
కొండా ఫ్యామిలీ ‘వెయిట్’ పెరిగిందా ?
కొండా దంపతులకు ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) మద్దతుగా నిలబడినట్లు సమాచారం
ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు మొత్తం పార్టీలోనే మంత్రి కొండా సురేఖ దంపతుల ‘వెయిట్’ పెరిగిందా ? అవుననే అంటున్నాయి పార్టీవర్గాలు. కొండా దంపతులకు ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) మద్దతుగా నిలబడినట్లు సమాచారం. ఇంతకీ విషయం ఏమిటంటే కొద్దిరోజులుగా వరంగల్ జిల్లాలో కొండాసురేఖ, కొండా మురళికి బలమైన వ్యతిరేకవర్గం తయారైంది. మంత్రి దంపతులతో విబేధాల కారణంగా ముగ్గురు ఎంఎల్ఏలు నాయిని రాజేంద్రరెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డితో పాటు ఎంఎల్సీ బస్వరాజ్ సారయ్య తదితరులు ఒక జట్టుగా తయారయ్యారు. మంత్రి దంపతుల మీద వ్యతిరేకవర్గం ఫిర్యాదులు చేసింది. పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) తో పాటు పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(Bomma) ను కూడా ఫిర్యాదు చేసింది వ్యతిరేకవర్గం. అలాగే పార్టీ క్రమశిక్షణాకమిటి ఛైర్మన్ మల్లురవిని కూడా కొండా దంపతులపై వ్యతిరేకవర్గం ధ్వజమెత్తింది. ఫిర్యాదులు చేయటమే కాకుండా అందుకు ఆధారాలు అంటు పెద్ద రిపోర్టే అందించింది.
తమకు అందిన ఫిర్యాదు ఆధారంగా మంత్రి దంపతులను మీనాక్షి, బొమ్మ, మల్లు పిలిచి మాట్లాడారు. అప్పుడు తమ వ్యతిరేకవర్గంపై దంపతులు కూడా అనేక ఫిర్యాదులు చేసి ఆధారాలంటు 16 పేజీల రిపోర్టు అందించారు. దాంతో ఎవరిమీద యాక్షన్ తీసుకోవాలో తెలీక మీనాక్షి తలపట్టుకున్నారు. ఈ వివాదం ఇలా నడుస్తుండగానే ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరిగిందని పార్టీవర్గాల సమాచారం. ఇంతకీ అదేమిటంటే రేవంత్ ఇంటికి తన కూతురు కొండా సుస్మితా పటేల్(Konda Susmitha Patel) ను తీసుకుని మంత్రి కొండా సురేఖ(Konda Surekha) వెళ్ళారు. అప్పటికే అక్కడ రేవంత్ తో బొమ్మ మాట్లాడుతున్నారు. సురేఖ వచ్చిన విషయం తెలియగానే రేవంత్ ఇద్దరినీ లోపలకు పిలిపించారు. తమ కుటుంబంమీద వ్యతిరేక గ్రూపు చేస్తున్న ఆరోపణలు, విమర్శలను రేవంత్ దగ్గర మంత్రి ప్రస్తావించారు. అప్పుడు రేవంత్ మాట్లాడుతు ‘కొండా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడవద్దని జిల్లాలోని ఎంఎల్ఏలందరికీ చెప్పాల’ని బొమ్మను ఆదేశించారు.
కొండా ఫ్యామిలీ అండ పార్టీకి వరంగల్ జిల్లాలో చాలా అవసరం అని అన్నారు. ‘మొన్నటి ఎన్నికల్లో చాలామంది ఎంఎల్ఏల గెలుపులో కొండా మురళి(Konda Murali) పాత్ర చాలా ఉందన్న విషయాన్ని ఎంఎల్ఏలు గుర్తించటంలేదు’ అని రేవంత్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని బొమ్మ ముందే మంత్రికి రేవంత్ భరోసా ఇచ్చినట్లు పార్టీ నేతలు చెప్పారు. రేవంత్ ఆదేశాల మేరకు బొమ్మ రెండు మూడు రోజుల్లోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మంత్రులు, ఎంఎల్ఏలతో సమావేశం నిర్వహించబోతున్నట్లు పార్టీవర్గాల సమాచారం.
రేవంత్ తాజా ఆదేశాల తర్వాత బొమ్మ మంత్రి వ్యతిరేక గ్రూపుతో ఏమి మాట్లాడుతారు ? తొందరలోనే నిర్వహించబోయే సమావేశంలో ఎలాంటి సందేశాన్ని ఇస్తారన్నది ఆసక్తిగా మారింది. పార్టీవర్గాల సమాచారం ప్రకారమైతే పార్టీలో కొండా దంపతుల వెయిట్ పెరిగినట్లే అర్ధంచేసుకోవాలి. మరి ఆ వెయిట్ ను కొండా దంపతులు ఏమేరకు నిలుపుకుంటారో చూడాలి.