
ఫిరాయింపుల విషయంలో బీఆర్ఎస్ ఇక్కడే ఫెయిలైందా ?
బీఆర్ఎస్ ఎంఎల్ఏలు సరైన ఆధారాలను చూపించలేకపోయిన కారణంగా ఐదుగురిపై ఫిరాయింపుల ఆరోపణలను కొట్టేస్తున్నట్లు ప్రకటించారు
పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పదిమంది బీఆర్ఎస్ ఎంఎల్ఏల్లో ప్రస్తుతానికి ఐదుగురు సేఫ్ అనే అనుకోవాలి. ఎందుకంటే ఐదుగురు బీఆర్ఎస్(BRS Defection MLAs) ఎంఎల్ఏలు కాంగ్రెస్ లోకి ఫిరాయించారనేందుకు తగిన ఆధారాలు లేవని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Assembly Speaker Gaddam Prasad Kumar) బుధవారం తీర్పిచ్చారు. బీఆర్ఎస్ తరపున గెలిచిన పదిమంది ఎంఎల్ఏలు కాంగ్రెస్ లోకి ఫిరాయించారని (BRS)బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తో పాటు కొందరు ఎంఎల్ఏలు నానా గోలచేస్తున్నారు. పదిమందిపైన అనర్హత వేటు వేయించాలని ముందు హైకోర్టులో కేసులు దాఖలు చేశారు. వీళ్ళ వాదనను హైకోర్టు పట్టించుకోలేదు.
అందుకని సుప్రింకోర్టులో కేసులు వేశారు. బీఆర్ఎస్ తో పాటు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పదిమంది వాదనలు విన్న సుప్రింకోర్టు అనర్హత వేటు అంశాన్ని తేల్చాలని స్పీకర్ ను ఆదేశించింది. అనర్హత విషయమై తగిన నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్ కు సుప్రింకోర్టు మూడు మాసాల సమయమిచ్చింది. మూడుమాసాల తర్వాత గడువు సరిపోలేదని స్పీకర్ అడిగితే మరో నెలరోజులు సమయమిచ్చింది. సుప్రింకోర్టు ఇచ్చిన నాలుగుమాసాల గడువు 18వ తేదీతో ముగుస్తుంది. అందుకనే బుధవారం ఐదుగురు ఎంఎల్ఏల అనర్హతపై స్పీకర్ తీర్పు ప్రకటించారు. పార్టీ ఫిరాయించారు అనేందుకు బీఆర్ఎస్ ఎంఎల్ఏలు సరైన ఆధారాలను చూపించలేకపోయిన కారణంగా ఐదుగురిపై ఫిరాయింపుల ఆరోపణలను కొట్టేస్తున్నట్లు ప్రకటించారు.
స్పీకర్ తీర్పును సహజంగానే బీఆర్ఎస్ ఎంఎల్ఏలు వ్యతిరేకిస్తారు. కాబట్టి ఈరోజు తీర్పును వ్యతిరేకిస్తు పార్టీ ఎంఎల్ఏలు కేపీ వివేకానందగౌడ్, పల్లా రాజేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతు సుప్రింకోర్టులో ఛాలెంజ్ చేయబోతున్నట్లు చెప్పారు. స్పీకర్ తీర్పు ఏకపక్షంగా ఉందని మండిపోయారు. సరే వీళ్ళ సవాళ్ళు, ప్రకటనలు, హెచ్చరికలను కాసేపు పక్కనపెట్టేద్దాము. అసలు బీఆర్ఎస్ ఎక్కడ ఫెయిలైంది ? ఏడాదిన్నర నుండి ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఒక ప్లాన్ ప్రకారం నానా రచ్చచేసిన పార్టీ ఎంఎల్ఏలు చివరకు వచ్చేసరికి ఎక్కడ విఫలయమయ్యారు ? పార్టీ ఫిరాయించారు అనేందుకు వీళ్ళు సరైన ఆధారాలను ఎందుకు చూపించలేకపోయారు ? అన్నదే ఇక్కడ పాయింట్.
అసలు విషయానికి వస్తే బీఆర్ఎస్ ఎంఎల్ఏలు చేస్తున్న వాదన ఏమిటో చూద్దాం.
1. పదిమంది ఫిరాయింపు ఎంఎల్ఏలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.
2. పదిమంది ఎంఎల్ఏలకు రేవంత్ కండువాలు కప్పారు.
3. తరచూ పదిమంది ముఖ్యమంత్రిని కలుస్తున్నారు
4. పదిమంది ఫిరాయింపులు పార్టీ ఆఫీసుకు రావటంలేదు, కార్యక్రమాల్లో పాల్గొనటంలేదు అని మాత్రమే చెబుతున్నారు.
ఫిరాయింపుల సమాధానాలు ఏమిటో చూద్దాం.
