కేటీఆర్ ఆశలపై రేవంత్ నీళ్ళు చల్లేశారా ?
x
Revant and KTR

కేటీఆర్ ఆశలపై రేవంత్ నీళ్ళు చల్లేశారా ?

ఏ కోణంలో చూసినా ఫిరాయింపులపై అనర్హత వేటు పడే అవకాశం దాదాపు లేదనే చెప్పాలి. అనర్హత వేటే లేనపుడు ఇక ఉపఎన్నికల ప్రస్తావన మాత్రం ఎందుకుంటుంది ?


కొద్దిరోజులుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు మరికొందరు నేతలు తొందరలోనే ఉపఎన్నికలు వస్తాయని పదేపదే ఊదరగొడుతున్నారు. ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ తడాఖా చూపిస్తుందంటు చెబుతున్నారు. అసలు ఉపఎన్నికలు ఎందుకు వస్తాయని కేటీఆర్ అండ్ కో చెబుతున్నట్లు ? ఎందుకంటే బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన 10 మంది ఎంఎల్ఏలపై హైకోర్టు అనర్హత వేటు వేయిస్తుంది కాబట్టి ఉపఎన్నికలు తప్పవని కేటీఆర్ చాలా చాలా చెప్పారు. ముగ్గురు ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హతపై నాలుగు వారాల్లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. అప్పటినుండి ఉపఎన్నికలంటు కేటీఆర్ మరింతగా రెచ్చిపోతున్నారు. అయితే తాజా పరిస్ధితిని గమనిస్తే కేటీఆర్ ఉపఎన్నికల ఆశలపై రేవంత్ రెడ్డి నీళ్ళు చల్లేసినట్లే అనిపిస్తోంది.

విషయం ఏమిటంటే శేరిలింగంపల్లి ఎంఎల్ఏ అరెకపూడి గాంధీ బీఆర్ఎస్ ఎంఎల్ఏనే కాని కాంగ్రెస్ ఎంఎల్ఏ కాదని రేవంత్ చేసిన ప్రకటనతో బీఆర్ఎస్ కు మండిపోతోంది. ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ(పీఏసీ) ఛైర్మన్ పదవిలో స్పీకర్ గాంధీని నియమించారు. స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ భగ్గుమన్నది. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన గాందీకి ఛైర్మన్ పదవి ఎలాగిస్తారంటు నానా గోలచేస్తున్నారు. ఈ నేపధ్యంలో గాంధీ మాట్లాడుతు తాను కాంగ్రెస్ లో చేరలేదని ప్రకటించారు. దానికి కౌంటరుగానే బీఆర్ఎస్ ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డి నోటికొచ్చింది ఏదేదో మాట్లాడేసి విషయం మొత్తాన్ని కంపు చేసేశాడు. గాంధీ సాంకేతికంగా బీఆర్ఎస్ ఎంఎల్ఏనే. దీన్ని ఎవరూ కాదనలేరు. అసెంబ్లీ రికార్డుల ప్రకారం గాంధీ కారుపార్టీ ఎంఎల్ఏనే. గాంధీకి స్పీకర్ పీఏసీ ఛైర్మన్ పదవిని ఇస్తారని, గాంధీ తాను కాంగ్రెస్ లో చేరలేదని, బీఆర్ఎస్ ఎంఎల్ఏనే అని ప్రకటిస్తారని బీఆర్ఎస్ నేతలు ఏమాత్రం ఊహించలేదు.

