రికార్డు సృష్టించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్
x
TPCC president Mahesh Kumar Goud

రికార్డు సృష్టించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్

గాంధీభవన్ కు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీతక్క, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు హాజరయ్యారు.


తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సక్సెస్ అయినట్లేనా ? పార్టీవర్గాల ప్రకారం సక్సెస్ అయినట్లే. ఏ విషయంలో మహేష్ సక్సెస్ అయ్యారంటే మంత్రులను పార్టీ ఆఫీసు గాంధీభవన్ కు రప్పించటంలో. గడచిన నెలరోజుల్లో గాంధీభవన్ కు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీతక్క, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు హాజరయ్యారు. గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళెవరూ ఇపుడు మంత్రులు వస్తున్నట్లుగా గాంధీభవన్ కు వచ్చిన దాఖలాలు లేవు. వాళ్ళిష్ట ప్రకారం వస్తే వచ్చినట్లు లేకపోతే లేదంతే. అలాంటిది మంత్రులకు టైంటేబుల్ ఇచ్చి గాంధీభవన్ కు రప్పించిన ఒకే ఒక్కడుగా మహేష్ రికార్డు సృష్టించారు.

కానీ ఇపుడు మాత్రం మంత్రులు పార్టీ ఆఫీసుకు ఎందుకని క్రమంతప్పకుండా టైంటేబుల్ ప్రకారం వస్తున్నట్లు ? ఎందుకంటే మహేష్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రేవంత్ తో భేటీ అయ్యారు. మంత్రులందరినీ పార్టీ ఆపీసుకు రప్పించాల్సిన అవసరాన్ని వివరించారు. మంత్రులు పార్టీ ఆఫీసుకు వచ్చి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తే పార్టీనేతలు, క్యాడర్ కు ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెప్పారు. తమ నియోజకవర్గాల్లో సమస్యలను మంత్రులకు వివరించి చెప్పటానికి సచివాలయంకు రావటంలో నేతలు, క్యాడర్ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. మామూలుగా ప్రజావాణి కార్యక్రమం అంటే సామాన్య జనాల సమస్యల పరిష్కారంకోసం ఉద్దేశించిందన్న విషయం తెలిసిందే. కాబట్టి రెగ్యులర్ గా జరిగే ప్రజావాణి కార్యక్రమంలో అర్జీలు ఇవ్వటానికి మామూలు జనాలు భారీఎత్తున క్యూ కడుతున్నారు.

అంతమంది మామూలు జనాలతో కలిసి పార్టీ నేతలు, క్యాడర్ మంత్రులను కలవటానికి పడుతున్నఇబ్బందులను తెలియజేశారు. కాబట్టి ప్రత్యేకంగా మంత్రులు గాంధీభవన్ కు వస్తే పార్టీ నేతలు, క్యాడర్ తమ నియోజకవర్గాల్లోని సమస్యలను వివరించేందుకు, పరిష్కారమయ్యేందుకు అవకాశం ఉంటుందని రేవంత్ కు మహేష్ వివరించి చెప్పారు. మహేష్ ప్రతిపాదనకు రేవంత్ కూడా సానుకూలంగా స్పందించి మంత్రివర్గ సమావేశంలోనే గాంధీభవన్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని మంత్రులందరినీ ఆదేశించారు. ప్రతీమంత్రి కచ్చితంగా గాంధీభవన్ లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాల్సిందే అని గట్టిగా ఆదేశించారు. రేవంత్ ఆదేశాల ఫలితమే ప్రతివారం బుధవారం, శుక్రవారం ఇద్దరుమంత్రులు ప్రజావాణి కార్యక్రమంకు హాజరవుతున్నారు.

గాంధీభవన్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో అందుతున్న అర్జీలను మంత్రులు పరిష్కారం కోసం ఆయాశాఖల ఉన్నతాధికారులకు పంపుతున్నారు. గాంధీభవన్ నుండి మంత్రుల సిఫారసులతో వచ్చిన అర్జీలు కాబట్టి ఉన్నతాధికారులు కూడా కాస్త ప్రాధాన్యత ఇచ్చి చూస్తున్నారు. మంత్రులు గాంధీభవన్ కు వచ్చినట్లే రేవంత్ ను కూడా ప్రతినెలా కనీసం ఒకసారి రావాలని మహేష్ కోరారు. అందుకు కూడా రేవంత్ సానుకూలంగా స్పందించారు. మంత్రులను గాంధీభవన్ కు రప్పించటంలో సక్సెస్ అయిన మహేష్ మరి రేవంత్ ను కూడా పార్టీ ఆపీసుకు రప్పించగలరా ?

Read More
Next Story