1. తాము ముఖ్యమంత్రిని కలిసింది నిజమే అని ఒప్పుకున్నారు. అయితే తాము రేవంత్ ను కలిసింది నియోజకవర్గం అభివృద్ధికోసమే అని అంటున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కోసం ఎంఎల్ఏలు సీఎంని కలవటం తప్పు ఎలాగవుతుంది ? నియోజకవర్గం అభివృద్ధికి ముఖ్యమంత్రిని కలవక ఇంకెవరిని కలవాలి ? అన్నది వీళ్ళ పాయింట్
2. తాము రేవంత్ ను కలిసినపుడు మర్యాదపూర్వకంగా సీఎం తమకు కండువాలు కప్పారని అంటున్నారు. తమకు కప్పింది కాంగ్రెస్ పార్టీ కండువాలు కావని, మువ్వనెల కండువాలని అంటున్నారు.
3. నియోజకవర్గం అభివృద్ధికి నిధుల కోసమే తాము సీఎంను తరచూ కలుస్తున్నట్లు చెబుతున్నారు.
4. వివిధ కారణాలతో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వమే తమను దూరంగా పెట్టింది కాబట్టే తాము పార్టీ ఆఫీసుకు వెళ్ళటంలేదు, కార్యక్రమాల్లో పాల్గొనటంలేదు అంటున్నారు. బీఆర్ఎస్ లేవనెత్తుతున్న ప్రశ్నలకు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పదిమంది ధీటుగానే బదులిస్తున్నారు.
పనిలోపనిగా పదిమంది ఎదురుదాడి కూడా చేస్తున్నారు. తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని అనేందుకు వీళ్ళు ఒక ఆధారం చూపిస్తున్నారు. అదేమిటంటే పార్టీ ఫండ్ పేరుతో ప్రతి ఎంఎల్ఏ జీతంలో నుండి నాయకత్వం ప్రతినెలా కొంతమొత్తాన్ని మినహాయించుకుంటుందట. తమ జీతాల్లో నుండి కూడా పార్టీ ఫండ్ కోసం ప్రతినెలా కొంతమొత్తాన్ని మినహాయించుకుంటున్నట్లు వీళ్ళు బ్యాంక్ స్టేట్మెంట్ ను స్పీకర్ కు చూపించారు. స్టేట్మెంట్ల ప్రకారం ప్రతినెలా బీఆర్ఎస్ ఫండ్ కోసం పదిమంది జీతాల్లో పార్టీ కోత పెడుతోందని స్పీకర్ కు అర్ధమైంది. ఈ పాయింట్ విషయంలో ఫిరాయింపుల ఎదురుదాడికి బీఆర్ఎస్ ఎంఎల్ఏల దగ్గర కౌంటర్ లేదు.
ఫిరాయింపు ఎంఎల్ఏల్లో ఐదుగురికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎలాంటి ఆధారాలు చూపించలేదని స్పీకర్ నిర్ణయానికి వచ్చారు. అందుకనే ఫిరాయింపులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎంఎల్ఏల ఆరోపణలను కొట్టేసింది. సో, అందుబాటులోని సమాచారం ప్రకారం పదిమంది ఫిరాయింపు ఎంఎల్ఏల ఆరోపణలపై కేటీఆర్ అండ్ కో గోలచేయటమే తప్ప కాంక్రీటుగా ఎలాంటి ఆధారాలను చూపించలేకపోయిందని అర్ధమవుతోంది. ఈ కారణంగానే కారుపార్టీ ఎంఎల్ఏల వాదన వీగిపోయింది.
గురువారం మరో ముగ్గురు ఎంఎల్ఏలు కాలేయాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్ పైన ఉన్న ఆరోపణలను కూడా స్పీకర్ కొట్టేసేందుకే ఎక్కువ అవకాశాలున్నాయని అర్ధమవుతోంది. మరి మిగిలిన ఇద్దరు ఎంఎల్ఏలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ విషయం ఏమిటి ? వీళ్ళిద్దరి వ్యవహారంకు మిగిలిన ఎనిమింది మందికి చాలా తేడాలున్నాయి. అవేమిటంటే బీఆర్ఎస్ ఎంఎల్ఏ దానం నాగేందర్ 2024 పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎంపీగా పోటీచేశారు. బీఆర్ఎస్ ఎంఎల్ఏ కాంగ్రెస్ ఎంపీగా ఎలా పోటీచేస్తారు ? అలాగే వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ తరపున పోటీచేసిన కడియం కావ్య నామినేషన్ పత్రాలపై ప్రపోజర్ గా బీఆర్ఎస్ ఎంఎల్ఏ కడియం శ్రీహరి ఎలా సంతకంచేస్తారు ? కాబట్టి ఈ టెక్నికల్ పాయింట్ల ఆధారంగా దానం, కడియంపైన అనర్హత వేటుపడేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని సమాచారం. సో, ఇపుడు అర్ధమైంది కదా బీఆర్ఎస్ వాదనలో ఉత్త డొల్ల తప్ప సరైన పసలేదని. అలాగే కారుపార్టీ ఎక్కడ ఫెయిలైందో కూడా అర్ధమయ్యే ఉంటుంది.

