బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ ఒంటరైపోయిందా ?
x
KCR and KTR

బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ ఒంటరైపోయిందా ?

బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిందే అనికాని లేకపోతే చేయకూడదని కానీ ఏమీచెప్పలేకపోతోంది.


తొందరలో జరగబోతున్న స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరైనట్లే ఉంది. ఏవిషయంలో అంటే బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు విషయంలో. ఎలాగంటే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుచేయటానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. బీసీరిజర్వేషన్లను(BC Reservations) బీజేపీ, వామపక్షాలు, ఏఐఎంఐఎం కూడా ఆహ్వానించాయి. ఒక్క బీఆర్ఎస్(BRS) మాత్రమే ఈ విషయంలో ఇప్పటివరకు తన స్టాండ్ ప్రకటించలేదు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిందే అనికాని లేకపోతే చేయకూడదని కానీ ఏమీచెప్పలేకపోతోంది. చివరకు కల్వకుంట్ల కవిత(Kavitha) కూడా బీసీ రిజర్వేషన్లను ఆహ్వానించారు.

స్ధానికసంస్ధల ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీష్ రావు తదితరులు చెబుతున్నారే కాని రిజర్వేషన్ల అమలు విషయాన్ని మాత్రం మాట్లాడటంలేదు. ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపికపై ప్రతిరోజు సమీక్షలు నిర్వహిస్తున్నారు. చివరకు బీఆర్ఎస్ ఎంఎల్సీ, పార్టీనుండి సస్పెండ్ అయిన నేత, కేసీఆర్ కూతురు కల్వకుంట్లకవిత కూడా 42శాతం రిజర్వేషన్లను స్వాగతించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుచేయకుండా స్ధానికసంస్ధల ఎన్నికలు నిర్వహించకూడదని గట్టిగా డిమాండ్ కూడా చేస్తున్నారు. ఈపరిస్ధితుల్లో అధినేత కేసీఆర్ లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎవరూ రిజర్వేషన్లపై నోరుమెదపటంలేదు. క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్ ఒంటరైనట్లే ఉంది.

బీఆర్ఎస్ విచిత్రమైన సమస్యలో ఇరుక్కుంది. అదేమిటంటే బీసీలకు 42శాతం రిజర్వేషన్లను ఆహ్వానిస్తే ఆ క్రెడిట్ మొత్తం రేవంత్ కు దక్కుతుంది. రేవంత్ వల్లే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని అంగీకరించినట్లవుతుంది. ఒకవేళ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తే బీసీసామాజికవర్గానికి దూరమవ్వటం ఖాయం. ఎందుకంటే ఇపుడు తెలంగాణలో బీసీ వాదం చాలాబలంగా వినబడుతోంది. ఈ సమయంలో 42శాతం రిజర్వేషన్లను బీఆర్ఎస్ వ్యతిరేకించినా లేదా నెగిటివ్ గా మాట్లాడినా అంతే సంగతులు. బీసీ సామాజికవర్గం మొత్తం బీఆర్ఎస్ కు వ్యతిరేకమైతే స్ధానికసంస్ధల ఎన్నికలే కాదు భవిష్యత్తులో జరగబోయే ఏఎన్నికలో కూడా కారుపార్టీ గెలుపు అనుమానమనే చెప్పాలి. ఈవిషయం బాగా తెలుసుకాబట్టే కేసీఆర్ లేదా కేటీఆర్ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏమీ మాట్లాడలేకపోతున్నారు. ఇదే భవిష్యత్తులో బీఆర్ఎస్ కు పెద్ద మైనస్ అవబోతోంది.

ఎలాగంటే, స్ధానికసంస్ధలఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుకు తమ ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రయత్నిస్తే బీఆర్ఎస్ సహకరించలేదని ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీలో రిజర్వేషన్లకు మద్దతిచ్చినా బయటమాత్రం వ్యతిరేకించిందని రేవంత్, మంత్రులు, ఎంఎల్ఏలతో పాటు సీనియర్ నేతలు చేసే ప్రచారాన్ని తిప్పికొట్టడం బీఆర్ఎస్ కు కష్టమైనదే. బీసీ రిజర్వేషన్ల చట్టబద్దతపై ఈనెల 6వ తేదీన సుప్రింకోర్టులో, 8వ తేదీన హైకోర్టులో విచారణ జరగబోతోంది. ఆ విచారణ తర్వాత న్యాయస్ధానాలు ఎలాంటి తీర్పిస్తాయో అనే ఉత్కంఠ పెరిగిపోతోంది. బీసీ 42శాతం రిజర్వేషన్లకు రేవంత్ ప్రభుత్వం కల్పించిన చట్టబద్దతను న్యాయస్ధానాలు ఆమోదిస్తాయని అనుకునేందుకు లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించటం గతంలో సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధం. కాబట్టి రిజర్వేషన్ల జీవోను కోర్టులు కొట్టేయటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇదే జరిగితే అప్పుడు ప్రభుత్వం లేదా పార్టీలు ఏమిచేస్తాయి ? చేయటానికి ఏమీలేదు ప్రభుత్వం మళ్ళీ అప్పీలుకు పోవటం లేకపోతే రిజర్వేషన్లకు చట్టబద్దతనువదిలేసి బీసీలకు 42శాతం రిజర్వేషన్లను పార్టీలపరంగా అమలుచేయటమే. పార్టీపరంగా బీసీలకు రిజర్వేషన్లు అమలుచేయాలంటే 42శాతం మాత్రమే ఎందుకు 50శాతం లేదా 60శాతం కూడా చేయచ్చు అది రేవంత్ సామర్ధ్యంమీద ఆధారపడుంది. రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీచేసిన జీవోను కోర్టులు కొట్టేసినా కూడా బీఆర్ఎస్ నోరుతెరిచే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. బీఆర్ఎస్ ఏమిమాట్లాడినా దాన్ని కాంగ్రెస్ అడ్వాంటేజ్ తీసుకుని ఎన్నికల్లో బీసీ సామాజికవర్గాల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నంచేయటం ఖాయం. రిజర్వేషన్ల అంశంపై కోర్టులు ఏ విధంగా స్పందిస్తాయి ? దాని పర్యవసానాలు ఎలాగుంటాయో చూడాల్సిందే.

Read More
Next Story