రేవంత్ గుణపాఠం నేర్చుకున్నాడా ?
x
Revanth

రేవంత్ గుణపాఠం నేర్చుకున్నాడా ?

జపాన్ పర్యటన నుండి తిరిగివచ్చిన తర్వాత నుండి వారానికి నాలుగురోజులు ఎంఎల్ఏలను కలవాలని డిసైడ్ అయ్యాడు


రేవంత్ రెడ్డి గుణపాఠం నేర్చుకున్నట్లే ఉన్నాడు. అందుకనే తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. జపాన్ పర్యటన నుండి తిరిగివచ్చిన తర్వాత నుండి వారానికి నాలుగురోజులు ఎంఎల్ఏలను కలవాలని డిసైడ్ అయ్యాడు. ఈ విషయాన్ని మంగళవారం జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సీఎల్పీ) సమావేశంలో ఎంఎల్ఏలకు స్వయంగా ప్రకటించాడు. రేవంత్(Revanth) చేసిన ప్రకటనతో ఎంఎల్ఏలంతా ఫుల్లుహ్యాపీగా ఫీలవుతున్నారు. రేవంత్ తాజాప్రకటన వెనుక చంద్రబాబునాయుడు, కేసీఆర్, జగన్, వైఎస్సార్ నుండి గుణపాఠం నేర్చుకున్నట్లే అనిపిస్తోంది. చంద్రబాబు, కేసీఆర్, జగన్ ముఖ్యమంత్రులుగా పనిచేసినపుడు వారికి పార్టీతో సంబంధాలు దాదాపు తెగిపోయేవి. ఇపుడు రేవంత్ పరిస్ధితి కూడా దాదాపు ఇలాగే తయారైంది. తమను రేవంత్ కలవటంలేదనే అసంతృప్తి ఎంఎల్ఏల్లో పెరుగుతున్న విషయాన్ని రేవంత్ గమనించినట్లున్నాడు.

చంద్రబాబు(Chandrababu) విషయాన్నే తీసుకుంటే ఇప్పటికి నాలుగోసారి ముఖ్యమంత్రయ్యారు. అయితే గతంలో సీఎం పనిచేసినపుడు మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలకు అందుబాటులో ఉండేవారుకాదు. తమను చంద్రబాబు కలవటంలేదని ప్రజాప్రతినిధులు బాహాటంగా విమర్శలుచేసినా పట్టించుకునేవారు కాదు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మాత్రం తాను మారినమనిషినని, ఇక నుండి అందరికీ తగిన సమయాన్ని కేటాయిస్తానని పార్టీ వేదికలమీద పదేపదే ప్రకటించేవారు. ఒకసారి అధికారంలోకి వస్తే మళ్ళీ మామూలే. అందుకనే చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో సంబంధాలు కట్ అయిపోతాయి.

ఇక కేసీఆర్(KCR) గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే పదేళ్ళు అధికారంలో ఉన్న కేసీఆర్ మంత్రులనే కలిసేవారు కాదు ఇక ప్రజాప్రతినిధుల గురించి అనుకోవాల్సిన అవసరమేలేదు. ఎవరినైనా తాను కలవాలని అనుకున్నపుడు మాత్రమే ఫామ్ హౌస్ కు పిలిపించుకునేవారు. కలవాలని అనుకోకపోతే మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలు, ఎంఎల్సీలు, సీనియర్ నేతలు ఎంతమొత్తుకున్నా వారాలతరబడి ఒక్కనిముషం కూడా దర్శనభాగ్యం దక్కేదికాదు. దీనివల్ల ఏమైందంటే 2023 ఎన్నికల్లో కేసీఆర్ మీద ప్రజాప్రతినిధులకు పీకలదాకా కోపం పెరిగిపోయింది. ఆకోపమే పార్టీ తరపున పోటీచేసిన అభ్యర్ధుల మీద చూపించారు. పార్టీ గెలుపుకష్టమేనని, పార్టీలోని సీనియర్ నేతలు, క్యాడర్ అభ్యర్ధుల గెలుపుకు పనిచేయటంలేదని రిపోర్టులు అందాయి. దాంతో కేసీఆర్లో టెన్షన్ పెరిగిపోయి సీనియర్ నేతలకు ఫోన్లు చేస్తే చాలామంది పట్టించుకోలేదు. ఫలితంగా బీఆర్ఎస్ ఓడిపోయింది.

