ACB case on KTR|కేటీఆర్ కు ముహూర్తం ఫిక్సయ్యిందా ?
ప్రభుత్వ వర్గాల సమాచారం ఏమిటంటే అసెంబ్లీ సమవేశాలు అయిపోయిన తర్వాత మాత్రమే కేటీఆర్ మీద ఏసీబీ కేసు నమోదుచేసి విచారణకు నోటీసులు జారీచేస్తుంది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన కేసు నమోదు, విచారణకు నోటీసులు ఇచ్చే విషయంలో ముహూర్తం ఫిక్సయినట్లే అనిపిస్తోంది. ఈ ఫార్ములా కార్ రేసు (Formula E Car Race)నిర్వహణ ఏర్పాట్లలో జరిగిన అవినీతికి మాజీమంత్రి కేటీఆర్( Case on KTR) మీద కేసు నమోదుచేసి విచారణ చేయాలని చీఫ్ సెక్రటరి శాంతికుమారి ఏసీబీ డైరెక్టర్ జనరల్(ACB Director General) కు లేఖ రాశారు. కేటీఆర్ మీద ఏ1గాను అప్పట్లో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, హెచ్ఎండీఏ సెక్రటరీగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ మీద ఏ2గా కేసులు నమోదుచేసి విచారించాలని చీఫ్ సెక్రటరీ నుండి ఆదేశాలు జారీ అయ్యాయి. పై ఇద్దరితో పాటు మరికొందరిపైనా కేసులు నమోదుచేసి విచారించేందుకు ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది కాబట్టి ఇక చేయాల్సిందంతా ఏసీబీ అధికారులే.
ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే కేటీఆర్ పైన ఏసీబీ ఉన్నతాధికారులు ఎప్పుడు కేసు నమోదుచేస్తరనే విషయమై తెలంగాణా రాజకీయాల్లో హాట్ హాట్ గా చర్చలు జరుగుతున్నాయి. అయితే ప్రభుత్వ వర్గాల సమాచారం ఏమిటంటే అసెంబ్లీ సమవేశాలు అయిపోయిన తర్వాత మాత్రమే కేటీఆర్ మీద ఏసీబీ కేసు నమోదుచేసి విచారణకు నోటీసులు జారీచేస్తుంది. ఈనెల 20వ తేదీవరకు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు(Assembly Winter Session) జరుగుతాయి. సమావేశాలు జరుగుతున్నపుడు కేసునమోదుచేసి విచారణకు నోటీసు ఇస్తే సభలో పెద్ద గోల జరగటం ఖాయమని అధికారపక్షానికి తెలుసు. అసెంబ్లీ వేదికగా జరిగే గొడవలు ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా లైవ్ రిలేలో జనాలు చూస్తారు. కేసునమోదు చేసి విచారణకు పిలవగానే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు, క్యాడర్ గోలచేయటం ఖాయం. కేటీఆర్ ను విచారణకు పిలిచిన ఏసీబీ అధికారులు అరెస్టుచేసే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
కేటీఆర్ అరెస్టు జరిగితే రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలకు బీఆర్ఎస్ విఘాతం కలిగించే అవకాశాలున్నాయని ప్రభుత్వం అనుమానిస్తోంది. దాని ప్రభావం అసెంబ్లీ సమవేశాలపైన పడుతుంది. కాబట్టి అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత కేటీఆర్ మీద కేసునమోదుచేసి విచారణకు పిలిచినా రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చన్నది ప్రభుత్వం ఆలోచన. ఎందుకంటే అసెంబ్లీ సమవేశాల సందర్భంగా రాష్ట్రంలోని ఎక్కడెక్కడి పోలీసులను ఉన్నతాధికారులు డ్యూటీ వేసి హైదరాబాదుకు పిలిపించారు. కాబట్టి జిల్లాల్లో పోలీసుల సంఖ్య తగ్గిపోయింది. అసెంబ్లీ సమావేశాలు అయిపోతే జిల్లాల నుండి వచ్చిన పోలీసులు మళ్ళీ తమ జిల్లాలకు వెళిపోతారు. పైగా అసెంబ్లీని వేదికగా చేసుకుని బీఆర్ఎస్ రచ్చచేయనీయకుండా ఆపినట్లుంటుంది. అందుకనే 20వ తేదీ తర్వత ఎప్పుడైనా కేటీఆర్ మీద కేసు పెట్టి విచారణకు నోటీసులు జారీచేసే అవకాశాలున్నాయని సమాచారం. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.
కేసులు నిలుస్తాయా ?
ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణ ఏర్పాట్ల పేరుతో భారీ అవినీతి జరిగిందని ఇప్పటికే ఏసీబీ నిర్ధారించింది. రు. 55 కోట్లను ఆర్ధికశాఖ, ఆర్బీఐ అనుమతి లేకుండానే విదేశీకంపెనీకి తరలించినట్లు ఏసీబీ సాక్ష్యాధారాలను సేకరించింది. కేటీఆర్ ఫోన్లో చెప్పిన ఆదేశాల ప్రకారమే తాను నిధులను విదేశీకంపెనీకి బదిలీచేసినట్లు అర్వింద్ కుమార్ అంగీకరించారు. ఇదే విషయాన్ని చీఫ్ సెక్రటరీ జరిపిన విచారణలో అర్వింద్ రాతమూలకంగా ఇచ్చారు. అనముతులు తీసుకోకుండానే రు. 55 కోట్లను బదిలీచేయటంలోనే అవినీతి జరిగిందని ప్రభుత్వం అంటోంది. అయితే నిధుల బదిలీకి ప్రత్యేకించి ఎవరి అనుమతి అవసరంలేదని కేటీఆర్ పదేపదే చెబుతున్నారు. తన ఆదేశాలతోనే అర్వింద్ నిధులను బదిలీచేశారని కేటీఆర్ బహిరంగంగానే ప్రకటించారు.
ఇదే విషయమై ప్రముఖ లాయర్ రచనారెడ్డి(Lawyer Rachana Reddy) మాట్లాడుతు కేటీఆర్ మీద నమోదైన కేసులు నిలబడతాయని తాను అనుకోవటంలేదన్నారు. ఇక్కడ మనీల్యాండరింగ్ అన్న ప్రస్తావనే లేదన్నారు. ఒక కంపెనీ ఖాతాకు తెలంగాణా ప్రభుత్వం ఖాతా నుండి నిధులు బదిలీ జరిగినపుడు ఇక హవాలా(Hawala), మనీ ల్యాండరింగ్(Money Laundering) జరిగేందుకు అవకాశమే లేదన్నారు. హవాలా, మనీ ల్యాండరింగ్ అంటేనే బ్లాక్ మనీ ట్రాన్స్ ఫర్ అని చెప్పారు. ఇక్కడ బదిలీ అయ్యిందంతా నూరుశాతం వైట్ మనీ అయినపుడు ఇక హవాలా, మనీ ల్యాండరింగ్ ఎక్కడ జరిగిందని రచన ఎదురు ప్రశ్నించారు.