ఊహించని రీతిలో పరిణామాలు జరిగిపోయేటప్పటికి దాన్ని ఎలా ఎదుర్కోవాలో చేతకాక కౌశిక్ రెడ్డి లాంటి ఆవేశపరులు నోటికొచ్చింది మాట్లాడేసి విషయాన్ని తప్పుదోవ పట్టించేశారు. గాంధీ ప్రకటనతో ఏమైందంటే ఒక్క గాంధీ మాత్రమే కాదు మిగిలిన తొమ్మిదిమంది ఎంఎల్ఏలు కూడా తాము బీఆర్ఎస్ ఎంఎల్ఏలమే అని చెప్పుకునే అవకాశం వచ్చింది. నియోజకవర్గాల అభివృద్ధికి నిధుల కోసం తాము రేవంత్ ను కలిసినట్లు చెప్పుకుంటున్నారు. కాకపోతే ఫిరాయింపుల్లో ఖైరతాబాద్ ఎంఎల్ఏ దానం నాగేందర్ ఇబ్బంది పడచ్చంటున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ తరపున గెలిచి రేవంత్ తో అంటకాగటంతో ఆగలేదు. ఈమధ్యనే జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ ఎంపీగా పోటీచేశారు. టెక్నికల్ గా దానం ఫిరాయింపుల నిరోధక చట్టానికి దొరికినట్లే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఇదంతా జరిగేది ఎప్పుడంటే ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేయాలని అనుకున్నపుడు మాత్రమే. స్పీకర్ అనుకోనంత వరకు ఏ కోర్టు కూడా ఫిరాయింపులను ఏమీ చేయలేందు. తనంతట తానుగా ఏ కోర్టు కూడా ఫిరాయింపుల మీద అనర్హత వేటు వేసేందుకు లేదు. ఎంఎల్ఏల మీద అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్ కు తప్ప ఇంకెవరికీ లేదు. ఎంతకాలమైనా, ఎన్నిసార్లయినా ఫిరాయింపుల విషయంలో ఏదో నిర్ణయం తీసుకోమని కోర్టులు స్పీకర్లకు సూచించగలవంతే. స్పీకర్ ఏ నిర్ణయమూ తీసుకోలేదని చెప్పి తనంతట తానుగా కోర్టు ఫిరాయింపులపై అనర్హత వేటు వేసేందుకు లేదు. ఈ విషయం ఫిరాయింపులకు బాగా తెలుసు కాబట్టే హ్యాపీగా ఉన్నారు.

బీఆర్ఎస్ హయాంలో జరిగిందే ఇపుడు కాంగ్రెస్ హయాంలో కూడా జరుగుతోంది. కాబట్టి అప్పుడూ ఫిరాయింపుల మీద స్పీకర్ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పటి స్పీకర్ కూడా నిర్ణయం తీసుకుంటారని అనుకునేందుకు లేదు. ఫిరాయింపు ఎంఎల్ఏలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు విషయంలో ఏదో నిర్ణయం తీసుకోమని కోర్టు ఆదేశించింది అసెంబ్లీ సెక్రటరీని. ఎంఎల్ఏల మీద యాక్షన్ తీసుకునే అధికారం కార్యదర్శికి లేదు. స్పీకర్ అనుమతిలేకుండా కార్యదర్శి ఏ పనీచేసేందుకు లేదు కాబట్టి ఫిరాయింపులకు నోటీసులు వెళ్ళే అవకాశంలేదు, విచారణ జరగదు.

ఒకవేళ స్పీకరే పై ముగ్గురు ఫిరాయింపులకు నోటీసులు ఇచ్చి విచారించినా తాము బీఆర్ఎస్ ఎంఎల్ఏలమే అని కాంగ్రెస్ లో చేరలేదని చెబుతారు. అదే విషయాన్ని స్పీకర్ కూడా కోర్టుకు తెలియజేస్తారు. రేవంత్ సమక్షంలో తమ మెడలో కనిపించిన కాంగ్రెస్ కండువాలను కూడా ఫిరాయింపులు సమర్ధించుకుంటారు. తనకు వేసిన కండువా గుడిలో ప్రముఖులకు కప్పే కండువానే అని గాంధీ సమర్ధించుకున్న విషయం తెలిసిందే. కాబట్టి ఏ కోణంలో చూసినా ఫిరాయింపులపై అనర్హత వేటు పడే అవకాశం దాదాపు లేదనే చెప్పాలి. అనర్హత వేటే లేనపుడు ఇక ఉపఎన్నికల ప్రస్తావన మాత్రం ఎందుకుంటుంది ? సో, కేటీఆర్ ఉపఎన్నికల ఆశలపై రేవంత్ నీళ్ళు జల్లినట్లేనా ?

Read More
Next Story