ఇక జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy)ది కూడా అదేస్టైల్. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఎంఎల్ఏలు, ఎంపీలు, ఎంఎల్సీలు, నేతలను తరచూ కలిసిన జగన్ సీఎంకాగానే ఒక్కసారిగా అందరికీ దూరమైపోయారు. ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు కలవాలని ప్రయత్నించినా జగన్ అవకాశం ఇవ్వలేదు. ముఖ్యమంత్రిగా ప్రతిరోజు బిజీగా ఉంటారనటంలో సందేహంలేదు. అయితే పార్టీ ప్రజాప్రతినిదులను నెలలతరబడి కలవలేనంత బిజీగా ఉంటారని అంటే ఎవరూ నమ్మలేదు. కలవకూడదని అనుకోబట్టే జగన్ చాలామంది ప్రజాప్రతినిధులను కలవలేదని అర్ధమవుతోంది. వైసీపీ ఓటమిలో ఈవిషయం కూడా కీలకపాత్ర పోషించిందన్నది తర్వాత అందరికీ అర్ధమైంది.

వైఎస్ రూటే సపరేటు

చంద్రబాబు, కేసీఆర్, జగన్, రేవంత్ వ్యవహారశైలితో పోల్చుకుంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్(YSR) వ్యవహారశైలి ప్రత్యేకంగా ఉండేది. ఒకవైపు పాలనాపరమైన వ్యవహారాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు ప్రజాప్రతినిధులను తరచూ కలిసేవారు. ప్రజాప్రతినిధులనే కాదు ప్రజాదర్బార్ పేరుతో ప్రతిరోజు కొన్ని వందలమంది మామూలు జనాలను కూడా కలిసేవారు. సమస్యలు చెప్పుకుని పరిష్కారం పొందుదామని వచ్చేజనాలను వైఎస్సార్ వారంలో ఐదురోజులు ఉదయం పూట కలిసి సమస్యలువిని, అర్జీలు తీసుకుని, వాటిని సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారానికి చొరవచూపించేవారు. వైఎస్సార్ తమను కలవటంలేదని ప్రజాప్రతినిధులు కాని, మామూలు జనాలు కూడా ఏరోజూ అసంతృప్తిని వ్యక్తంచేయలేదు.

సెక్రటేరియట్ కు వచ్చినపుడు లేదా వెళ్ళేటపుడు, పార్టీ ఆఫీసులో కాని లేదా ఇంకెక్కడైనా సమావేశానికి, ఫంక్షన్ కు వెళ్ళినపుడు కూడా తెలిసిన వాళ్ళు కనబడితేచాలు వైఎస్ పిలిపించుకుని భుజంతట్టి పలకరించేవారు. విచిత్రం ఏమిటంటే పైనచెప్పిన చంద్రబాబు, కేసీఆర్, జగన్, రేవంత్ కి రోజుకు 24 గంటలే, వైఎస్సార్ కూ 24 గంటలే. మరి మిగిలిన నలుగురూ ఎక్కడ ఫెయిలయ్యారు ? వైఎస్ ఎక్కడ సక్సెస్ అయ్యారు ? వైఎస్ ఎక్కడ సక్సెస్ అయ్యారంటే టైం మేనేజ్మెంట్ లోనే. ఉన్న 24 గంటలను ఎలా సద్వినియోగంచేసుకోవాలో వైఎస్స్ కు తెలిసినట్లు మిగిలిన వాళ్ళకు తెలీలేదు. పైగా మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే వైఎస్ లో హ్యూమన్ టచ్ చాలా ఎక్కువ. అందుకనే తాను కష్టాల్లో ఉన్నపుడు సాయంచేసిన వారిని పిలిపించుకుని ఏదోరూపంలో మరీ సాయం చేశారు. ఇవన్నీ గమనించిన తర్వాత రేవంత్ తెలివైన నిర్ణయమే తీసుకున్నాడని అనుకోవాలి. నిర్ణయం తీసుకోవటం వేరు దాన్ని ఆచరణలో పెట్టడం వేరు. జపాన్ పర్యటన నుండి తిరిగొచ్చిన తర్వాత ఇపుడు ప్రకటించినట్లుగానే ఎంఎల్ఏలను కలుస్తారో లేదో చూడాలి.

Read More
Next Story