ‘‘సమాజంలో మార్పులు వచ్చినట్లే మావోయిస్టుపార్టీలో కూడా 2000 సంవత్సరంలోనే క్షీణించటం మొదలైంద’’ని చెప్పారు. ‘‘దండకారణ్యంలో ఎంతోబలంగా ఉండే మావోయిస్టు పార్టీ ఇపుడు బలహీనపడింద’’ని చెప్పారు. ‘‘ఛత్తీస్ గఢ్ ప్రాంతంలో సల్వాజుడుం కారణంగా జనతన సర్కార్ బలపడినా 2005 నుండి ఈప్రాంతంలో కూడా బలహీనపడి’’నట్లు చెప్పారు. ‘‘దేశపరిణామాలను అర్ధంచేసుకోకపోవటంతో మావోయిస్టుపార్టీ బలహీనమైంద’’న్నారు. ‘‘ప్రజలమద్దతు లేకుండా, ప్రజాఉద్యమాలు లేకుండా మావోయిస్టుపార్టీ లేద’’ని అభిప్రాయపడ్డారు. ప్రజలకు దూరమైంది కాబట్టే మావోయిస్టుపార్టీ బలహీనపడిపోయి’’నట్లు చెప్పారు. ‘‘ఆయుధాలు పట్టుకున్నంత మాత్రాన మావోయిస్టులు బలంగా ఉన్నట్లు కాద’’న్నారు. క్షీణదశలో ఉన్న మావోయిస్టుపార్టీ మీద ఆపరేషన్ కగార్ ప్రభావం ఎక్కువగా కనబడుతోంద’’ని చెప్పారు.

‘‘అభయ్ లొంగుబాటు మావోయిస్టుపార్టీలో ప్రకంపనలు సృష్టించి’’నట్లు చెప్పారు. మావోయిస్టుపార్టీలో ఝార్ఖండ్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్రలో ఇంకా కీలకమైన నేతలున్నారని చెప్పారు. ఆశన్న కూడా పోలీసుల ముందు లొంగిపోయినట్లు జంపన్న చెప్పారు. ‘‘మావోయిస్టుల ఎన్ కౌంటర్లు, లొంగుబాట్లను బీజేపీ అడ్వాంటేజ్ తీసుకుంటోంద’’ని అభిప్రాయపడ్డారు.

మావోయిస్టులు మరో షెల్టర్ చూసుకుంటారు: ఆలూరు

ఆపరేషన్ 206, మార్చి 31కి మావోయిస్టు రహిత భారత్ కు కేంద్రం కట్టుబడుందని డాక్టర్ ఆలూరు చంద్రశేఖర్ తెలిపారు. మావోయిస్టుల ప్రస్తుత పరిస్ధితులపై తెలుగురాష్ట్రాల మానవహక్కుల కమిటి సభ్యుడు తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘మావోయిస్టు రహిత భారత్ అనే ప్రకటనతో పాటు భద్రతాదళాల ఆపరేషన్లు మావోయిస్టులను తీవ్రంగా ప్రభావితం చేసుంటుంద’’ని అభిప్రాయపడ్డారు. ‘‘గ్రౌండ్ రియాలిటి చూస్తే కేంద్రకమిటి సభ్యులు+70 మంది మావోయిస్టులతో పాటు ఆయుధాలతో లొంగిపోతున్న’’ట్లు తెలిపారు. ‘‘లొంగిపోయిన మావోయిస్టులకు కేంద్రప్రభుత్వం వెంటనే రివార్డులు కూడా ఇచ్చేస్తుండటంతో మిగిలిన మావోయిస్టుల్లో లొంగుబాటు ఆలోచనలు పెరుగుతున్న’’ట్లు అనుమానం వ్యక్తంచేశారు.

ఇదేసమయంలో మావోయిస్టుల్లోనే లొంగుబాట్లను వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా ఉన్నార’’ని గుర్తుచేశారు. ‘‘సాయుధపోరాటాన్ని కొనసాగించాలనే వాదన కొంతమంది మావోయిస్టుల్లో బలంగా వినబడుతోంది’’ అన్నారు. ‘‘తెలంగాణలో కీలకనేత జగన్ పోరాటాలు చేయాలనే అంటున్నాడు’’ అన్నారు. 30శాతం సీసీ సభ్యులు లొంగిపోవటమో లేకపోతే మరణించటమో అయిపోయింది. ఇంకా 70శాతం ఉన్నారు. ‘‘ప్రస్తుత పరిస్ధితుల్లో టాప్ లీడర్లు మరికొందరు కూడా వచ్చేస్తారా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయ’’ని ఏలూరి తెలిపారు. ‘‘రిట్రీట్ లో భాగంగా మావోయిస్టులు ఛత్తీస్ ఘడ్ నుండి దూరంగా వెళ్ళిపోయి తలదాచుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంద’’ని చెప్పారు. కాబట్టి ఆపరేషన్ కగార్ టార్గెట్ రీచవ్వటం అంత సులభంకాదన్నారు.

ఆత్మరక్షణలో మావోయిస్టులు బిజీగా ఉన్నారు. ‘‘ఆపరేషన్ కగార్ ను ఇతర ప్రాంతాలకు విస్తరించటం అంత తొందరగా జరిగే అవకాశాలులేవ’’ని అభిప్రాయపడ్డారు. ‘‘ఆపరేషన్ కగార్ పేరుతో 3 లక్షల మంది సాయుధబలగాలను కేంద్రం అడవుల్లో మోహరించినట్లు’’ చెప్పారు. ‘‘దండకారణ్యంలో సక్సెస్ అయినట్లు ఇతర ప్రాంతాల్లో ఆపరేషన్ కగార్ సాధ్యం అవుతుందా’’ అనుమానాన్ని వ్యక్తంచేశారు. ‘‘ఛత్తీస్ ఘడ్, ఝార్ఖండ్ లో ఆపరేషన్ కగార్ సక్సెస్ అయినట్లు ఇతర ప్రాంతాల్లో సక్సెస్ కాద’’న్నారు. ‘‘ఆపరేషన్ కగార్ తో ఆదీవాసీల జీవితాల్లో రాజకీయ, ఆర్ధిక సంస్కరణలు తీసుకొచ్చినపుడే కగార్ సక్సెస్ అయినట్లు’’గా ఆలూరి అభిప్రాయపడ్డారు. ఆదివాసీల స్ధితి, గతులను మెరుగుపరచకుండా ఎన్ని ఆపరేషన్ కగార్లు నిర్వహించినా ఉపయోగం ఉండదని ఆలూరి చంద్రశేఖర్ తెలిపారు.

Read More
Next Story